Jan Dhan Account: సెప్టెంబర్ 30లోపు ఇలా చేయకపోతే.. మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుంది
Jan Dhan Account: దేశంలో ప్రతీ ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం జన్‌ధన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా జన్ ధన్ ఖాతాలను ఓపెన్ చేయించారు. అయితే తాజాగా ఈ ఖాతాదారులకు ఆర్బీఐ కీలక సూచన చేసింది.

10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో
ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY)కు ఈ ఏడాది 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాలను అనుసరించి, ప్రతి బ్యాంకు ఖాతాదారు ప్రతి సంవత్సరం KYC – Know Your Customer పూర్తి చేయాలి. ముఖ్యంగా జన్ ధన్ ఖాతాదారులు సెప్టెంబర్ 30 లోపు KYC పూర్తి చేయకపోతే ఖాతా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ప్రభుత్వ సబ్సిడీలు, ఆర్థిక సహాయాలు ఖాతాలో జమ కాకపోవచ్చు.
ఈ పథకాన్ని ఎందుకు తీసుకొచ్చారు.?
2014లో ప్రారంభమైన ఈ పథకం లక్ష్యం – ఆర్థికంగా వెనుకబడినవారికి బ్యాంకింగ్ సదుపాయాలు అందించడం. పట్టణం నుంచి గ్రామం వరకు ఎవరికైనా సులభంగా ఖాతా తెరవడానికి అవకాశం కల్పించింది. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు. ప్రభుత్వ పథకాల నిధులు నేరుగా ఖాతాలో జమ అవుతాయి. అవసరమైతే ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కూడా లభిస్తుంది.
రీ-KYC ఎందుకు అవసరం?
2014–15లో తెరిచిన ఖాతాల KYC చెల్లుబాటు 10 సంవత్సరాలు. ఇప్పుడు ఆ గడువు ముగుస్తోంది. అందుకే రీ-KYC తప్పనిసరిగా చేయాలి. ఇందుకోసం ప్రస్తుత చిరునామా, పేరు, ఆధార్ లేదా ఐడీ ప్రూఫ్, లేటెస్ట్ ఫొటో వంటి వివరాలను బ్యాంకుకు సమర్పించాలి. ఇది మోసాలను అరికట్టడంలో, ఖాతాలను సజావుగా నడపడంలో సహాయపడుతుంది.
గ్రామ స్థాయిలో ప్రత్యేక శిబిరాలు
దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బ్యాంకులు జూలై 1 నుంచి సెప్టెంబర్ 20 వరకు పంచాయతీ స్థాయిలో KYC శిబిరాలు నిర్వహిస్తున్నాయి. ఇంటింటికీ వెళ్లి రీ-KYC ప్రక్రియ చేపడుతున్నారు. ఇప్పటి వరకు 1 లక్షకు పైగా గ్రామ పంచాయతీల్లో శిబిరాలు పూర్తయ్యాయి. లక్షలాది మంది ఖాతాదారులు ఇప్పటికే తమ KYCని పూర్తి చేశారు.
ఖాతాదారులు ఏం చేయాలి.?
సమీప బ్యాంకు బ్రాంచ్ లేదా పంచాయతీ శిబిరానికి వెళ్లి రీ-KYC పూర్తి చేయాలి. ఆధార్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డ్ వంటి చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్స్‌ను తీసుకెళ్లాలి. సెప్టెంబర్ 30వ తేదీని ఈ ప్రక్రియకు చివరి తేదీగా నిర్ణయించారు. మీరు సమయానికి KYC పూర్తి చేస్తేనే మీ జన్ ధన్ ఖాతా యాక్టివ్‌గా ఉంటుంది. లేనిపక్షంలో ఖాతా బ్లాక్ అవుతుంది, ప్రభుత్వం అందించే ప్రయోజనాలు ఆగిపోతాయి.