Union Budget 2024 : మధ్యంతర బడ్జెట్ ను తయారు చేసింది వీళ్లే... ఇప్పుడెక్కడున్నారంటే...
బడ్జెట్ తయారీలో పాల్గొన్న అధికారులు ప్రస్తుతం 'లాక్-ఇన్ పీరియడ్'లో ఉన్నారు. బడ్జెట్ గోప్యతను కాపాడడం కోసం హల్వా వేడుక తరువాత ఇలా బాహ్యప్రపంచంతో సంబంధాలు లేకుండా ఉంటారు.
ఢిల్లీ : ఫిబ్రవరి 1న, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన వరుసగా ఆరవ బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రెండవ టర్మ్‌లో చివరిది. ఈ ఏడాది ఏప్రిల్-మేలో ప్రభుత్వం సాధారణ ఎన్నికలకు వెళ్లబోతున్న క్రమంలో జనవరి 24న మధ్యంతర బడ్జెట్ తయారీ ప్రక్రియ చివరి దశను సూచిస్తూ, సాంప్రదాయ ప్రీ-బడ్జెట్ 'హల్వా' వేడుక జరిగింది.
పూర్తి బడ్జెట్ జూలైలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం ఆ తరువాత సమర్పిస్తుంది. ఇది ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమై, మరుసటి సంవత్సరం మార్చి 31న ముగుస్తుంది.
బడ్జెట్ తయారీలో ఏ అంశాలున్నాయి అనే దానిమీద తీవ్రంగా చర్చ నడుస్తోంది. అనేక అంచనాలు, ఆశలు వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలోనే బడ్జెట్ లోని అంశాలు బైటికి పొక్కకుండా ఉండేందుకు బడ్జెట్ తయారీలో పాల్గొన్న అధికారులందరూ కుటుంబంతో, బాహ్యప్రపంచంతో సంబంధం లేకుండా.. ఫోన్లు కూడా లేకుండా ఐసోలేట్ అవుతారు. దీన్నే 'లాక్-ఇన్ పీరియడ్' అంటారు. ప్రస్తుతం ఈ అధికారులంతా ఈ పీరియడ్ లోకి ప్రవేశించారు. బడ్జెట్ సమర్పణ ముగిసిన తర్వాత మాత్రమే వీరంతా బయటకు వస్తారు.
అలా 'బడ్జెట్ టీమ్'లో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తో పాటు పాల్గన్న కొంతమంది కీలక వ్యక్తులు వీరే..
నిర్మలా సీతారామన్ : అధికార బిజెపి సీనియర్ నాయకురాలు, భారతదేశపు మొట్టమొదటి పూర్తికాల మహిళా ఆర్థిక మంత్రి, గతంలో మొదటి పూర్తికాల మహిళా రక్షణ మంత్రి. కర్ణాటక నుండి రాజ్యసభ సభ్యురాలైన సీతారామన్ మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా ఆరు సార్లు బడ్జెట్‌లను సమర్పించిన రెండవ ఆర్థిక మంత్రి అవుతారు.
టీవీ సోమనాథన్ : ఆర్థిక కార్యదర్శి తమిళనాడు కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (IAS) అధికారి. సోమనాథన్ అంతకుముందు ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్నారు. ఆయన ఆర్థికశాస్త్రంపై 80కి పైగా పేపర్లు, వ్యాసాలను ప్రచురించడంతో పాటు రెండు పుస్తకాలను రచించారు.
అజయ్ సేథ్ : డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ (డీఈఏ) సెక్రటరీ. ఈయన కూడా 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. కర్ణాటక కేడర్ నుండి వచ్చారు. గత సంవత్సరం, అతను జీ20 బ్లాక్ ఫైనాన్స్ ట్రాక్‌కు ఇన్‌ఛార్జ్ అధికారిగా పనిచేశారు. సెప్టెంబరు 2023లో, భారతదేశం మొదటిసారిగా జీ20 శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది.
తుహిన్ కాంత పాండే : డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (DIPAM) కార్యదర్శి. పంజాబ్ కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. పాండే ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించే ప్రయత్నాలకు నాయకత్వం వహించడంతోపాటు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO)కి ప్రసిద్ది చెందారు.
సంజయ్ మల్హోత్రా : రెవెన్యూ కార్యదర్శి రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్ బ్యూరోక్రాట్. మల్హోత్రా గతంలో ఆర్థిక సేవల విభాగానికి నేతృత్వం వహించారు.
వివేక్ జోషి : బడ్జెట్‌పై ఎఫ్‌ఎమ్‌కి అగ్రశ్రేణి సలహాదారుల సమూహంలో సరికొత్తగా ఒకరు, జోషి నవంబర్ 2022లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఆర్థిక సేవల విభాగం కార్యదర్శిగా చేరారు. అతను హర్యానా కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.
వి అనంత నాగేశ్వరన్ : ప్రధాన ఆర్థిక సలహాదారు (సిఇఎ) ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమస్యలపై సీతారామన్‌కు 'సమీప సలహాదారుల'లో ఒకరు. సీఈఏగా నాగేశ్వరన్ బడ్జెట్‌కు ముందు విడుదలయ్యే ఆర్థిక సర్వేకు కూడా బాధ్యత వహిస్తారు. అయితే, ఈ సంవత్సరం బడ్జెట్ మధ్యంతరంగా ఉండటంతో అది జరగలేదు.