- Home
- Business
- Trump Tariffs: ట్రంప్ మళ్లీ ఏసేశాడు.. మన దేశ టేబుళ్లు, కుర్చీలు, మంచాలపై కూడా పన్నులు పెంచేశాడు
Trump Tariffs: ట్రంప్ మళ్లీ ఏసేశాడు.. మన దేశ టేబుళ్లు, కుర్చీలు, మంచాలపై కూడా పన్నులు పెంచేశాడు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Trump) పన్నులు వేయడంలోనే బిజీగా అయిపోయాడు. ఇప్పుడు కొత్తగా కలపతో చేసిన ఫర్నిచర్, క్యాబినెట్లు, ఇతర కలప ఉత్పత్తులపై కూడా కొత్త సుంకాలను ప్రకటించాడు. దీనివల్ల మన దేశంపై ఎంతో ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

ట్రంప్ కొత్త పన్నులు
డోనాల్డ్ ట్రంప్ అమెరికాను పాలించడం అంటే ఇతర దేశాలపై సుంకాలు విధించడమేనని అనుకుంటున్నాడు. అందుకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో రకంగా పన్నులు విధిస్తూనే ఉన్నాడు. ఇతర దేశాల వారిని ఇబ్బంది పెడుతూ అమెరికా రాకుండా చేసేందుకే అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే విదేశీ ఉత్పత్తులను అమెరికాలో అధిక ధరకు అమ్ముడు పోయేలా చూస్తున్నాడు. దీనివల్ల విదేశీ ఉత్పత్తులకు అమెరికాలో ఆదరణ తగ్గి, స్వదేశీ ఉత్పత్తులపైనే ఆధారపడతారని ఆయన ఆలోచన. ఇప్పుడు కొత్తగా సాఫ్ట్‌వుడ్ కలప, ఇతర కలప ఉత్పత్తులపై కూడా పన్నులను విధించాడు. దీనివల్ల కిచెన్ క్యాబినెట్లు, ఫర్నిచర్లు కూడా మరింత ఖరీదైనవిగా మారిపోతాయి.
అక్టోబర్ 14 నుంచి పన్నులు
విదేశాల నుంచి అమెరికాకు వచ్చే కలప, ఫర్నిచర్ వల్ల దేశీయ ఉత్పత్తుల సంఖ్య తగ్గిపోతోందని.. అవి అమెరికా వాణిజ్య వ్యవస్థకు హాని కలిగిస్తున్నాయని ట్రంప్ భావిస్తున్నాడు. అందుకే కలపపై కూడా ఇప్పుడు కొత్త సుంకాన్ని వేశాడు. అక్టోబర్ 14 నుంచి ఈ కొత్త పన్నులు అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త సుంకాలను విధించడానికి ట్రంప్ సెక్షన్ 232ని ఉపయోగించారు. జాతీయ భద్రతకు సంబంధించిన ఉత్పత్తుల దిగుమతి పై ఆంక్షలు విధించేందుకు ఈ సెక్షన్ ఉపయోగపడుతుంది.
బలవంతంగా కొనిపించడమే
అమెరికాలోని దేశీయ పరిశ్రమకు బలాన్ని ఇచ్చేందుకు, ఉపాధిని పెంచేందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడని చెబుతున్నారు అమెరికన్ వాణిజ్యవేత్తలు. అమెరికాలో ఉన్న చెక్కపని కంపెనీలు, చిన్న వ్యాపారాలు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందేందుకే ట్రంప్ ఈ పని చేశాడని కొంతమంది మద్దతుదారులు చెబుతున్నారు. అయితే ఎప్పుడైతే విదేశాల నుంచి దిగుమతి తగ్గిపోతుందో అమెరికాలోని ఫర్నిచర్ మరింత ఖరీదుగా మారే అవకాశం ఉంది. దీనివల్ల అమెరికన్ వినియోగదారులు కచ్చితంగా ఆ ఖరీదైన ఫర్నిచర్ ను కొనాల్సి వస్తుందని విమర్శించే వారు కూడా ఉన్నారు.
ఎంత పన్ను విధించారు?
మన దేశం నుంచి ప్రతి ఏడాది అమెరికాకు కలప ఆధారిత ఫర్నిచర్‌లు, క్యాబినెట్ల ఉత్పత్తిలో ఎగుమతి అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు పన్నులు పెరగడంతో ఎగుమతి ఖర్చులు పెరిగిపోతాయి. ఈ పన్నులు 10 శాతం నుండి 25 శాతం వరకు ఉండే అవకాశం ఉంది. ఇది భారతీయ కంపెనీల పై ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఎన్నో ఫర్నిచర్ కంపెనీలపై ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. వ్యాపారంలో క్షీణతకు కారణం అవుతుంది. అమెరికాలో దేశీయ పరిశ్రమను బలోపేతం చేయడానికి ప్రపంచ వాణిజ్యాన్ని డోనాల్డ్ ట్రంప్ ప్రభావితం చేస్తున్నాడని ఎంతోమంది విమర్శిస్తున్నారు.