ఇవి మీరు కచ్చితంగా తెలుసుకోవాలి: గ్యాస్ నుంచి PF వరకు అన్నీ మారిపోతాయ్
కొత్త సంవత్సరం మొదటి నెల మొదటి రోజు నుంచి ఇండియాలో కొన్ని ముఖ్యమైన విషయాల్లో మార్పులు అమలు కానున్నాయి. ఇందులో నిత్యావసరమైన గ్యాస్ ధరల నుంచి ప్రావిడెంట్ ఫండ్ వరకు అనేక అంశాలు ఉన్నాయి. ఈ మార్పుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆ మార్పుల గురించి తెలుసుకుందాం రండి.
గ్యాస్ ధరలు
సాధారణంగా ప్రతి నెల ప్రారంభంలో ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తాయి. గత కొన్ని నెలలుగా దేశీయ గ్యాస్ సిలిండర్ల ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. జనవరిలో గ్యాస్ సిలిండర్ ధరల్లో గణనీయమైన సవరణ ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది దేశీయ, వాణిజ్య వినియోగదారులను ప్రభావితం విషయం. అనేక కుటుంబాలు, వ్యాపారాలు మారనున్న ధరలకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవడం అవసరం.
UPI 123Pay
డిజిటల్ చెల్లింపులను మెరుగుపరిచే చర్యలో భాగంగా UPI 123Pay లావాదేవీ లిమిట్ ను పెంచారు. గతంలో రూ.5,000గా ఉన్న ఈ పరిమితి జనవరి 1 నుండి రూ.10,000గా ఉంటుంది. ఈ పెరుగుదల అధిక విలువైన లావాదేవీలు చేసే వినియోగదారులకు ఉపయోగంగా ఉంటుంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లు లేదా ఇంటర్నెట్ అందుబాటులో లేని వారు కూడా డిజిటల్ పేమెంట్స్ చేయొచ్చు. UPI 123Pay ఫీచర్ ఫోన్‌ల ద్వారా చెల్లింపులు చేయడానికి వినియోగదారులకు సహాయపడుతుంది. ఈ చర్యతో భారతదేశం అంతటా డిజిటల్ పేమెంట్స్ మరింత పెరుగుతాయని గవర్నమెంట్ భావిస్తోంది.
అమెజాన్ ప్రైమ్
అమెజాన్ ప్రైమ్ దాని సభ్యత్వ విధానాల్లో మార్పులు చేస్తోంది. ముఖ్యంగా స్ట్రీమింగ్ పరిమితులకు సంబంధించి కొన్ని మార్పులు రానున్నాయి. త్వరలో అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం ఒకేసారి రెండు టెలివిజన్లలో స్ట్రీమింగ్ చేసేలా ఉంటుంది. మూడవ వినియోగదారుడు అదే అకౌంట్ లో మరొక టీవీలో స్ట్రీమ్ చేయడానికి ప్రయత్నిస్తే అనుమతి ఉండదు. కచ్చితంగా మరో ప్రైమ్ సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ లిమిటేషన్ కి కారణం కుటుంబాలు మెరుగైన యాక్సెస్, స్ట్రీమింగ్ నాణ్యత కోసం పర్సనల్ సబ్ స్క్రిప్షన్ తీసుకొనేలా ఎంకరేజ్ చేయడమే.
కార్ల ధరల మార్పులు
జనవరి నుండి కొత్త కారు కొనాలనుకునే వారు ఎక్కువ ఖర్చుకు సిద్ధంగా ఉండాలి. మారుతి సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా వంటి ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారులు వాహనాల ధరలను 3% వరకు పెంచాలని యోచిస్తున్నారు. ఉత్పత్తి ఖర్చులు పెరగడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లే ఈ ధరల పెరుగుదలకు కారణమని చెబుతున్నారు. కొత్త సంవత్సరంలో ప్రముఖ మోడళ్ల ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు.
EPFO
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రావిడెంట్ ఫండ్ (PF) అకౌంట్ల నుండి డబ్బు ఉపసంహరించుకునే ప్రక్రియను సులభతరం చేసేందుకు కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ఉద్యోగులు తమ PF పొదుపును యాక్సెస్ చేయడానికి పర్మీషన్ కోసం వేచి ఉండాలి. అయితే రాబోయే ఈ ఫీచర్ ద్వారా ఉద్యోగులు సెల్ఫ్ కన్ఫర్మేషన్(స్వీయ ధృవీకరణ) ద్వారా డబ్బును ఉపసంహరించుకోవచ్చు. ఇది కంపెనీ యజమాని ఇంటర్ఫీయరెన్స్ అవసరం లేకుండా చేస్తుంది. అందువల్ల పీఎఫ్ డబ్బులు ఇకపై తొందరగా పొందడానికి వీలవుతుంది.