EMIలో ఏదైనా వస్తువు తీసుకుంటున్నారా ? ఈ 7 తప్పులు అస్సలు చేయకండి!
ఒకప్పుడు చేతిలో డబ్బు ఉంటేనే ఏదైనా వస్తువు కొనే వీలుండేది. కానీ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ (EMI) ఆప్షన్ పుణ్యమా అని నెలా నెలా కొంత మొత్తాన్ని కట్టుకునే వెసులుబాటు వచ్చింది. అయితే ఈఎంఐలో షాపింగ్ చేసేటప్పుడు ఈ 7 తప్పులు అస్సలు చేయకూడదు.

ఈఎంఐలో షాపింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఒక వస్తువుకు ఒకేసారి మొత్తం డబ్బు చెల్లించకుండా నెలా నెలా కొంత మొత్తాన్ని చెల్లించే విధానం EMI. చాలామందికి ఎక్కువ మొత్తాన్ని ఒకేసారి వెచ్చించి కొనే స్తోమత ఉండకపోవచ్చు. అందుకే చాలామంది EMI ఆప్షన్‌ను వినియోగిస్తుంటారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫర్నిచర్, వెహికిల్స్ ఇలా రకరకాల వస్తువులను ఈఎంఐలో కొనుగోలు చేస్తున్నారు. అయితే EMIలో షాపింగ్ చేసే ముందు కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. లేకపోతే నష్టపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ 7 తప్పులు అస్సలు చేయకూడదు. అవేంటో చూద్దాం.
వస్తువు ధర
EMI విధానంలో వస్తువు కొనుగోలు చేస్తున్నప్పుడు.. వాటి ధర తక్కువగా అనిపించినప్పటికీ.. మనం ఆ ధరపై వడ్డీ కూడా చెల్లిస్తున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వస్తువు అసలు ధర, దాని వడ్డీతో కలిపి ఎంత అవుతుందో.. అది మనకు అనువైనదో కాదో తెలుసుకోవాలి. మొత్తం ధరను భరించగలమో లేదో అంచనా వేసుకోవాలి.
వడ్డీ రేట్లు
కొంతమంది వడ్డీ ఎంత పడుతుందో అర్థం చేసుకోకుండానే వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. ఈ తప్పు వల్ల వస్తువు ధర కన్నా రెట్టింపు డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. మనం కొనే వస్తువు, దానికి డబ్బు చెల్లించే టైం, క్రెడిట్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేట్లు మారవచ్చు. కాబట్టి తక్కువ ఖర్చులో మంచి ఆఫర్లు పొందడానికి వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల వడ్డీ రేట్లు పోల్చి చూసుకోవాలి.
బడ్జెట్‌ను మించిన EMI తీసుకోవడం
కొంతమంది తక్కువ డౌన్‌పేమెంట్ చూసి, తాము చెల్లించలేని EMI ప్లాన్ కూడా తీసుకుంటారు. దీనివల్ల ప్రతి నెలా ఇతర ఖర్చులపై ప్రభావం పడుతుంది. ఆర్థికంగా ఒత్తిడికి గురికావాల్సి వస్తుంది. కాబట్టి బడ్జెట్ కు అనువైన ఈఎంఐ ప్లాన్ ఎంచుకోండి. మీ నెలవారీ ఆదాయంలో 10-20% లోపు మాత్రమే EMIలు ఉండేలా ప్లాన్ చేసుకోండి.
క్రెడిట్ స్కోర్
క్రెడిట్ స్కోర్ ఈఎంఐ లోన్ వడ్డీ రేట్లపై ప్రభావం చూపుతుంది. క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే తక్కువ వడ్డీ రేటుకు లోన్ లభిస్తుంది. కాబట్టి పేమెంట్ ఆప్షన్‌గా ఈఎంఐని ఎంచుకునే ముందు క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోండి.
తక్కువ టైం పీరియడ్
తక్కువ EMI కోసం కొంతమంది 24 నుంచి 36 నెలల ప్లాన్ ఎంచుకుంటారు. కానీ సమయం పెరిగే కొద్దీ వడ్డీ భారం కూడా పెరుగుతుంది. ఎంత తక్కువ టైంలో ఈఎంఐ చెల్లిస్తామో అంత వడ్డీ ఆదా అవుతుంది. కాబట్టి మీ సామర్థ్యానికి తగినంత కాలవ్యవధి ఎంచుకోండి.
రిపేమెంట్ ఆలస్యం చేయడం
EMIలు టైమ్ కి చెల్లించకపోతే.. క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. లేట్ ఫీజులు, పెనాల్టీలు పెరుగుతాయి. కాబట్టి ఆటో డెబిట్ ఆప్షన్ ను ఎంచుకోండి. మీ అకౌంట్ లో కావాల్సిన బ్యాలెన్స్ ఉండేలా చూసుకోండి.
హిడెన్ ఛార్జెస్
ప్రాసెసింగ్ ఫీజులు, లేట్ పేమెంట్ ఛార్జీల వంటి హిడెన్ ఛార్జీల గురించి ముందుగానే తెలుసుకోండి. ఈ ఛార్జీల వల్ల మనం వస్తువును ఉన్నదాని కన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేసిన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ముందుగానే నిబంధనలను జాగ్రత్తగా చదవాలి.