- Home
- Business
- 9 Carats Gold: 9 క్యారెట్ల బంగారం అంటే ఏమిటి? దీని ధర ఎంత ఉంటుంది? హాల్ మార్క్ వస్తుందా?
9 Carats Gold: 9 క్యారెట్ల బంగారం అంటే ఏమిటి? దీని ధర ఎంత ఉంటుంది? హాల్ మార్క్ వస్తుందా?
9 Carats Gold: బంగారం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. సాధారణ ప్రజలు బంగారం కొనడం కష్టమైపోతుంది. అందుకే తక్కువ ధరకే వచ్చేచ 9 క్యారెట్ బంగారు ఆభరణాలు కొనుక్కుంటే పెళ్లిళ్లకు, వేడుకలకు నిండుగా కనిపిస్తారు.

పెరుగుతున్న బంగారం ధరలు
బంగారం ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. పెళ్లిళ్లు, పండుగలు ఏవైనా కూడా కచ్చితంగా ఆభరణాలు వేసుకోవాల్సిందే. తెలుగిళ్లల్లో బంగారం లేకుండా ఏ వేడుకను ఊహించలేము. కానీ బంగారం ధరలు సాధారణ ప్రజలకు అందనంతగా పెరిగిపోయాయి. ఈ పరిస్థితిలో చాలా మంది తక్కువ ధరలో బంగారం కొనాలనుకుంటున్నారు. ఇలాంటి వారి కోసం ఇప్పుడు మార్కెట్లోకి కొత్త ట్రెండ్ వచ్చింది .. అదే 9 క్యారెట్ల బంగారం.
9 క్యారెట్ల బంగారం అంటే ఏమిటి?
బంగారం స్వచ్ఛతను కొలిచే ప్రమాణమే క్యారెట్. 24 క్యారెట్ బంగారం 100 శాతం స్వచ్ఛమైన బంగారం. కానీ అది మృదువుగా ఉండటం వల్ల ఆభరణాలు తయారు చేయడానికి ఉపయోగించడం కష్టమవుతుంది. అందుకే ఇతర లోహాలను కలిపి దానికి బలాన్ని, మెరుపును ఇవ్వడం జరుగుతుంది. మార్కెట్లో ఆభరణాలు తయారుచేసేది 22 క్యారెట్ల బంగారంతో.
గ్రాము ధర ఎంత?
9 క్యారెట్ బంగారంలో కేవలం 37.5 శాతం మాత్రమే స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. మిగతా 62.5 శాతం భాగం రాగి, వెండి, నికెల్, జింక్ వంటి ఇతర లోహాలతో కలిపి ఉంటుంది. అంటే 24 క్యారెట్ బంగారంతో పోలిస్తే ఇది తక్కువ శుద్ధి గల బంగారం. అందుకే దీని ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. 9 క్యారెట్ ల బంగారం గ్రాము ధర 4,983 రూపాయలుగా ఉంది.
ఫ్యాషన్ ఆభరణాలు
ప్రస్తుతం యువతలో ఫ్యాషన్ ఆభరణాల డిమాండ్ ఎక్కువగా ఉంది. ప్రతిరోజూ ధరించగలిగే తేలికపాటి ఆభరణాలను కోరుకుంటున్నారు. 9 క్యారెట్ బంగారం ఈ అవసరాన్ని బాగా తీర్చుతుంది. ఇది తక్కువ ధరకే లభిస్తాయి. రోజూ వేసుకున్నా ఈ ఆభరణాలు పాడవవు. 9 క్యారెట్ల బంగారంతో తక్కువ బరువులో అందమైన డిజైన్లను తయారు చేయడం వీలవుతుంది.
9 క్యారెట్లకు హాల్ మార్క్
భారతదేశంలో ఇప్పటివరకు 22 క్యారెట్, 18 క్యారెట్ బంగారం ఎక్కువగా ప్రాచుర్యంలో ఉండేది. కానీ ఇటీవల BIS (Bureau of Indian Standards) 9 క్యారెట్ బంగారానికి కూడా హాల్‌మార్కింగ్ అనుమతి ఇచ్చింది. దీంతో ఈ బంగారానికి విశ్వసనీయత పెరిగింది. హాల్‌మార్క్ అనేది బంగారం నాణ్యతను నిర్ధారించే ప్రభుత్వ గుర్తింపు. 9 క్యారెట్ బంగారంపై కూడా ఇప్పుడు హాల్‌మార్క్ సర్టిఫికేట్ ఉంటుంది. ఈ బంగారు వస్తువులపై 375 నంబర్ ఉంటుంది. బంగారం కొనుగోలు చేసే ముందు హాల్‌మార్క్ 375 గుర్తు ఉందో లేదో తప్పక చూసుకోవాలి. హాల్‌మార్క్ లేకుండా కొనడం మోసపోవడానికి దారితీస్తుంది.