తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే వ్యాపారం చేయాలనుకుంటున్నారా? ఇంట్లోనే సింపుల్ గా మొదలుపెట్టి, దేశ విదేశాలకు కూడా ఎగుమతి చేయవచ్చు. పండగల సమయంలో డిమాండ్ ఫుల్ గా ఉంటుంది. ఆ బిజినెస్ ఏంటో? ఎలా స్టార్ట్ చేయాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.
వ్యాపారం చేయడం అనుకున్నంత ఈజీ కాదు. కాని నైపుణ్యం, వ్యాపార జ్ఞానం, మార్కెట్ అవకాశాలు, డిమాండ్ వంటి అంశాలపై అవగాహన పెంచుకుంటే ఏ వ్యాపారాన్నైనా సక్సెస్ చేయగలరు. డబ్బున్న వాళ్ళే వ్యాపారం చేయాలని లేదు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారు కూడా తక్కువ పెట్టుబడితో వ్యాపారం మొదలుపెట్టి అంచెలంచెలుగా పెంచుకోవచ్చు. అలాంటి కుటీర పరిశ్రమల్లో అగర్‌బత్తీల తయారీ ఒకటి.
టాప్ 10 వ్యాపారాల్లో అగర్‌బత్తీల తయారీ ఒకటి
తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే టాప్ 10 వ్యాపారాల్లో అగర్‌బత్తీల తయారీ ఒకటి. భారతదేశంలో ఏటా 10 వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. 5 లక్షల మందికి ఇందులో ఉపాధి పొందుతున్నారు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే లక్షల రూపాయలు, పెద్ద స్థలం అవసరం లేదు. ఇంట్లోనే ఒక గది లేదా వరండాలో కేవలం వెయ్యి రూపాయల పెట్టుబడితో దీన్ని స్టార్ట్ చేయొచ్చు.
90కి పైగా దేశాలకు అగర్‌బత్తీల ఎగుమతి
గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు తయారు చేసే అగర్‌బత్తీలకు దేశీయంగానే కాకుండా విదేశాల్లో కూడా డిమాండ్ ఉంది. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా తయారయ్యే అగర్‌బత్తీలు 90కి పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
భారతదేశం వివిధ సంస్కృతులు, సంప్రదాయాలకు నిలయం. ఆలయాలు, మసీదులు, చర్చిలు ఇలా ఏ మతంలోనైనా ఆధ్యాత్మిక అవసరాలకు, సువాసనలు వెదజల్లడానికి అగర్ బత్తీలు, ధూపం వంటి వస్తువులు ఉపయోగిస్తారు. అందుకే వీటికి దేశవ్యాప్తంగా డిమాండ్ ఎక్కువ.
అగర్‌బత్తీల తయారీ ఎలా
అగర్‌బత్తీలు తయారు చేయడానికి సింపుల్ మెషీన్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఇవి కేవలం రూ.15,000 నుంచి మొదలవుతాయి. ఇక రా మెటీరియల్ పేస్ట్ కూడా దొరుకుతుంది. ఇందులో చందనం, సుగంధ ద్రవ్యాలు, వట్టవేర్లు, దాల్చిన చెక్క, కస్ కస్ గడ్డ, చందనం పొడి, బొగ్గు పొడి, బెల్లం కషాయం, పొటాషియం నైట్రేట్ ఉంటాయి. వీటిని సరైన నిష్పత్తిలో కలిపి పేస్ట్ తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని అగర్ బత్తీలు తయారు చేసే యంత్రంలో వేసి వెదురు బద్దలు పెట్టి మెషీన్ రన్ చేస్తే అగర్ బత్తీలు తయారై బయటకు వస్తాయి. వాటిని ఆరబెట్టి ప్యాకింగ్ చేసి అమ్మవచ్చు.
అగర్‌బత్తీలు పర్యావరణానికి మేలు
సహజ మూలికలతో తయారైన అగర్‌బత్తీలు ఆరోగ్యానికి, పర్యావరణానికి మేలు చేస్తాయి. అందుకే వీటికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. ముందుగా వీటిని స్థానిక దుకాణాల్లో అమ్మవచ్చు. మార్కెటింగ్ పెంచుకొని సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్, పూజా స్టోర్స్, ఇలా అమ్మకాలు పెంచుకోవచ్చు. విదేశాల్లోనూ అగర్‌బత్తీలకు డిమాండ్ ఉంది. అక్కడ కూడా ఆఫర్లు సంపాదిస్తే మీ వ్యాపార ఆదాయం రూ.లక్షల్లోకి చేరుకుంటుంది.
అగర్‌బత్తీల తయారీకి పెట్టుబడి ఎంత?
చిన్న స్థాయిలో మొదలుపెడితే రూ.40,000 నుండి రూ.80,000 వరకు పెట్టుబడి సరిపోతుంది. దేశీయ వ్యాపార లైసెన్స్, జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. వ్యాపారం మొదలైన తర్వాత నెలకు రూ.1.5 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఇందులో ఖర్చులు పోను లాభం రూ.50,000 నుండి రూ.60,000 వరకు ఉంటుంది. డిమాండ్ పెరిగితే ఆదాయం లక్షల్లోకి వెళ్లే అవకాశం ఉంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే వ్యాపారాలకు ఇదొక మంచి ఉదాహరణ.