మీ కారుకు సేఫ్టీ రేటింగ్ ఎంత ఉందో తెలుసా? ఇలా చెక్ చేయండి
మీ కారు మిమ్మల్ని భద్రంగా చూసుకుంటుందా? అదేంటి.. కారు మనకి రక్షణ ఎలా కల్పిస్తుంది అనుకుంటున్నారా? GNCAP, BNCAP రూల్స్ పాటించే కార్లయితే మీ ప్రాణాలకు అవి భద్రత కల్పిస్తాయి. ఇండియాలో GNCAP, BNCAP పరీక్షల ద్వారా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌లు పొందిన కార్లు కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం. మరి మీ దగ్గర ఉన్న కారు ఆ రూల్స్ కి అనుగుణంగా తయారు చేసిందో కాదో ఇక్కడ చెక్ చేసుకోండి.
కారు ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అత్యవసర వస్తువుగా మారిపోతోంది. ప్రజలు తమ రోజువారీ ప్రయాణాలకు వాటిని ఉపయోగిస్తారు. రోడ్లపై కార్ల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. అందుకే ప్రమాదాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మీరు సురక్షితమైన కారును కలిగి ఉండటం చాలా ముఖ్యం. లేదా మీ దగ్గర ఉన్న కారు మీకు సరైన రక్షణ కల్పిస్తుందో లేదో చెక్ చేసుకోవడం అవసరం. భారతదేశంలో తిరిగే కార్లు ప్రజలకు ఎంత సేఫ్టీనిస్తాయో తెలుసుకోవడానికి గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (GNCAP), భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (BNCAP) ద్వారా రేటింగ్ పొందాల్సి ఉంటుంది. ఆ రేటింగ్ ప్రకారం అవి ఎంత సేఫ్టీ కార్లో అర్థమవుతుంది.
సురక్షితమైన కార్లు
ఇంతకు ముందు వరకు కారు ఉంటే చాలు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. వినియోగదారులు తమకు అత్యంత సేఫ్టీ కార్లు కావాలని చూస్తున్నారు. వారి ప్రమాణాలకు అనుగుణంగా కార్ల తయారీదారులు కూడా ప్రయాణికుల భద్రతపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు.
కఠినమైన క్రాష్ పరీక్షల ద్వారా పెద్దలు, పిల్లలకు ఆ కార్లు ఎంత భద్రత ఇస్తాయో రేటింగ్ చేస్తారు. నవంబర్ 2024 నాటికి భారతదేశంలో అనేక కార్లు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌లను సాధించాయి. వాటి గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
టాటా సఫారీ/హారియర్
2023లో ఈ కారును BNCAP పరీక్షించింది. ఈ మోడల్స్ పెద్దల భద్రత (AOP)లో 30.08/32 రేటింగ్ సాధించాయి. పిల్లల భద్రత (COP)లో 44.54/49 స్కోర్ చేశాయి. ఈ కారులో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS లెవల్-II, ESP వంటి సౌకర్యాలు ఉన్నాయి.
టాటా పంచ్ EV
టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు 2024లో BNCAP టెస్ట్ లో 31.46/32(AOP) రేటింగ్ సాధించింది. పిల్లల సేఫ్టీకి సంబంధించి 45/49 (COP) స్కోర్ చేసింది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, ESC, ISOFIX సౌకర్యాలు ఉన్నాయి.
మహీంద్రా XUV 3XO
XUV 3XO ఫేస్‌లిఫ్ట్ 29.36/32 (AOP), 43/49 (COP) స్కోర్ చేసింది. దాని ADAS ఫీచర్స్, కొలిజన్ వార్నింగ్‌లు, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటివి డ్రైవర్, ప్రయాణికుల భద్రతను పెంచుతాయి.
మహీంద్రా థార్ రాక్స్
ఈ SUV అక్టోబర్ 2024లో BNCAP పరీక్ష ఎదుర్కొంది. పెద్దల భద్రతో 31.09/32 (AOP), పిల్లల విషయంలో 45/49 (COP) స్కోర్ చేసింది. ESC, TPMS, BLD వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.
మారుతి సుజుకి న్యూ డిజైర్
మారుతి సుజుకి న్యూ డిజైర్ కారు పెద్దలను రక్షించడంలో 31.24/34 (AOP) రేటింగ్ సాధించింది. పిల్లలను కాపాడటంతో 39.20/49 (COP) స్కోర్ చేసింది. మారుతి తొలి 5-స్టార్ రేటింగ్ పొందిన వాహనంగా రికార్డ్ సాధించింది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, హిల్ హోల్డ్ ఫంక్షన్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. మీరు కారు కొనే ఆలోచనలో ఉంటే సురక్షితమైన ప్రయాణానికి మంచి భద్రతా ఫీచర్స్ ఉన్న కారును ఎంచుకొని కొనుక్కోండి.