మీ వాహనం మైలేజ్ పడిపోయిందా.. ఈ 10 టిప్స్ మీకోసమే..
ఒక పక్క పెట్రోల్ ధరలు పెరిగిపోతుంటే.. వాహనాల మైలేజీ పడిపోతోంది. 'నా బండి పెట్రోల్ తాగేస్తోందబ్బా.. ఎంత పోయిస్తున్నా ఇట్టే అయిపోతోంది.' అంటూ వాహనాలున్న ప్రతి ఒక్కరూ ఫీలవుతుంటారు. అయితే మైలేజ్ మెయింటైన్ చేయడానికి వాహనంలోనే ప్రత్యేక సిస్టం ఉందని ఎంత మందికి తెలుసు. కార్లు, బైకులు తయారు చేసే కంపెనీలు వాహనం కొన్న వినియోగదారులకు ఒక బుక్‌లెట్ ఇస్తారు. అందులో వాహనం పూర్తి వివరాలు ఉంటాయి. అందులోనే మైలేజీ ఎలా మెయింటైన్ చేయాలన్న సమాచారం కూడా ఉంటుంది. ఆ టిప్స్ ఇవిగో..
1. టైర్లలో సరిపడా గాలి..
బండి టైర్లలో సరైన ఎయిర్ ప్రెజర్ ఉండటం చాలా అవసరం. టైర్లు తక్కువ గాలి ప్రెజర్‌తో ఉంటే ఇంధనాన్ని ఎక్కువగా వాడతాయి. దీంతో మైలేజ్ పడిపోతుంది.
2. బ్రేక్, చైన్ టైట్‌గా ఉండకూడదు..
బ్రేక్ టైట్‌గా ఉన్నా, చైన్ పట్టేసినట్టు తిరుగుతున్నా మైలేజ్ పడిపోతుంది. కొందరు బ్రేక్ లూజ్‌గా ఉందని వారే బోల్ట్ బిగించేస్తారు. ఇలా చేయడం ప్రమాదకరమని మెకానిక్‌లు సూచిస్తున్నారు.
3. అవసరమైతేనే ఏసీ వాడాలి..
సాధారణంగా కారులో ఏసీ వేసినప్పుడు ఇంధనం ఎక్కువగా ఖర్చవుతుంది. అందుకే అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఎయిర్ కండిషనర్ ఉపయోగించండి.
4. కార్బరేటర్, ప్లగ్ చెక్ చేయించుకోవాలి..
మంచి నాణ్యమైన ఇంధనం వాడటం వల్ల మైలేజ్ పెరుగుతుంది. అంతేకాకుండా కార్బరేటర్, ఇంజిన్ ప్లగ్ శుభ్రం చేయించుకోవాలి. అప్పుడు మరింత పెట్రోల్ ఆదా చేసుకోవచ్చు.
5. స్మూత్ డ్రైవింగ్ చేయాలి..
అవసరం లేకపోయినా సడన్ బ్రేకులు వేయడం, నిర్ధిష్ట వేగంతో కాకుండా ఒకసారి అతి వేగంతోనూ, వెంటనే స్పీడ్ తగ్గించేయడం కూడా మైలేజ్‌పై ప్రభావం చూపిస్తాయి. స్మూత్ డ్రైవింగ్ వల్ల ఇంధనం ఆదా అవుతుంది.
6. తక్కువ వేగం మంచిది..
హై స్పీడ్‌తో డ్రైవింగ్ చేయడం వల్ల పెట్రోల్, డీజిల్ అతిగా ఖర్చయిపోతుంది. తక్కువ వేగం అంటే సుమారు 50-60 కి.మీ./గం వేగంతో ప్రయాణించడం వల్ల మైలేజ్ పెరుగుతుంది. ఇదే విషయాన్ని కంపెనీలు వాహనాల స్పీడో మీటర్‌పై గ్రీన్, ఎల్లో, రెడ్ స్టిక్ర్ల ద్వారా తెలియజేస్తుంటారు. చాలా మంది వీటిని గమనించి ఉండరు.
7. ఇంజిన్ ఆఫ్ చేయాలి..
ట్రాఫిక్ సిగ్నల్స్, పెట్రోల్ కొట్టించేటప్పుడు ఇలా ఎక్కడైనా కాస్త సమయం ఆగాల్సి వస్తే ఇంజిన్ ఆఫ్ చేయడం ద్వారా ఇంధన వాడకాన్ని తగ్గించవచ్చు. అలాగే బండిలో అనవసరమైన వస్తువులు తీసివేయండి. బండిలో బరువు తగ్గిస్తే మైలేజ్ మెరుగుపడుతుంది.
8. క్లచ్, గేర్ సరిగా ఉపయోగించాలి..
క్లచ్‌ను కేవలం గేర్ మార్చేటప్పుడు, బ్రేక్ వేసేటప్పుడు ఇలా అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలి. క్లచ్ పట్టుకొని యాక్సలరేటర్ ఇవ్వడం వల్ల పెట్రోల్ వాడకం పెరిగిపోతుంది. సరైన గేర్లలో డ్రైవ్ చేయడం వల్ల కూడా ఇంధన ఆదా అవుతుంది.
9. ట్రిపుల్ రైడింగ్ వద్దు..
ఒక బండిపై మాక్సిమం ఇద్దరు మాత్రమే కూర్చోవాలి. కాని ప్రస్తుతం కొందరు బైక్‌పై ముగ్గురు, నలుగురు కూర్చొని వెళుతుంటారు. ఇది కూడా మైలేజ్ పడిపోవడానికి ఓ కారణం.
10. పెట్రోల్ ఆవిరి కానివ్వకూడదు..
గతంలో కార్లు, బైకులు పూర్తి ఇనుముతో తయారయ్యేవి. ప్రస్తుతం ఫైబర్‌తోనే తయారు చేసేస్తున్నారు. దీంతో ఎండలో ఉన్నప్పుడు ట్యాంకులోని ఇంధనం ఆవిరయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ట్యాంకుకు రక్షణగా ఏదైనా క్లాత్, కవర్‌లాంటివి కప్పడం మంచిది. బైకును కనీసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి సర్వీసింగ్ చేయించాలి. ఆయిల్, ఫిల్టర్లు, స్పార్క్ ప్లగ్‌లు, ఇతర భాగాలను శుభ్రం చేయించడం తప్పనిసరి.