ప్రపంచంలో హత్యలు ఎక్కువగా జరిగే నగరాలివే: ఇండియాలో ఏమైనా ఉన్నాయా?
ఆ నగరాలు ఎంత ప్రమాదమంటే.. ప్రతి లక్ష మందిలో సుమారు 100 మందికి పైగా హత్యకు గురవుతుంటారు. ఇక ప్రమాదాలు, అనారోగ్య సమస్యలతో చనిపోయే వారి సంఖ్య చెప్పనక్కరలేదు. అయితే కేవలం హత్యల వల్ల పేమస్ అయిన నగరాల గురించి ఇక్కడ వివరాలు ఉన్నాయి. ప్రపంచంలో 2024లో ప్రతి లక్ష మంది జనాభాకి జరిగిన హత్యల సంఖ్య ఆధారంగా టాప్ 5 ప్రమాదకర నగరాల జాబితా ఇక్కడ ఉంది. మరి ఇండియాలో ఏ నగరమైనా ఆ జాబితాలో ఉందా? తెలుసుకుందాం రండి.
1. కొలిమా, మెక్సికో
ఓ సంస్థ చేసిన సర్వే నివేదికల ఆధారంగా మెక్సికోలోని కొలిమా నగరంలో 2024లో ప్రతి లక్ష మందిలో 140 హత్యకు గురయ్యారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన నగరంగా నిలిచింది. గ్యాంగ్ స్టర్స్ గొడవలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వల్ల ఈ నగరం తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఇది చిన్న నగరమే అయినప్పటికీ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల నేరాలు పెరిగిపోయి ప్రజలు భయంతో జీవిస్తున్నారు.
2. సియుడాద్ ఒబ్రెగాన్, మెక్సికో
సియుడాద్ ఒబ్రెగాన్ నగరం కూడా మెక్సికో దేశంలోనే ఉంది. 2024లో ఇక్కడ ప్రతి లక్ష మందిలో 117 హత్యకు గురయ్యారు. దీంతో ప్రపంచంలోనే రెండవ అత్యంత ప్రమాదకరమైన నగరంగా నిలిచింది. సోనోరా రాష్ట్రంలో ఉన్న ఈ సియుడాద్ ఒబ్రెగాన్ నగరం హింస, మాదక ద్రవ్యాల వినియోగం కారణంగా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. హత్యలు, కిడ్నాప్‌లు, హింసాత్మక ఘర్షణలు ఈ నగరంలో పెరిగిపోయాయి.
3. పోర్ట్-ఓ-ప్రిన్స్, హైతీ
హైతీ దేశ రాజధాని పోర్ట్-ఓ-ప్రిన్స్. 2024లో ఇక్కడ ప్రతి లక్ష మందికి 117 మంది హత్యకు గురయ్యారు. ఇది ప్రపంచంలోనే మూడవ అత్యంత ప్రమాదకరమైన నగరం. గ్యాంగ్ స్టర్స్ మధ్య గొడవల వల్ల ఆయుధాలతో దాడులు చేసుకుంటారు. భూ కబ్జాలు, ఆక్రమణలు కోసం కొట్టుకుంటారు. దీనివల్ల కిడ్నాప్‌లు, హత్యలు, లైంగిక వేధింపులు పెరిగిపోయాయి. ఈ నగరంలో రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభాలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల సమస్యలు మరింత తీవ్రమయ్యాయి.
4. జమోరా, మెక్సికో
జమోరా కూడా మెక్సికోలోని నగరమే. 2024లో ఇక్కడ ప్రతి లక్ష మందికి 105 మంది హత్యకు గురయ్యారు. జమోరా ప్రపంచంలోనే నాల్గవ అత్యంత ప్రమాదకరమైన నగరంగా నిలిచింది. ఈ చిన్న నగరంలో హత్యలు, కిడ్నాప్‌లు, ఇతర హింసాత్మక సంఘటనలు గణనీయంగా పెరిగిపోయాయి. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వల్లే ఇక్కడ హింసాత్మక సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.
5. మన్జానిల్లో, మెక్సికో
ప్రపంచంలోనే ఐదవ అత్యంత ప్రమాదకరమైన నగరం మన్జానిల్లో. 2024లో ప్రతి లక్ష మందిలో 102 మంది హత్యకు గురయ్యారు. పసిఫిక్ తీరంలో రద్దీగా ఉండే ఓడరేవు నగరమైన ఈ మన్జానిల్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా విపరీతంగా జరుగుతుంది. అందుకే హింస గణనీయంగా పెరిగింది. నగరంలో హత్యలు, హింసాత్మక నేరాలు పెరిగిపోయాయి.
మెక్సికో దేశంలోనే టిజువానా, జకాటెకాస్, సియుడాద్ జువారెజ్ నగరాలు కూడా హత్యలు ఎక్కువగా జరిగే నగర జాబితాల్లో ఉన్నాయి. దీన్ని బట్టి మెక్సికో దేశం ఎంత ప్రమాదకరమైందో అర్థం చేసుకోవచ్చు. అదృష్టం కొద్దీ ఇండియాలో ఇలాంటి నగరాలేమీ లేవు. లా అండ్ ఆర్డర్, చట్టాలు, న్యాయాలు సక్రమంగా అమలవుతుండటం వల్ల నేరాలకు అడ్డుకట్ట పడుతోందనే చెప్పుకోవాలి.