- Home
- Business
- Starlink : భారత్ లో స్టార్ లింక్ సేవలు ... నెలవారి ప్లాన్స్ ధరలు, ఇంటర్నెట్ స్పీడ్ ఎలా ఉండనున్నాయో తెలుసా?
Starlink : భారత్ లో స్టార్ లింక్ సేవలు ... నెలవారి ప్లాన్స్ ధరలు, ఇంటర్నెట్ స్పీడ్ ఎలా ఉండనున్నాయో తెలుసా?
ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్‌లింక్ భారత్‌లో సేవలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. కాబట్టి దీని ధరలు, ఇంటర్నెట్ స్పీడ్, సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు, ఇతర సేవలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

భారత్ లో స్టార్ లింక్ సేవలు
Starlink : భారతదేశంలో టెలికాం రంగంలో మరో విప్లవం ఖాయంగా కనిపిస్తోంది. రిలయన్స్ జియో రాకతో ఇప్పటికే ఇంటర్నెట్ స్పీడ్ అమాంతం పెరిగింది... అంతేకాదు వినియోగం కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా ఇంటర్నెట్ వినియోగిస్తున్న దేశాల్లో భారత్ టాప్ లో నిలిచింది... పట్టణాల్లోనే కాదు మారుమూల పల్లెల్లో కూడా విరివిగా వాడుతున్నారు. అయితే ఇప్పటికే 5G సేవలు అందుబాటులోకి రావడంతో ఇంటర్నెట్ స్పీడ్ మరింత పెరిగింది... కానీ ఇంతకంటే జెట్ స్పీడ్ లో ఇంటర్నెట్ ను అందిస్తామంటూ ఎలాన్ మస్క్ రంగంలోకి దిగుతున్నారు.
భారతదేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందిచేందుకు ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ రంగం సిద్దంచేస్తోంది. ఇప్పటికే డిపార్ట్ మెంట్ ఆప్ టెలీకమ్యూనికేషన్ నుండి స్టార్ లింక్ కు కీలక అనుమతులు లభించాయి. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPACe) స్టార్ లింక్ సేవలకు అనుమతిస్తూ ఓ లెటర్ జారీ చేసింది. ఈ రెండు సంస్థలు అధికారికంగా ఒప్పందం కుదుర్చుకుంటే ఇక భారత్ లో స్టార్ లింక్ సేవలు ప్రారంభం అవుతాయి.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో స్టార్ లింక్ సేవలు కొనసాగుతున్నాయి... మన పొరుగుదేశాలు శ్రీలంక, బంగ్లాదేశ్ లలో కూడా ఎలాన్ మస్క్ సంస్థ అడుగుపెట్టింది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన భారత్ లో అడుగుపెట్టేందుకు ఎలాన్ మస్క్ ఉవ్విళ్లూరుతున్నారు... అందుకే స్పీడ్ పెంచి స్టార్ లింక్ సేవలను త్వరలోనే భారతీయులకు పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఏమిటీ స్టార్ లింక్?
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రయోగాలు చేయడంలో ముందుంటారు. అసలు అంతరిక్ష రంగంలో కేవలం ప్రభుత్వరంగ సంస్థలే కొనసాగుతున్న సమయంలో మస్క్ సరికొత్త ఆలోచన చేశారు... ప్రైవేట్ సంస్థలు ఇందులోకి ఎందుకు రాకూడదు అనుకున్నారు. అనుకున్నదే తడవుగా స్పేస్ ఎక్స్ పేరిట ఓ ప్రైవేట్ అంతరిక్ష సంస్థను ఏర్పాటుచేశారు. ఇప్పుడు దీన్ని ఉపయోగించుకుని సరికొత్త వ్యాపారానికి తెరతీసారు... అదే స్టార్ లింక్.
ఈ స్టార్ లింక్ అనేది ప్రపంచానికి మరింత ఉత్తమమైన ఇంటర్నెట్ సేవలను అందించడానికి ఏర్పాటుచేసినట్లు ఎలాన్ మస్క్ చెబుతున్నారు. నేరుగా శాటిలైట్ నుండే ఇంటర్నెట్ సేవలను అందించనున్నారు... కాబట్టి ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా ఈ సేవలకు అంతరాయం ఉండదు. అలాగే మారుమూల ప్రాంతాల నుండి మహా నగరాల వరకు ఎక్కడైనా ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
ఇలా ఇప్పటికే తన స్పేస్ ఎక్స్ ద్వారా 6000 పైగా ఉపగ్రహాలను ఈ స్టార్ లింక్ సేవలకోసం మోహరించారు మస్క్. మరో రెండేళ్లలో వేలాది ఉపగ్రహాలను స్టార్ లింక్ సేవల కోసం రెడీ చేయనున్నట్లు ఇప్పటికే వెల్లడించారు... అంటే 2027 చివరికి ప్రపంచవ్యాప్తంగా 42 వేల శాటిలైట్స్ హై స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తాయని మస్క్ సంస్థ చెబుతోంది.
భారతదేశంలో స్టార్ లింక్ ధరలు ఎలా ఉంటాయంటే...
ఇటీవలే బంగ్లాదేశ్, శ్రీలంకలో స్టార్ లింక్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీన్నిబట్టి చూస్తే భారత్ లో కూడా ఈ స్టార్ లింక్ కనెక్షన్ పొందే సమయంలో రూ.33,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది... దీంతో స్టాండర్డ్ కిట్ అందిస్తారు. ఇందులో స్టార్ లింక్ కనెక్షన్ కు అవసరమైన యాంటెనా, మౌంట్ స్టాండ్, థర్డ్ జనరేషన్ వైఫై రూటర్, కేబుల్స్, అడాప్టర్ వంటి పరికరాలు ఉంటాయి. ఈ సెటప్ కేవలం హైస్పీడ్ ఇంటర్నెట్ కే కాదు వీడియో కాల్స్, గేమింగ్ కు వంటివాటిని అనుకూలంగా ఉంటుంది.
ఇక నెలవారి ఛార్జీల విషయానికి వస్తే ప్రస్తుతం దేశంలో అందుతున్న ఇంటర్నెట్ సేవల కంటే చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ స్టార్ లింక్ నెలవారి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు రూ.3,000 నుండి రూ.4,200 మధ్య ఉండే అవకాశం ఉంది. అయితే ఈ ధరలు పొరుగుదేశాల్లో స్టార్ లింక్ సేవల ఆధారంగా తెలియజేయడం జరుగుతోంది... భారత్ లో తేడాలుండే అవకాశాలు కూడా ఉన్నాయి.
భారత్ లో స్టార్ లింక్ ఇంటర్నెట్ స్పీడ్ ఎంతంటే..
భారత్ లో ఇప్పటికే 5G సేవలు అందుబాటులో ఉన్నాయి... కాబట్టి ఇక్కడ పోటీలో నిలవాలంటే ఇంతకంటే హైస్పీడ్ ఇంటర్నెట్ ను స్టార్ లింక్ అందించగలగాలి. కాబట్టి 600 నుండి 700 Gbps డేటా స్పీడ్ ను అందించాలని స్టార్ లింక్ యోచిస్తోందట. ఇలా ఎలాంటి అవాంతరాలు లేకుండా హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించి దేశంలో మార్కెట్ పెంచుకోవాలన్నది స్టార్ లింక్ ప్లాన్ గా తెలుస్తోంది.
స్టార్ లింక్ జియో, ఎయిర్ టెల్ లకు పోటీ ఇవ్వగలదా?
ఎలాన్ మస్క్ స్టార్ లింక్ ద్వారా భారతీయ టెలికాం రంగంలో అడుగుపెడుతున్నారు... అయితే ఇప్పటికే ఇక్కడ రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ వంటి దిగ్గజాలు ఈ రంగంలో ఉన్నాయి. వీటిని తట్టుకుని స్టార్ లింక్ నిలబడుతుందా? అనే అనుమానం తలెత్తుతోంది.
దేశీయ టెలికాం సంస్థలు చాలా చౌకధరకే ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నాయి. వీటితో పోలిస్తే స్టార్ లింక్ ధరలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ అధిక చార్జీలే స్టార్ లింక్ ను భారత ప్రజలకు దూరం చేసే అవకాశాలున్నాయి. మరి ఎలాన్ మస్క్ భారతదేశంలో ఎలాంటి ప్లాన్స్ అందిస్తారో? వాటి ధరలు ఎలా ఉంటాయో? చూడాలి.
ఇక్కడ స్టార్ లింక్ సక్సెస్ కావచ్చు...
మరోవైపు ఇప్పటికీ దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేవు. స్టార్ లింక్ ఇంటర్నెట్ ఆధారిత సర్వీస్ కాబట్టి ఈ ఇలాంటి ప్రాంతాల్లో ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది. కాబట్టి స్టార్ లింక్ కు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మంచి ఆదరణ లభించే అవకాశాలున్నాయి.
మొత్తంగా ఎలాన్ మస్క్ స్టార్ లింక్ ద్వారా భారతదేశంలోకి అడుగుపెట్టి క్రమక్రమంగా తన వ్యాపారసామ్రాజ్యాన్ని విస్తరించేందుకు సిద్దమవుతున్నారు. మరి ఆయన తొలి అడుగు సక్సెస్ అవుతుందా? లేక చతికిలపడుతుందా? అన్నది కాలమే నిర్ణయించనుంది.