ఇండియన్స్ అంటే మామూలుగా ఉండదు మరి: ప్రపంచ దిగ్గజ కంపెనీలను నడిపించేది మనోళ్లే
మనోళ్లు మామూలోళ్లు కాదు బ్రో.. ప్రపంచ దిగ్గజ కంపెనీలను నడిపించేది భారతీయులే. ఇండియన్స్ కి గర్వకారణమైన ఈ విషయాన్ని ప్రముఖ సంస్థ HSBC హురున్ ప్రకటించింది. ఈ సంస్థ విడుదల గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్ 2024 చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ లిస్టులో ప్రపంచంలోని టాప్ 10 ప్రభావవంతమైన భారతీయుల వివరాలు ఉన్నాయి. వారెవరో తెలుసుకుందాం రండి.

HSBC హురున్ గ్లోబల్ ఇండియన్స్ 2024 పేరుతో ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న భారతీయ సంతతి నాయకుల జాబితాను విడుదల చేసింది. మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, CEO సత్య నాదెళ్ల ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. ప్రపంచ ఆర్థిక రంగంలో భారతీయ సంతతి వ్యక్తులు ఎంత కీలకంగా ఉన్నారో ఈ జాబితా తెలియజేస్తోంది.
ఈ జాబితాలో 200 కంపెనీలకు చెందిన 226 మంది ఉన్నారు. వీరి మొత్తం ఆస్తుల విలువ $10 ట్రిలియన్లు. ఇది సాఫ్ట్‌వేర్, ఆర్థిక సేవలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి వివిధ రంగాల్లో వారి ప్రభావాన్ని చూపిస్తుంది. కేవలం 200 మంది ఇంత సంపాదించారంటే వారు పనిచేస్తున్న రంగాలు ఎంతలా ప్రభావితం అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఈ జాబితాలో ప్రముఖ వ్యక్తుల్లో $3,146 బిలియన్ల విలువైన కంపెనీతో మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, CEO సత్య నాదెళ్ల అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత గూగుల్ CEO సుందర్ పిచాయ్, YouTube CEO నీల్ మోహన్ వరుసగా $2,107 బిలియన్లు, $455 బిలియన్ల విలువైన కంపెనీలను నడిపిస్తున్నారు. మొత్తం మీద, టాప్ 10 నాయకులు జాబితా మొత్తం విలువలో 73% వీరే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
HSBC హురున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్ 2024 నివేదిక ప్రకారం సాఫ్ట్‌వేర్, సర్వీస్ రంగాలు 87 స్థానాలను ఆక్రమించాయి. ఆ తర్వాత ఆర్థిక సేవలు, ఆరోగ్య సంరక్షణ ఉన్నాయి. ఈ 200 మందిలో శాన్ ఫ్రాన్సిస్కో అత్యధిక సంఖ్యలో 37 మంది జీవిస్తుండటం విశేషం.
టాప్ 10 మంది ప్రపంచ భారతీయులు వీరే..
సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్) - $3,146 బిలియన్లు
సుందర్ పిచాయ్ (ఆల్ఫాబెట్ - గూగుల్ మాతృ సంస్థ) - $2,107 బిలియన్లు
నీల్ మోహన్ (YouTube) - $455 బిలియన్లు
థామస్ కురియన్ (గూగుల్ క్లౌడ్) - $353 బిలియన్లు
శంతను నారాయణ్ (Adobe) - $231 బిలియన్లు
సంజీవ్ లాంబా (లిండే) - $222 బిలియన్లు
వసంత నరసింహన్ (నోవార్టిస్) - $216 బిలియన్లు
అరవింద్ కృష్ణ (IBM) - $208 బిలియన్లు
విమల్ కపూర్ (హనీవెల్ ఇంటర్నేషనల్) - $152 బిలియన్లు
కెవిన్ లోబో (స్ట్రైకర్) - $149 బిలియన్లు
ఈ నాయకుల కంపెనీలు టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, రసాయనాలు, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాలను విస్తరించాయి.
ఈ జాబితాలో పురుషులే కాకుండా భారతీయ సంతతి మహిళా నాయకులూ ఉన్నారు. నేహా నర్కేడ్ (కాన్ఫ్లుయెంట్), అంజలి సూద్ (డూబీ), యామినీ రంగన్ (హబ్‌స్పాట్) మరియు లీనా నాయర్ (ఛానెల్) వంటి మహిళా నాయకులు ఉన్నారు. వారు నడిపించే కంపెనీల విలువ $436 బిలియన్లు ఉంటుంది.
ఈ జాబితా ప్రకారం అమెరికా, UK, UAE, సింగపూర్ వంటి దేశాల్లో ఉన్న ప్రపంచ దిగ్గజ కంపెనీలను తమిళనాడు, పంజాబ్, కేరళ, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు చెందిన భారత సంతతి వ్యక్తులు నడిపిస్తుండటం విశేషం.
ఈ జాబితాలో ఉన్న భారతీయుల్లో 62% మంది భారతదేశంలో చదువుకున్న వారే. వారిలో దాదాపు 25 శాతం మంది ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)ల నుండి పట్టభద్రులయ్యారు.