రూ.3 లక్షల లోపే లభించే బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్
మీరు తక్కువ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? అయితే రేవా ఐ మీ అవసరాలకు తగ్గట్టుగా ఉండే కారు. ఇది నగర ప్రయాణికులకు అనువైనది. ఈ కారు విశేషాలు తెలుసుకుందాం రండి.
సమర్థవంతమైన, సింపుల్ మెయింటనెన్స్ ఉన్న ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తున్నట్లయితే రేవా ఐ ఎలక్ట్రిక్ కారు మీకు సరైన ఎంపిక. తక్కువ బడ్జెట్ కారు కాబట్టి మీ ఇంటి అవసరాలు తీర్చుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. ముఖ్యంగా నగరాల్లో నివసించే వారు, రోజూ జాబ్ కి వెళ్లి వచ్చే వారు సింపుల్ మెయింటనెన్స్ ద్వారా దీని నడపవచ్చు.
రేవా ఐ ఎలక్ట్రిక్ కార్
రేవా ఐ ఎలక్ట్రిక్ కారు 3 డోర్ హాచ్‌బ్యాక్‌గా తయారైంది. కారు ముందు భాగంలో ఇద్దరు ఫ్రీగా కూర్చోవచ్చు. అయితే వెనుక సీటు పిల్లలను కూర్చోబెట్టడానికి లేదా లగేజీ వేసుకోవడానికి అవసరమైన మేరకు మడవవచ్చు. వాహనం 99% ఫైబర్ బాడీ. ఇది చూడటానికి మారుతి 800 మాదిరిగానే ఉంటుంది. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీని ఉపయోగించారు.
రేవా ఐ ముఖ్య ఫీచర్లు ఇవే..
రేవా ఐ ఎలక్ట్రిక్ కారు రోజువారీ నగర ప్రయాణాలకు అనువైంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే కారు 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఇది చిన్న దూర ప్రయాణాలకు అనువైంది. ఇందులో ఎయిర్ కండిషనర్, వీల్ కవర్లు, ఫాగ్ లైట్లు వంటి ఇతర సౌకర్యాలు కూడా ఉన్నాయి. 80 కి.మీ/గం గరిష్ట వేగంతో పరుగులు తీస్తుంది. 150 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటంతో గుంతలు ఉన్న రోడ్డులోనూ సులభంగా ప్రయాణించగలదు. ఈ కారు రద్దీగా ఉండే నగర వీధుల్లో కూడా సులభంగా ప్రయాణించగలదు.
ట్రాఫిక్ సమస్య ఉండదు
నగరాల్లో ఉండే వారికి ట్రాఫిక్ అతి పెద్ద సమస్య. రేవా ఐ చిన్న సైజులో ఉండటం వల్ల రద్దీగా ఉండే వీధుల గుండా ఇబ్బంది లేకుండా ప్రయాణించగలదు. కారు తేలికపాటి డిజైన్, సమర్థవంతమైన బ్యాటరీ వ్యవస్థను కలిగి ఉంది. నగరంలో రోజువారీ ప్రయాణాలకు ఇది చాలా బాగుంటుంది.
భారతీయ మార్కెట్‌కు ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావడంలో మహీంద్రా కీలక పాత్ర పోషించింది. దీనికి ప్రత్యక్ష నిదర్శనం రేవా ఐ. 2001లో ప్రారంభమైన రేవా ఐ, ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి రావడం ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఏ రేంజ్ లో పెరుగుతోందో తెలియజేస్తుంది.
ఇదే కారు ప్రత్యేకత
రేవా ఐ నిర్వహణ చాలా సులభం. సాంప్రదాయ ఇంధన ఆధారిత వాహనాలతో పోలిస్తే దాని నిర్వహణ ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. మారుతి సుజుకి విడిభాగాలను దీనికి ఉపయోగించవచ్చు. అందువల్ల దీన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ కారు అని చెప్పొచ్చు.
ధర వివరాలు
తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ కార్లలో రేవా ఐ ఒకటి. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర బేస్ మోడల్ రూ.2.88 లక్షలు. అయితే హైయర్ వేరియంట్‌ల ధర అయితే రూ.3.76 లక్షల వరకు ఉంటుంది.