కారు కొనాలనుకుంటున్నారా? సేఫ్టీ విషయంలో టాప్ 5 కార్లు ఇవే..
కొత్త కారు కొనేటప్పుడు ముందుగా చూసేది ధరే కదా. కానీ ధర కంటే ముఖ్యమైనది భద్రత. అందుకే భద్రతలో అత్యంత ఎక్కువ రేటింగ్ ఉన్న 5 కార్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం రండి.
గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ లేదా గ్లోబల్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్ట్‌ల ప్రకారం భారతదేశంలో అత్యధిక భద్రత కలిగిన కార్లు చాలా ఉన్నాయి. అదేవిధంగా తక్కువ భద్రతనిచ్చే కార్లు కూడా ఉన్నాయి. ఈ విషయం ఎవరో చెప్పినది కాదు. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్ పెట్టి మరీ ఆ కార్ల పరిస్థితిని నిర్ధారించింది.
కొత్త నియమాల ప్రకారం ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ ఫ్రంట్ ఇంపాక్ట్ టెస్ట్, సైడ్ ఇంపాక్ట్ టెస్ట్, పోల్ సైడ్ ఇంపాక్ట్ టెస్ట్, వాకర్స్ సేఫ్టీ టెస్ట్ లను ప్రవేశపెట్టారు. అంతేకాకుండా అధిక స్టార్ రేటింగ్‌లను పొందిన వాహనాలకు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) తప్పనిసరి చేశారు. ఈ పరీక్షల్లో ఏ కార్లకు ఎంత రేటింగ్ వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.
మహీంద్రా స్కార్పియో-N
ఈ కారు పెద్దలకు రక్షణ కల్పించే విషయంలో 5 స్టార్లు (29.25 పాయింట్లు) సాధించింది. ఇక పిల్లల విషయానికొస్తే వారికి రక్షణ కల్పించడంలో 3 స్టార్లు (28.93 పాయింట్లు) పొందింది. ఈ SUV మోడల్ బలమైన నిర్మాణం, అధునాతన భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. ఇది ధర విషయంలో రూ. 13.85 లక్షల నుంచి రూ. 24.54 లక్షల మధ్య ఉంది.
స్కోడా కుషాక్ / వోక్స్వాగన్ టైగున్
పెద్దలకు రక్షణ కల్పించే విషయంలో ఈ కార్లు 5 స్టార్ రేటింగ్ పొందాయి. గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ లో 29.64 పాయింట్లు సాధించాయి. అదేవిధంగా పిల్లల రక్షణ కల్పించే విషయంలో 5 స్టార్లు (42 పాయింట్లు) పొందాయి. దీనికి కారణం బాడీ షెల్ చాలా స్ట్రాంగ్ గా ఉండటం. ఈ కార్లలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ISOFIX చైల్డ్ మౌంట్స్ ఉన్నాయి. ఇవి సుమారుగా రూ.18 లక్షలు, రూ.19 లక్షలు ధర పలుకుతున్నాయి.
టాటా పంచ్
టాటా పంచ్ లో ప్రయాణించే పెద్ద వాళ్లకు రక్షణ కల్పించడంలో 5 స్టార్ రేటింగ్ పొందింది. పిల్లలను కాపాడటంలో 4 స్టార్లు సాధించింది. ఇది అత్యంత సురక్షితమైన కంపాక్ట్ SUVగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా బడ్జెట్ సెగ్మెంట్‌లో రూ. 6.13 లక్షల నుంచి రూ. 10.15 లక్షల మధ్య ధర ఉంది.
మహీంద్రా XUV700
మహీంద్రా కారు పెద్దవాళ్లకు రక్షణ కల్పించే విషయంలో 5 స్టార్ రేటింగ్ సాధించింది. పిల్లలను కాపాడటంలో 4 స్టార్లు సంపాదించింది. ఈ SUV మోడల్ అత్యుత్తమ భద్రతా ప్రమాణాలతో ప్యాసింజర్‌లకు రక్షణ కల్పిస్తుంది.
టాటా ఆల్ట్రోస్
ఈ కారు కూడా రక్షణ విషయంలో 5 స్టార్ రేటింగ్ సాధించింది. పిల్లలకు రక్షణ కల్పించడంలో 3 స్టార్లు దక్కాయి. స్ట్రాంగ్ బాడీ షెల్, అనేక భద్రతా ఫీచర్లతో ఈ కార్ ఆకట్టుకుంటోంది.