- Home
- Business
- Pledged Gold: తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపిస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్న వ్యాపారులు, ఇదో కొత్త బిజినెస్
Pledged Gold: తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపిస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్న వ్యాపారులు, ఇదో కొత్త బిజినెస్
బంగారు ఆభరణాలను (Gold) తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకొని వాడేవారు ఎంతోమంది. ఆ బంగారాన్ని విడిపిస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్న కొత్త వ్యాపారం ఇప్పుడు సాగుతోంది. తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించడం వల్ల డబ్బులు ఎలా సంపాదించవచ్చో తెలుసుకోండి.

తాకట్టు పెట్టిన బంగారంపై బిజినెస్
పేద, మధ్య తరగతి వారు అప్పటికప్పుడు రుణం కావాలంటే తమ దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెడతారు. ఇలా తాకట్టు పెట్టిన బంగారాన్ని సరైన సమయంలో విడిపించకపోతే ఆ బంగారాన్ని వదులుకోవాల్సి వస్తుంది. అయితే కొంతమంది వ్యాపారులు కొత్త బిజినెస్ మొదలుపెట్టారు. తాకట్టులో పెట్టిన బంగారాన్ని విడిపించి లక్షల్లో ఆర్జిస్తున్నారు. రుణం చెల్లించలేని స్థితిలో ఉన్నవారికి కొన్ని ఆఫర్లను అందిస్తూ తాకట్టు పెట్టిన బంగారాన్ని తామే విడిపించి లాభాలను పొందుతున్నారు. ఇప్పుడు తాకట్టు పెట్టిన బంగారంపై కొత్త బిజినెస్ విజయవంతంగా నడుస్తోంది. అదెలాగో తెలుసుకోండి.
పాన్ కార్డు అవసరం
మీరు అవసరానికి ఎవరి దగ్గరైనా బంగారాన్ని తాకట్టు పెడితే బంగారం విలువ ఆధారంగా మీకు డబ్బును అందిస్తారు. ఆరోజు మార్కెట్లో ధర ఎంత ఉందో దాని ఆధారంగా మీకు ఇవ్వాల్సిన డబ్బులు నిర్ణయిస్తారు. అలాగే ప్రాసెసింగ్ ఫీజు కూడా నాలుగు నుంచి ఆరు శాతం మధ్యలో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రైవేట్ సంస్థలు బంగారు రుణాలను అందజేస్తున్నాయి. మూడు లక్షలకు పైగా డబ్బు అప్పుగా కావాలనుకుంటే కస్టమర్లు పాన్ కార్డు, ఆధార్ కార్డు వంటివి కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇలా బంగారు రుణం వల్ల పెద్దగా కష్టం లేకుండా వెంటనే డబ్బు చేతికనుస్తుంది. అందుకే పేద, మధ్యతరగతి ప్రజలు ఇలా బంగారాన్ని తాకట్టు పెట్టేందుకే ఇష్టపడతారు.
గోల్డ్ బిజినెస్
తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఇచ్చే వ్యాపారాన్ని ‘ప్లెడ్జెడ్ గోల్డ్ రిలీజ్ బిజినెస్’ అని పిలుస్తారు. ఈ బిజినెస్ లోకి అనేక ప్రైవేటు కంపెనీలు ప్రవేశించాయి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆరోజు మార్కెట్ ధరకే ఆ కంపెనీలు బంగారాన్ని కొనుగోలు చేస్తామని చెబుతాయి. ఇక మిగిలిన మొత్తాన్ని కస్టమర్లకు అందజేస్తామని చెబుతారు. ఈ వ్యాపారం వల్ల కస్టమర్లు డబ్బు నష్టపోకుండా ఉంటామని భావిస్తారు. అందుకే ఎంతోమంది ఇలా ప్రైవేటు వ్యక్తుల దగ్గరికి వెళ్లి బంగారాన్ని తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించమని కోరుతూ ఉంటారు.
డబ్బై శాతమే ఇస్తారు
నిజానికి బంగారం తాకట్టు పెట్టినప్పుడు దాని విలువలో కేవలం 70శాతం మాత్రమే రుణంగా పొందుతారు. ఆ రుణాన్ని మీరు తిరిగి చెల్లించలేనప్పుడు బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు బంగారాన్ని విక్రయిస్తాయి. అప్పుడు కస్టమర్ 30 శాతంమేర బంగారం విలువను నష్టపోవాల్సి వస్తుంది. ఆ నష్టాన్ని పోకుండా ఉండేందుకు ఇలా తాకట్టులో పెట్టిన బంగారాన్ని విడిపించే వ్యాపారులు సాయం కోరుతారు. అప్పుడు తాకట్టులో పెట్టిన బంగారాన్ని విడిపించేందుకు వ్యాపారులు తగినంత డబ్బును ఏర్పాటు చేస్తారు ఆ బంగారాన్ని విడిపిస్తారు. విడిపించిన బంగారాన్ని ఆ రోజు బంగారం విలువ ఎంత ఉంటుందో అంత విలువకు కొనుగోలు చేస్తారు. దీనివల్ల కస్టమర్లు అధిక వడ్డీ భారం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. అలాగే డబ్బు కూడా చేతికి అందుతుంది.
లాభం ఎలా?
తాకట్టులో పెట్టిన బంగారాన్ని విడిపించే వ్యాపారులకు ఆ బంగారం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. బంగారు ఆభరణాలు ఎలాంటి మజూరి, తరుగు వంటివి లేకుండా చేతికి నేరుగా అందుతాయి. అదే వస్తువును బయట కొంటే ఇక్కడ కస్టమర్ కి ఇచ్చిన డబ్బు కన్నా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మార్కెట్ కన్నా తక్కువ ధరకే బంగారు ఆభరణాలను ఇలా విడిపించి సొంతం చేసుకుంటారు. బంగారు ఆభరణాలు అధిక మొత్తంలో పోగయ్యాక తిరిగి బంగారు వ్యాపారులకు అందించి ఎక్కువ మొత్తంలో డబ్బును సంపాదిస్తారు. దీని వల్ల వారికి లక్షల్లోనే కలిసి వస్తుంది. ఇప్పుడు తాకట్టులో పెట్టిన బంగారాన్ని విడిపించే వ్యాపారుల పరిస్థితి మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.