Rapido: జొమాటో, స్విగ్గీకి పోటీగా రాపిడో ఫుడ్ డెలివరీ ధరల తగ్గింపు! కస్టమర్లకు పండగే
Rapido: వాహనం లేని వారిని తక్కువ ఖర్చుతో గమ్యస్థానాలకు చేరుస్తున్న రాపిడో ఇప్పుడు ఫుడ్ డెలివరీ రంగంలోకి దిగి సత్తా చాటుతోంది. తక్కువ ధరలకే ఫుడ్ డెలివరీ సేవలను అందిస్తూ జొమాటో, స్విగ్గీ వంటి కంపెనీలకు గట్టి పోటీనిస్తుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఫుడ్ డెలివరీ ఛార్జీలు తగ్గించిన రాపిడో
భారతదేశంలోని ఫుడ్ డెలివరీ మార్కెట్లో కొత్తగా వచ్చి వేగంగా అభివృద్ధి చెందుతున్న రాపిడో ఇటు కస్టమర్లను అటు రెస్టారెంట్లను ఆకర్షించే విధంగా తన ఫుడ్ డెలివరీ ఛార్జీలను భారీగా తగ్గించింది. ఇది జొమాటో, స్విగ్గీ వంటి ప్రముఖ కంపెనీలకు పెద్ద సవాలుగా మారింది.
అన్ని హోటళ్లకు రాపిడోనే ఫేవరేట్
రాపిడో ప్రస్తుతం ధరలను తగ్గించడం వల్ల చిన్న హోటళ్ల నుండి పెద్ద హోటళ్ల వరకు అన్ని ఆహార ఉత్పత్తి సంస్థలు రాపిడో వెంట వరుస కడుతున్నాయి. ప్రస్తుతం అనేక రెస్టారెంట్లు జొమాటో, స్విగ్గీ కంపెనీలకు 16% నుండి 30% వరకు కమిషన్ చెల్లిస్తున్నాయి. అయితే రాపిడో ఈ ఛార్జీని కేవలం 8% నుండి 15% వరకు మాత్రమే నిర్ణయించింది. దీంతో హోటళ్లకు అయ్యే ఖర్చు సగానికి తగ్గి ఆదాయం పెరగడంతో చాలా ప్రముఖ సంస్థలు రాపిడోను ఎంచుకుంటున్నాయి.
ఇతర డెలివరీ సేవల కంటే తక్కువ
రాపిడో ఇప్పుడు తక్కువ ధరకు వేగంగా ఫుడ్ డెలివరీ చేస్తూ కస్టమర్లకు ఉత్తమ ఎంపికగా మారుతోంది. ప్రస్తుతం రాపిడోలో రూ.400 కంటే తక్కువ ఆర్డర్‌లకు డెలివరీ ఛార్జీ రూ.25 మాత్రమే. అదేవిధంగా రూ.400 కంటే ఎక్కువ ఆర్డర్‌లకు డెలివరీ ఛార్జీ రూ.50గా ఉంది. ఈ ధరలు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర డెలివరీ సేవల కంటే చాలా తక్కువ.
చిన్న రెస్టారెంట్లకు లాభదాయకంగా..
ఈ ధరల మార్పు ముఖ్యంగా చిన్న, మధ్య తరహా రెస్టారెంట్లకు లాభదాయకంగా ఉంది. చిన్న రెస్టారెంట్లకు ఇది ఒక కొత్త వేదిక అవుతోందని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ (NRAI) సభ్యులు తెలిపారు. చిన్నగా మెస్ నడుపుతున్నవారు, ఇళ్లలో నాణ్యమైన ఆహారాన్ని తయారు చేసేవారు కూడా రాపిడో ధరల తగ్గింపు తమకు ప్రయోజనకరంగా ఉంటోందని సంతోషం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం బెంగళూరులో మాత్రమే..
రాపిడో అమలు చేస్తున్న ఈ కొత్త డెలివరీ ధరల విధానం మొదటి దశలో బెంగళూరు నగరంలో అమలు చేస్తున్నారు. తరువాత చెన్నైతో సహా ఇతర నగరాలకు కూడా ఈ ధరల తగ్గింపును అమలు చేయడానికి రాపిడో ప్రణాళికలు సిద్ధం చేస్తోందని మార్కెట్ వర్గాలు తెలియజేస్తున్నాయి.