డిజిటల్ లోన్ మొబైల్ యాప్‌లపై చర్యలు మరింత కఠినతరం.. : ఆర్‌బిఐ ప్యానెల్
డిజిటల్ లెండింగ్(digital lending) అంటే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు లేదా మొబైల్ యాప్‌ల ద్వారా రుణాలు(loans) ఇచ్చేందుకు ఆర్‌బిఐ ఇప్పుడు కఠినతరం చేసింది. అంతేకాదు డిజిటల్ లోన్లు (digital loans)ఇచ్చే మొబైల్ యాప్స్ పై చర్యలు ఇప్పుడు మరింత కఠినతరం కానున్నాయి. దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్(reserve bank) ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ నివేదికను సమర్పించింది.

ఆర్‌బిఐ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసిన కస్టమర్ రక్షణపై దృష్టి సారించిన నివేదికలో కస్టమర్ల భద్రతను నొక్కి చెప్పింది. ఇలాంటి కంపెనీలను చట్టపరమైన హస్తాల్లో ఉంచుతు కస్టమర్ల రక్షణను పెంచడమే ఈ నివేదిక ఉద్దేశమని ప్యానెల్ తరపున తెలిపారు. మొబైల్ యాప్‌ల ద్వారా అక్రమంగా రుణాలు ఇచ్చే కంపెనీలపై కఠిన నిబంధనలు రూపొందించాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వర్కింగ్ గ్రూప్ ప్రతిపాదించింది.
నోడల్ ఏజెన్సీ ఏర్పాటుకి ప్రతిపాదన
ఈ యాప్‌ల కోసం నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని వర్కింగ్ గ్రూప్ ప్రతిపాదించింది. పరిశ్రమలోని స్టేక్ హోల్డర్స్ తో కూడిన నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు. దీనితో పాటు, డిజిటల్ లెండింగ్ ఎకోసిస్టమ్‌లో ఉన్న అన్ని కంపెనీలను కలిగి ఉన్న సెల్ఫ్-రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ (SRBO) ను రూపొందించాలని కూడా సూచించింది. వర్కింగ్ గ్రూప్ కూడా డిజిటల్ రుణాలు సంబంధించిన అక్రమ కార్యకలాపాలు నిరోధించడానికి ఒక ప్రత్యేక చట్టం సూచించింది. అంతేకాకుండా డిజిటల్ లోన్ సెగ్మెంట్‌లోకి ప్రవేశించే ప్రతి కంపెనీ అనుసరించాల్సిన సాంకేతికతకు సంబంధించిన కొన్ని ప్రమాణాలు, ఇతర నిబంధనలను కూడా ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. వర్కింగ్ గ్రూప్ మొత్తం డేటాను భారతదేశంలో ఉన్న సర్వర్‌లలో స్టోర్ చేయాలని సిఫార్సు చేసింది.
కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షించడం చాలా ముఖ్యమైనదని వర్కింగ్ గ్రూప్ తెలిపింది. యాప్ ద్వారా అక్రమంగా డిజిటల్ లోన్లు ఇచ్చి, అందుకు ప్రతిఫలంగా కస్టమర్ల నుంచి భారీ వడ్డీ వసూలు చేసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. ఆర్‌బిఐ విడుదల చేసిన ఒక ప్రకటనలో, కస్టమర్ భద్రతను పెంపొందించడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడంతో పాటు డిజిటల్ రుణాల మొత్తం పర్యావరణ వ్యవస్థను భద్రపరచడం ఇంకా బలోపేతం చేయడంపై నివేదిక నొక్కిచెప్పిందని తెలిపింది.
డిసెంబర్ 31 వరకు సూచనలు ఇవ్వవచ్చు,
ఈ నివేదికను ఆర్‌బిఐ వెబ్‌సైట్‌లో గురువారం అప్‌లోడ్ చేసింది. 31 డిసెంబర్ 2021 వరకు ఇ-మెయిల్ ద్వారా నివేదికపై సూచనలు చేయవచ్చు. ఈ సూచనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే వర్కింగ్ గ్రూప్ నివేదికపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. విశేషమేమిటంటే, ఈ వర్కింగ్ గ్రూప్‌ను 13 జనవరి 2021న ఆర్‌బిఐ ఏర్పాటు చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జయంత్ కుమార్ దాస్ దీని ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.