Google CEO: మీ తర్వాత గూగుల్ సీఈవో ఎవరు? సుందర్ పిచాయ్ సమాధానం ఏంటో తెలుసా?
ఇటీవల జరిగిన ఓ సదస్సులో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కొన్ని ముఖ్యమైన విషయాలు వెల్లడించారు. తన తర్వాత గూగుల్ సీఈవో ఎవరు? భవిష్యత్తులో గూగుల్ ఉత్పత్తులు ఎలా ఉండనున్నాయి? గూగుల్ పై AI ప్రభావం తదితర విషయాలు వెల్లడించారు. వీటి గురించి మరిన్ని వివరాలు ఇవిగో.

గూగుల్ ను నడించేది ఎవరంటే?
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇటీవల జరిగిన బ్లూమ్‌బెర్గ్ టెక్ సదస్సులో గూగుల్ భవిష్యత్తు నాయకత్వంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. భవిష్యత్తులో గూగుల్ సీఈవో ఎవరు అన్న ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. తదుపరి సీఈవో మనిషి కావచ్చు. లేక AI కూడా నడిపించొచ్చు. అని సమాధానం ఇచ్చారు. ఎవరు నడిపించినా, వారికి అద్భుతమైన AI సహాయకుడు కచ్చితంగా ఉంటాడని తాను భావిస్తున్నానని పిచాయ్ అన్నారు.
సామాజిక బాధ్యత కూడా తీసుకోవాలి
మనం సృష్టించే ఉత్పత్తులు సమాజంపై గణనీయ ప్రభావం చూపుతాయి. సాంకేతికత అభివృద్ధి, ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా దానిని రూపొందించడంలో కృషి అవసరం. ఇది ఒక ముఖ్యమైన లక్షణం అని గూగుల్ CEO సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. అంటే సాంకేతికత అభివృద్ధి కేవలం లాభాపేక్షతో కాకుండా, సామాజిక అభివృద్ధికి కూడా దోహదపడేలా ఉండాలని ఆయన చెప్పారు.
అమెరికా సైన్యం కోసం AI ప్రోడక్ట్స్
ఈ సదస్సులో పిచాయ్ కంటే ముందు మాట్లాడిన మెటా ప్లాట్‌ఫారమ్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(CTO) ఆండ్రూ బోస్‌వర్త్ కొత్త విషయాన్ని ప్రకటించారు. సిలికాన్ వ్యాలీలో ఒక సాంస్కృతిక మార్పు వచ్చిందని, సాంకేతిక రంగం ఇప్పుడు అమెరికా సైన్యం కోసం వనరులను సృష్టిస్తుందని తెలిపారు. గత వారం మెటా రక్షణ కాంట్రాక్టర్ అండూరిల్ ఇండస్ట్రీస్ ఇంక్‌తో ఒక పార్టనర్‌షిప్‌ను ప్రకటించింది. ఇందులో అమెరికా సైన్యం కోసం ఉత్పత్తులు, AI-ఆధారిత హెల్మెట్, వర్చువల్, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఫీచర్లు ఉన్నాయి.
2026 వరకు ఇంజనీర్లను నియమించుకుంటాం..
గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ 2026 వరకు ఇంజనీర్లను నియమించుకుంటుందని పిచాయ్ ధృవీకరించారు. AI పెట్టుబడులను పెంచుతున్నప్పటికీ మానవ నైపుణ్యం కీలకమని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది కూడా తమ ప్రస్తుత ఇంజినీరింగ్ బేస్ ను పెంచుకోవడానికి కొత్త ఇంజినీర్లను తీసుకుంటామని పిచాయ్ ప్రకటించారు. ఇంజనీర్లను అత్యంత టాలెంటెడ్ గా మార్చడం, వారి దినచర్యలోని చాలా బోరింగ్ అంశాలను తొలగించడం జరుగుతుందన్నారు.
AI ఎంత అభివృద్ధి చెందినా మనిషి అవసరం ఉంది
మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు ఈ ఏడాది చాలా మంది ఉద్యోగులను తొలగించాయి. గూగుల్ కూడా ఇటీవలి సంవత్సరాలలో వనరులను విడుదల చేయడానికి అనేక మంది ఎంప్లాయిస్ ను తొలగించింది.
AI కోడింగ్ వంటి రంగాల్లో అత్యుత్తమంగా ఉన్నప్పటికీ, ఇది ప్రాథమిక తప్పులను చేస్తూనే ఉందని, మానవ జోక్యం అవసరమని పిచాయ్ అభిప్రాయపడ్డారు. దీని ద్వారా AI ఎంత అభివృద్ధి చెందినా మానవుల తెలివితేటలు, సంక్లిష్ట నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం చాలా ముఖ్యమని స్పష్టమవుతోంది.

