తెలియని నంబరు నుంచి మిస్డ్ కాల్ వస్తే కాల్ బ్యాక్ చేయకండి: ఇదో పెద్ద స్కామ్
మీకు తెలియని నంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చిందా? పొరపాటున కూడా కాల్ బ్యాక్ చేయకండి. ఇదొక స్కామ్ కావచ్చు. దీని వల్ల మీరు భారీగా డబ్బులు పోగొట్టుకుంటారు. ఇటీవల ఇలాంటి మోసాలు పెరిగిపోయాయని జియో తన వినియోగదారులను హెచ్చరిస్తూ నోట్ రిలీజ్ చేసింది. ఈ మిస్డ్ కాల్ స్కామ్ గురించి వివరంగా తెలుసుకుందాం రండి.
సాధారణంగా మనకేదైనా మిస్డ్ కాల్ వస్తే తిరిగి కాల్ చేస్తాం కదా.. డ్రైవింగ్ లో ఉండటం వల్ల చూడలేకపోయామని, సిగ్నల్ లేక కట్ అయ్యుంటుందని, ఇలా వేరు వేరు కారణాలతో తిరిగి కాల్ చేస్తాం. అయితే తెలుసున్న వారు మిస్డ్ కాల్ ఇస్తే కాల్ బ్యాక్ చేయొచ్చు. కాని గుర్తు తెలియని నంబర్ నుంచి మిస్డ్ కాల్ వస్తే పొరపాటున కూడా కాల్ బ్యాక్ చేయొద్దు. ఇది ఒక స్కామ్ కావచ్చు. ఇటీవల ఇలాంటి మోసాలు పెరిగిపోతున్నాయి.
రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం కొత్త హెచ్చరిక జారీ చేసింది. ప్రీమియం రేట్ సర్వీస్ ను ఉపయోగించుకొని స్కామ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారని జియో గుర్తించి తన వినియోగదారులను హెచ్చరించింది.
ఈ స్కామ్ ఎలా జరుగుతుందంటే.. వినియోగదారులకు ఇంటర్నేషనల్ నంబర్స్ నుండి మిస్డ్ కాల్ వస్తుంది. దీంతో కాల్ బ్యాక్ చేశారంటే కాల్ ఛార్జీలు చాలా ఎక్కువగా పడతాయి. ఈ డబ్బులు స్కామర్ల అకౌంట్స్ కి వెళ్లిపోతాయి.
ప్రీమియం రేట్ సర్వీస్ స్కామ్ అంటే ఏమిటి?
స్కామర్లు ప్రీమియం రేటు నంబర్లను క్రియేట్ చేస్తారు. లేదా దీనికి యాక్సెస్ పొందటానికి కొంతమంది నేరస్థుల సహకారం తీసుకుంటారు. ఈ నంబర్లు అధిక రేట్లను చార్జ్ చేసే విధంగా సెటప్ చేసి ఉంటాయి. అంటే సెకన్ లేదా నిమిషానికి అధిక రేట్లు వసూలవుతాయి.
ప్రీమియం రేట్ సర్వీస్ స్కామ్‌లో వినియోగదారులు తెలియని అంతర్జాతీయ నంబర్ నుండి మిస్డ్ కాల్ అందుకుంటారు. తిరిగి కాల్ చేస్తే ఆఫర్లంటూ, రీఛార్జ్ ప్లాన్స్ అంటూ మీతో చాలా సేపు మాట్లాడతారు. ఈ కాల్స్ నిమిషానికి అధిక ఛార్జీ వసూలవుతాయి. ఇలా వసూలయిన డబ్బు స్కామర్ల అకౌంట్స్ కి మారేలా ముందే సెటప్ చేసి ఉంటారు.
ఈ స్కామ్‌ను ఎలా నివారించాలి
మీరు గుర్తించని '+91' కాకుండా ఇతర దేశ కోడ్‌లతో కూడిన నంబర్‌లకు తిరిగి కాల్ చేయకండి. మీరు అనుమానాస్పద అంతర్జాతీయ నంబర్ నుండి పదే పదే కాల్‌లు అందుకుంటే బ్లాక్ చేసేయండి. తెలియని స్థానిక నంబర్‌లకు కూడా తిరిగి కాల్ చేయవద్దు. ఈ స్కామ్ గురించి మీ కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులకు తెలియజేయండి.
ఇది కూడా చదవండి ప్రపంచంలో హత్యలు ఎక్కువగా జరిగే నగరాలివే: ఇండియాలో ఏమైనా ఉన్నాయా?