Saving scheme: మీ సేవింగ్స్ ఖాతాలో డబ్బుందా? ఇలా చేస్తే రూ. 5 లక్షల వడ్డీ పొందొచ్చు
డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దానిని సరిగ్గా మ్యానేజ్ చేయడం కూడా అంతే ముఖ్యమని తెలిసిందే. ఎలాంటి రిస్క్ లేకుండా వడ్డీ లభించే ఎన్నో పథకాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనేది కేంద్ర ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ ద్వారా అందించే ఒక చిన్న పొదుపు పథకం. దీనికి పెట్టుబడి ప్రారంభించేందుకు కనీసంగా రూ.1,000 మాత్రమే అవసరం. గరిష్ట పెట్టుబడికి ఎలాంటి పరిమితి లేదు. మీ డబ్బుకు పూర్తి భద్రత లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడమే దీనికి కారణం. అలాగే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C ప్రకారం పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.
వడ్డీ రేటు, లాక్ ఇన్ వ్యవధి
ప్రస్తుతం NSC పై వార్షికంగా 7.7% వడ్డీ లభిస్తోంది. వడ్డీ సంవత్సరానికోసారి కాంపౌండ్ అవుతుంది. పెట్టుబడిపై ఐదు సంవత్సరాల లాక్‌ఇన్ వ్యవధి ఉంటుంది. ఈ కాలానికి ముందు నగదు తీసుకోవాలంటే వడ్డీ లభించదు. పూర్తి ప్రయోజనం పొందాలంటే మెచ్యూరిటీ వరకు విత్‌డ్రా చేయకూడదు.
ఐదు సంవత్సరాల్లో ఎంత ఆదాయం?
కాంపౌండ్ ఇంటరెస్ట్‌తో NSCలో పెట్టుబడి వేయడం వల్ల మీరు మంచి లాభాలు పొందవచ్చు. ఉదాహరణకు మీరు రూ. 1,00,000 పెట్టుబడిపై రూ. 44,995 వడ్డీ పొందొచ్చు. ఇలా అసలుతో కలిపి మొత్తం రూ. 1,44,995 రిటర్న్స్ పొందొచ్చు. రూ. 5 లక్షల పెట్టుబడిపై రూ. 2,24,974 వడ్డీతో మొత్తం రూ. 7,24,974 పొందొచ్చు. రూ. 11,00,000 పెట్టుబడిపై రూ. 4,93,937 వడ్డీతో కలిపి మొత్తం రూ. 15,93,937 పొందొచ్చు.
పిల్లల భవిష్యత్తు కోసం కూడా
ఈ పథకాన్ని చిన్నారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే తల్లిదండ్రులు తమ 10 ఏళ్లలోపు పిల్లల పేరిట NSC అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. పిల్లల విద్య, భవిష్యత్ అవసరాలకు ముందుగానే ప్లాన్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే అకౌంట్ నిర్వహణ పూర్తి హక్కు తల్లిదండ్రులకే ఉంటుంది.
ఎలా పెట్టుబడి పెట్టాలి.?
ఇందుకోసం ముందుగా మీకు సమీపంలో ఉన్న పోస్టాఫీస్ సందర్శించాలి. అనంతరం NSC అప్లికేషన్ ఫారమ్ తీసుకుని ఫిల్ చేయాలి. ఆధార్, పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ వంటి డాక్యుమెంట్లు సమర్పించాలి. గ్యారెంటీడ్ రిటర్న్స్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ చాయిస్‌గా చెప్పొచ్చు. ఇది మార్కెట్‌పై ఆధారపడని, పూర్తిగా స్థిరమైన స్కీమ్ కావడంతో ఎలాంటి రిస్క్ ఉండదు.