LIC పాలసీలే కాదు.. ఉపాధి కూడా కల్పిస్తుంది: మహిళలు రూ.2 లక్షల వరకు సంపాదించే అవకాశం
LIC.. ఇన్సూరెన్స్ పథకాల ద్వారా కుటుంబాలకు భరోసా ఇవ్వడమే కాకుండా మహిళలకు ఉపాధి కూడా కల్పిస్తోంది. మహిళలు స్వయం ఉపాధి పొందాలన్న ఉద్దేశంతో రూ.2 లక్షలు సంపాదించే మార్గాన్ని అమలు చేస్తోంది. ఆ స్కీమ్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మహిళలకు LIC బీమా సఖి యోజన
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారత కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. మహిళలు విద్య, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందుకు రావడానికి ప్రభుత్వం అనేక సహాయ పథకాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రముఖ బీమా సంస్థ LIC (Life Insurance Corporation of India) మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించే "బీమా సఖి యోజన" అనే కొత్త పథకాన్ని అమలు చేస్తోంది.
LIC బీమా సఖి యోజన గ్రామీణ మహిళలకు ఒక చక్కటి ఉపాధి మార్గం. ఈ పథకం ద్వారా మహిళలు బీమా ఏజెంట్లుగా శిక్షణ తీసుకొని క్వాలిఫై అయితే ఉద్యోగం కూడా ఇస్తారు.
బీమా సఖి యోజన అంటే ఏమిటి?
ఈ పథకాన్ని 2024 డిసెంబర్ 9న హర్యానాలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇందులో గ్రామీణ మహిళలను ఎంపిక చేసి వారికి మూడు సంవత్సరాలు బీమా ఏజెంట్ శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలంలోనే వారు నెలవారీ స్టైపెండ్, కమిషన్ ద్వారా ఆర్థిక సహాయం పొందవచ్చు.
మహిళలకు శిక్షణ ఇచ్చే ఈ మూడు సంవత్సరాల్లో తగిన ఆర్థిక సహాయం అందిస్తారు. శిక్షణలో చేరే మహిళలకు మొదటి సంవత్సరం నెలకు 7 వేల రూపాయలు, రెండో సంవత్సరం నెలకు రూ.6 వేలు, మూడో సంవత్సరం నెలకు రూ.5 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు. మొత్తంగా మూడు సంవత్సరాలకు కలిపి రూ.2.16 లక్షలు అందుతాయన్న మాట.
కమిషన్ ద్వారా అదనపు ఆదాయం
శిక్షణ పొందుతున్న సమయంలోనే మహిళలు LIC పాలసీలను అమ్మి ఆదాయం పొందవచ్చు. మొదటి సంవత్సరంలోనే ఒక మహిళ రూ.48,000 వరకు కమిషన్ పొందే అవకాశం ఉంది. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఒక ముఖ్యమైన చర్య అవుతుంది.
శిక్షణ పూర్తయిన తర్వాత మహిళలకు “బీమా సఖి” సర్టిఫికెట్, LIC ఏజెంట్ ఐడీ/కోడ్ ఇస్తారు. దాని ద్వారా వారు పూర్తిస్థాయి LIC ఏజెంట్లుగా పనిచేయవచ్చు. స్వయం ఉపాధి బీమా ఏజెంట్లుగా పనిచేయవచ్చు.
బీమా సఖి యోజన ముఖ్య ఉద్దేశాలు
గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించడం, మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడం, కుటుంబంలో, సమాజంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం బీమా సఖి యోజన ముఖ్య ఉద్దేశాలు.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
బీమా సఖి యోజనలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 18-45 సంవత్సరాల మధ్య ఉండాలి. గ్రామీణ నేపథ్యం నుండి వచ్చినవారికి ప్రాధాన్యత ఇస్తారు.
LIC ఉద్యోగులు, ఏజెంట్ల బంధువులు, రిటైర్డ్ LIC ఉద్యోగులు, మాజీ ఏజెంట్లు, ప్రస్తుత ఏజెంట్లు దరఖాస్తు చేయడానికి అనర్హులు.
ఎలా దరఖాస్తు చేయాలంటే..
LIC అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించండి.
“బీమా సఖి యోజన” విభాగాన్ని ఎంచుకోండి.
ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ నింపండి.
విద్యార్హత ధృవీకరణ పత్రం, గుర్తింపు కార్డులను జత చేయండి.
చివరిగా సబ్మిట్ కొట్టి అప్లై చేయండి.