నేడు భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. వరుస 2వ రోజు కూడా సరికొత్త రికార్డు స్థాయికి సెన్సెక్స్ నిఫ్టీ..
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు వరుసగా రెండో రోజు కూడా భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం రికార్డు స్థాయిలో ప్రారంభమైన తర్వాత కాస్త ఒడిదుడుకులలోనై చివరికి మళ్లీ ఆల్-టైమ్ హై వద్ద ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రైమరీ ఇండెక్స్ సెన్సెక్స్ 662.63 పాయింట్ల (1.16 శాతం) లాభంతో 57,552.39 వద్ద ముగిసింది.
మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 201.15 పాయింట్ల లాభంతో (1.19 శాతం) 17,132.20 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ 57625.26, నిఫ్టీ 17,153.50 రికార్డు స్థాయిని తాకింది. గత వారం 30-షేర్ల బిఎస్‌ఈ సెన్సెక్స్ 795.40 పాయింట్లు అంటే 1.43 శాతం లాభపడింది. బిఎస్‌ఈలో లిస్ట్ చేసిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ మొదటిసారిగా రూ .250 లక్షల కోట్లు దాటింది.
దేశ ఫారెక్స్ నిల్వ నిరంతరం పెరుగుతోంది, దీని కారణంగా మార్కెట్లో నగదు ప్రవాహం కూడా పెరుగుతోంది. విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) క్రమంగా పెరుగుతున్నాయి, దీంతో దేశీయ స్టాక్ మార్కెట్‌లో విజృంభణకు దారితీసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మరింత బలపడింది, అలాగే ఇన్వెస్టర్లలో కరోనా భయం పోయినట్లు కనిపిస్తోంది. అలాగే జిడిపి, ఆటో అమ్మకాల సంకేతాల అంచనాలు కూడా మార్కెట్లో పెరిగాయి. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.99 వద్ద నిలిచింది.
ఒక సంవత్సరంలో భారత షేర్ మార్కెట్ అత్యుత్తమ పనితీరు ప్రపంచ స్టాక్ మార్కెట్లతో పోలిస్తే గత ఏడాది కాలంలో భారత స్టాక్ మార్కెట్ మెరుగైన పనితీరును కనబరిచింది . నిఫ్టీ 45 శాతం రిటర్న్ ఇచ్చింది. అలాగే ఈ సంవత్సరం జనవరి నుండి నిఫ్టీ 19 శాతం పెరిగింది. మెక్సికన్ మార్కెట్ ఈ సంవత్సరం 18.97 శాతం రాబడిని ఇచ్చింది. తైవాన్ మార్కెట్ 15.70 శాతం, చైనా మార్కెట్ 1.94 శాతం, ఫ్రాన్స్, కొరియా, యుఎస్ షేర్ మార్కెట్లు తక్కువ రాబడిని ఇచ్చాయి. భారతీయ స్టాక్ మార్కెట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక సంవత్సరంలో రూ .75 లక్షల కోట్లు పెరిగింది. విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్లో రూ .2.2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టారు. రిటైల్ పెట్టుబడిదారులు ఎస్ఐపి ద్వారా లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. గత 20 రోజుల్లో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 10.56 లక్షల కోట్లు పెరిగింది.
పెద్ద షేర్ల గురించి మాట్లాడితే ఈ రోజు ట్రేడింగ్ తర్వాత భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో, ఐషర్ మోటార్స్, శ్రీ సిమెంట్ షేర్లు గ్రీన్ మార్క్‌లో ముగిశాయి. మరోవైపు, నెస్లే ఇండియా, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్, బిపిసిఎల్ షేర్లు రెడ్ మార్క్ తో ముగిశాయి.
సెక్టోరల్ ఇండెక్స్‌ని పరిశీలిస్తే నేడు మీడియా మినహా అన్ని రంగాలు గ్రీన్ మార్క్‌లో మూగిశాయి. వీటిలో ఎఫ్‌ఎంసిజి, ఫైనాన్స్ సర్వీసెస్, బ్యాంకులు, రియల్టీ, ప్రైవేట్ బ్యాంకులు, మెటల్స్, ఐటి, పిఎస్‌యూ బ్యాంకులు, ఫార్మా అండ్ ఆటో ఉన్నాయి.
స్టాక్ మార్కెట్ ఉదయం అత్యధిక స్థాయిలో ఓపెన్ అయ్యింది. సెన్సెక్స్ 127.37 పాయింట్ల (0.22 శాతం) లాభంతో 57017.13 వద్ద ప్రారంభం కాగా నిఫ్టీ 39.20 పాయింట్ల (0.23 శాతం) లాభంతో 16970.20 వద్ద ప్రారంభమైంది.
నిన్న అంటే సోమవారం స్టాక్ మార్కెట్ అత్యున్నత స్థాయిలో ముగిసింది. సెన్సెక్స్ 765.04 పాయింట్ల (1.36 శాతం) లాభంతో 56,889.76 వద్ద ముగియగా మరోవైపు, నిఫ్టీ 225.85 పాయింట్ల లాభంతో (1.35 శాతం) 16,931.05 వద్ద ముగిసింది.