OTP కొత్త రూల్స్: జియో, Vi, ఎయిర్‌టెల్ వినియోగదారులకు ఓటీపీలు రావా?
డిజిటల్ లావాదేవీల్లో OTP మోసాలు పెరుగుతుండటంతో TRAI కొత్త నిబంధనలు తెచ్చింది. దీని ప్రకారం Jio, Vi, Airtel వినియోగదారులకు ఇకపై ఓటీపీలు రావని వార్త ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై TRAI క్లారిఫికేషన్ ఇచ్చింది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఏదైనా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ కి లేదా అకౌంట్ వెరిఫికేషన్‌కి మన ఫోన్‌కి OTP వస్తుంది కదా.. అయితే OTP మోసాలు పెరిగిపోయి చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో TRAI కొత్త నిబంధనలు తీసుకొచ్చిందన్న విషయం వైరల్ అవుతోంది. అయితే ఆ వార్తల్లో నిజానిజాలు చెప్పడానికి ట్రాయ్ ప్రత్యేక వివరణ ఇచ్చింది. అసలు ఏం ప్రచారం జరుగుతోందంటే..
ఆన్ లైన్ మోసాలను అరికట్టడానికి ప్రచారాలు, ప్రకటనల రూపంలో వచ్చే మెసేజెస్ మూలాన్ని, OTPలతో సహా టెలికాం ఆపరేటర్లు గుర్తించాలి. ఈ SMSలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవాలి. తద్వారా టెలికాం కంపెనీలు హానికరమైన ఎస్ఎంఎస్ లను బ్లాక్ చేసి, వినియోగదారులను మోసాల నుండి రక్షించవచ్చు.
ఇలా చేయకపోతే బ్యాంక్, ఈ-కామర్స్, సోషల్ మీడియా వంటి ముఖ్యమైన సేవలకు OTPలు ఆలస్యంగా వస్తాయని, లేదా బ్లాక్ అవుతాయన్న వార్త ప్రచారంలో ఉంది. ఈ రూల్స్ ని దశలవారీగా అమలు చేయడానికి TRAI గడువు ఇచ్చిందని, నవంబర్ 30 వరకు ఈ నిబంధనలు పాటించని సంస్థలకు హెచ్చరికలు జారీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ 1 నుంచి నిబంధనలు పాటించని సంస్థల సందేశాలు పూర్తిగా బ్లాక్ చేస్తామని TRAI చెప్పినట్లుగా ఉంది.
అయితే ఈ వార్తను TRAI ఖండించింది. తన ఎక్స్ పేజీలో “ఈ వార్త తప్పు. ఆపరేటర్లకు ఎస్ఎంఎస్ ల మూలాన్ని గుర్తించాలని మాత్రమే TRAI ఆదేశించింది. అంతేకాని TRAI ఏ సందేశాలనూ ఆలస్యం చేయదు." అని పేర్కొంది. అయితే ఈ కొత్త నిబంధనల అమలు భవిష్యత్తులో వినియోగదారుల భద్రతను పెంచుతుందని TRAI పేర్కొంది. కానీ OTP డెలివరీలో తాత్కాలిక అంతరాయాలు ఏర్పడవచ్చని తెలిపింది.
TRAI సూచనలు, సలహాలు ఇవిగో..
టెలికాం ఆపరేటర్లు నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నందున వినియోగదారులు తమ అకౌంట్స్ రక్షించుకోవడానికి OTPలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలి. అంటే క్యాప్చా లాంటి వాటిని ఉపయోగించుకోవాలి.
2FAని ఎనేబుల్ చేయాలి. OTPలకు అదనంగా అథెంటికేషన్ లేయర్‌ను జోడించడం ద్వారా మీ అకౌంట్స్ భద్రంగా ఉంటాయి.
సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయడం, తెలియని యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడం వంటివి చేయకూడదు.
మీ పరికరాన్ని సురక్షితంగా ఉంచుకోవాలి. మీ పరికర సాఫ్ట్‌వేర్‌ను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేసుకోవాలి. బలమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలి. సెక్యూరిటీ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
TRAI కొత్త ట్రేసబిలిటీ నిబంధనలు స్పామ్, మోసాల నుండి వినియోగదారులను రక్షించడానికి ఉపయోగపడతాయి. బిజినెస్ తరహా ఎస్ఎంఎస్ లు వచ్చినప్పుడు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించడాన్ని తప్పనిసరి చేయడం ద్వారా TRAI సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రజల ప్రైవసీని, డబ్బును కాపాడుతుంది.