- Home
- Business
- NDTV షేర్లలో తగ్గని దూకుడు..వరుసగా 5 వ రోజు కూడా అప్పర్ సర్క్యూట్, అదానీ గ్రూపు కొనుగోలు వార్తలతో జోష్...
NDTV షేర్లలో తగ్గని దూకుడు..వరుసగా 5 వ రోజు కూడా అప్పర్ సర్క్యూట్, అదానీ గ్రూపు కొనుగోలు వార్తలతో జోష్...
NDTV షేర్లు వరుసగా 5 రోజులుగా స్టాక్ మార్కెట్లలో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా ఈ స్టాక్ దూకుడు వెనుక, కంపెనీని అదానీ గ్రూపు కొనుగోలు చేస్తుందనే వార్తలు ఫ్యూయల్ లాగా పనిచేస్తున్నాయి.

NDTV షేర్లు గురువారం కూడా అదానీ గ్రూప్ కొనుగోలు వార్తల మధ్య భారీగా లాభపడుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో బుధవారం నాటి అప్పర్ సర్క్యూట్ ముగింపు ధర 388.20 కాగా, ఈరోజు మరోసారి 5 శాతం ఎగువ సర్క్యూట్‌తో రూ.407.60కి చేరుకుంది.
గత ఏడాది కాలంలో NDTV షేరు 442 శాతం లాభపడింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇది 254 శాతం పెరిగింది. అదానీ కొనుగోలు వార్త వెలువడినప్పటి నుంచి కంపెనీ స్టాక్ ధర రెండింతలు పెరిగింది. గత 5 ఏళ్లలో 933 శాతం రాబడిని ఇచ్చింది.
బుధవారం మార్కెట్ ప్రారంభమైన వెంటనే ఎన్‌డిటివి షేర్లలో షార్ప్ జంప్ కనిపించింది. మంగళవారం నాటి ముగింపు ధరతో పోలిస్తే బిఎస్‌ఇలో ఎన్‌డిటివి షేరు రూ.380 వద్ద ప్రారంభమైంది. స్వల్ప వ్యవధిలోనే ఐదు శాతం ఎగసి రూ.384.50కి చేరుకుంది. మంగళవారం కూడా ఎన్‌డిటివి స్టాక్ అప్పర్ సర్క్యూట్ తాకింది. అక్కడి నుంచి ఐదు శాతం పెరిగి రూ.366.20 వద్ద ముగిసింది.
షేర్ల సేకరణ ప్రక్రియ ఇలా సాగింది
అదానీ గ్రూప్ ఇటీవలే తన స్వంత మీడియా కంపెనీ, AMG మీడియా నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసింది. NDTV షేర్లను అదే AMG మీడియా నెట్‌వర్క్‌ల అనుబంధ సంస్థ అయిన విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేయబోతోంది. కంపెనీ 12 సంవత్సరాల క్రితం NDTV ప్రమోటర్ కంపెనీ అయిన RRPR హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రుణం ఇచ్చింది, దానికి ప్రతిగా ఆ కంపెనీ రుణాన్ని వాటాగా మారిపోయింది. ఆ వాటాలను ప్రస్తుతం అదానీ గ్రూపు కొనుగోలు చేసింది.
అంతేకాదు ఎన్‌డిటివిలో అదనంగా 26 శాతం షేర్లను కొనుగోలు చేయడానికి ఓపెన్ ఆఫర్‌తో ముందుకు వచ్చినట్లు అదానీ గ్రూప్ కూడా తెలిపింది. ఇందులో అదానీ గ్రూప్ విజయవంతమైతే, ఎన్‌డిటివిలో దాని మొత్తం వాటా 55.18 శాతానికి పెరుగుతుంది. అంతేకాదు అతిపెద్ద వాటాదారుగా అవతరిస్తుంది. ప్రస్తుతం, NDTV గ్రూప్ అతిపెద్ద వాటాదారులు దాని వ్యవస్థాపకుడు ప్రణయ్ రాయ్, అతని భార్య రాధికా రాయ్ ఉన్నారు. ఎన్‌డిటివిలో వారికి 32 శాతం వాటాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.