యాంటీ బయాటిక్స్ ఎక్కువ వాడితే ప్రాణానికి ప్రమాదమా? షాకింగ్ నిజాలు ఇవిగో
జలుబు, దగ్గు, జ్వరం, ఇలా ఏ చిన్న సమస్య వచ్చినా యాంటి బయాటిక్స్ వేసుకోకపోతే మీకు తగ్గడం లేదా? ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు డాక్టర్ దగ్గరకు ఏం వెళతాం లే అని మెడికల్ షాప్ కి వెళ్లి మందులు తెచ్చుకుని వాడుతున్నారా? అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. అధికంగా యాంటీ బయాటిక్స్ వాడటం వల్ల ఓ ప్రమాదకరమైన వ్యాధి వస్తుంది. దీని వల్ల ఒక్కోసారి ప్రాణాలకు కూడా ముప్పు కలుగుతుంది. ఆ వ్యాధి గురించి, నివారణ చర్యల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
కాస్త దగ్గుగా ఉన్నా, గొంతులో నొప్పిగా ఉన్నా చాలామంది మందుల షాప్ కి వెళ్లి యాంటీ బయాటిక్స్ కొనుక్కుని వాడేస్తుంటారు. పోనీ అది కూడా పూర్తి కోర్సు వాడకుండా ఒకటి లేదా రెండు రోజులు వాడి మానేస్తారు. దీని వల్ల ఆ వ్యక్తి శరీరం యాంటీ బయాటిక్స్ కి రియాక్ట్ అవడం మానేస్తుంది. అంటే ఏదైనా వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ వల్ల ఆ వ్యక్తికి వ్యాధి వస్తే యాంటీ బయోటిక్స్ వేసినా పనిచేయవన్న మాట. దీన్నే యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) అంటారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యాంటీమైక్రోబయల్ అవగాహన వారోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా ఏఎంఆర్ గురించి డాక్టర్లు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పలు రకాల యాంటీబయాటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియా, వైరస్ లను మల్టీడ్రగ్ రెసిస్టెంట్ జీవులు లేదా సూపర్ బగ్స్ అంటారు. ప్రపంచంలోని టాప్ 10 ఆరోగ్య ముప్పుల్లో ఒకటిగా ఏఎంఆర్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే ప్రకటించింది. ఏఎంఆర్ విస్తరిస్తే ఒక్కోసారి ప్రాణాపాయం కూడా కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఒక వ్యక్తికి ఏఎంఆర్ సోకితే అతను తరచూ ఇన్ఫెక్షన్లకు గురవుతుంటాడు. వ్యాధులు విపరీతంగా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ఈ సందర్భంగా డాక్టర్స్ చెప్పిన పలు సూచనలు, నివారణ చర్యలు ఇక్కడ ఉన్నాయి.
మీకు తెలుసా? 1990 నుంచి ప్రతి ఏటా సుమారు 10 లక్షల మంది ఏఎంఆర్ వల్ల మరణిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఇప్పటి నుంచి 2050 మధ్య 4 కోట్ల మంది ఇన్ఫెక్షన్లతో మరణిస్తారని ‘గ్లోబల్ రీసెర్చ్ ఆన్ యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్’ పరిశోధనలో తేలింది. ఏఎంఆర్ వల్ల చికిత్స సమర్థత తగ్గుతుంది. రోగులు ఆస్పత్రిలో ఐసీయూలో ఎక్కువ కాలం ఉండాల్సి ఉంటుంది. దీని వల్ల వైద్యం ఖర్చు పెరిగిపోతుంది. కొన్ని కండీషన్స్ లో ఒకరి నుంచి మరొకరికి మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. ఇది మరింత ప్రమాదకర పరిస్థితికి దారి తీస్తుంది.
యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడడమే ఏఎంఆర్‌కు ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు. డాక్టర్స్ చెప్పకుండా మెడికల్ షాపుల్లో యాంటీబయాటిక్స్ కొనుక్కొని వాడటం కూడా తప్పేనని చెబుతున్నారు. పోనీ అవి కూడా పూర్తికాలం కోర్సులా వాడకుండా ఒకటి, రెండు రోజులు వేసుకొని మానేయడం వల్ల యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్(ఏఎంఆర్) సోకతుంది. ఒకసారి ఏఎంఆర్ సోకితే ఇక ఏ యాంటీబయాటిక్ కూడా ఆ వ్యక్తిపై పనిచేయవు. దీంతో అనేక ఇన్ఫెక్షన్స్ సోకుతాయి. దీంతో వైద్యులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రాణాలు కూడా కోల్పోవచ్చు.
ఒకే ఇంట్లో ఒకరికి జలుబు, దగ్గు, జ్వరం లాంటివి వచ్చి తగ్గిన తర్వాత అదే ఇంట్లో ఇంకొకరికి సేమ్ సమస్య వస్తే అవే మందులు వాడేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే మెడిసన్ అనేది రోగి లక్షణాలను బట్టి మారిపోతుంది. ఇలా ఒకరికి వాడిన మందులు ఇంకొకరి వాడటం వల్ల దుష్ప్రభావాలు కలగొచ్చు.
ఏఎంఆర్ రాకుండా ఉండాలంటే యాంటీ బయాటిక్స్ ఇష్టారాజ్యంగా వాడకూడదు. ముఖ్యంగా మెడికల్ షాపుల్లో తీసుకొని ఒకటి, రెండు రోజులు వాడి మానేయకూడదు. యాంటీ బయోటిక్స్ వాడటానికి కోర్సు ఉంటుంది. అందుకే డాక్టర్స్ ని సంప్రదించి మాత్రమే యాంటీ బయోటిక్స్ కోర్సులా వాడాలి.
ఎప్పటికప్పుడు చేతులు సబ్బు, నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. దగ్గినా, తుమ్మినా చేతులు గానీ, కర్చీఫ్ గానీ అడ్డుపెట్టుకోవాలి.