IRCTC Tours: అయోధ్య to భద్రాచలం వయా రామేశ్వరం టూర్ కేవలం రూ.62 వేలకే..
IRCTC తన మొదటి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును జూన్ 21న నడపనుంది. ఈ రైలు నేపాల్‌లోని జనక్‌పూర్‌లోని రామ్ జానకి దేవాలయంతో సహా శ్రీరాముని జీవితానికి సంబంధించిన ప్రముఖ ప్రదేశాలను కవర్ చేస్తూ స్వదేశ్ దర్శన్ పథకం కింద గుర్తించిన రామాయణ సర్క్యూట్‌లో నడుస్తుంది.

Bharat Gaurav Trains
'భారత్ గౌరవ్ రైలు' త్వరలో ప్రారంభం కానుంది. దేశంలోని ధార్మిక ప్రదేశాలను సందర్శించేలా వరుస రైళ్లను రూపంలో భారత్ గౌరవ్ రైలును ప్రధాని ప్రకటించారు. రైల్వే మంత్రిత్వ శాఖ ఈ బాధ్యతను IRCTCకి అప్పగించింది. IRCTC తన అతిపెద్ద క్యాటరింగ్ భాగస్వామి RK అసోసియేట్స్ & హోటలియర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ప్రైవేట్ భాగస్వామిగా ఎంపిక చేసుకొని ఈ రామయణ సర్క్యూట్ యాత్రను ప్రారంభించింది.
IRCTC Ramayana Express
భారత్ గౌరవ్ రైళ్లలో మొదటి రైలు భారత దర్శన్ కింద రామాయణ సర్క్యూట్‌లోని శ్రీరాముని జీవితానికి సంబంధించిన ప్రదేశాలను పర్యాటకులకు ప్యాకేజీ టూరును ప్రారంభించింది. నేపాల్‌లోని జనక్‌పూర్‌లోని రామ్ జానకి ఆలయ సందర్శన కూడా ఈ ప్యాకేజీలో చేర్చడం విశేషం.
జూన్ 21న, 'భారత్ గౌరవ్' సిరీస్‌లోని మొదటి రైలు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుండి 18 రోజుల పర్యటన కోసం బయలుదేరుతుంది. భారత్ గౌరవ్ రైలులో ప్రయాణీకుల కోసం 10 AC త్రీ టైర్ కోచ్‌లను కేటాయించారు. ఇందులో మొత్తం 600 మంది ప్రయాణికులు ప్రయాణించగలరు. ఈ రైలు పర్యాటకులు శ్రీరామునికి సంబంధించిన అన్ని ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించేలా చేస్తుంది.
బెర్త్ వద్దకే ఆహారం...
ఈ టూరిస్ట్ రైలులో ప్యాంట్రీ కోచ్ సౌకర్యం ఉంటుంది, తద్వారా పర్యాటకులకు వారి బెర్త్ వద్ద శాఖాహారం అందిస్తారు. దీంతో పాటు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు తదితర ఏర్పాట్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. భారత్ గౌరవ్ రైలు కోసం RK అసోసియేట్స్ & హోటలియర్స్ IRCTCతో సేవా భాగస్వామిగా ఉంటాయి. తాజాగా వండిన ఆహార, పానీయాల కోసం అన్ని సౌకర్యాలు కూడా ఈ ప్రైవేట్ భాగస్వామి ద్వారా ఏర్పాటు చేయనున్నారు.
టూరు ప్యాకేజీలో మొదటి దశ:
ఢిల్లీ నుంచి ప్రారంభమైన రైలు మొదటి స్టాప్ శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య, ఇక్కడ శ్రీరామ జన్మభూమి ఆలయం, శ్రీ హనుమాన్ ఆలయం, నందిగ్రామ్‌లోని భారత్ మందిర్ సందర్శిస్తారు. అయోధ్య నుండి బయలుదేరిన తర్వాత, ఈ రైలు బక్సర్‌కు వెళుతుంది, అక్కడ విశ్వామిత్ర, రామరేఖ ఘాట్ ఆశ్రమం వద్ద గంగానదిలో స్నానం చేసే కార్యక్రమం ఉంటుంది. ఇక్కడి నుంచి సీతా మాత జన్మస్థలం ఉన్న సీతామర్హికి రైలు వెళ్తుంది. అక్కడి నుంచి రైలులో నేపాల్‌లోని జనక్‌పూర్‌లోని రామ్ జానకీ ఆలయాన్ని కూడా సందర్శించుకోవచ్చు.
ప్రయాణం రెండవ దశ: నేపాల్ నుండి తిరుగు ప్రయాణం
నేపాల్ నుండి తిరిగి వస్తున్నప్పుడు, రైలు తదుపరి స్టాప్ కాశీ, ఇక్కడ నుండి పర్యాటకులు బస్సులలో ప్రయాగ, శృంగవర్పూర్, చిత్రకూట్ లాంటి ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించవచ్చు. ఈ సమయంలో ప్రయాగ, చిత్రకూట్‌లో రాత్రి విశ్రాంతి ఉంటుంది.
యాత్ర మూడవ దశ: నాసిక్, హంపి దర్శనం
చిత్రకూట్ నుండి బయలుదేరిన తర్వాత, ఈ రైలు నేరుగా మహారాష్ట్రలోని నాసిక్ చేరుకుంటుంది. అక్కడ పంచవటి త్రయంబకేశ్వరాలయాన్ని సందర్శించవచ్చు. నాసిక్ తర్వాత, పురాతన కిష్కింద నగరం హంపి ఈ రైలు తదుపరి స్టాప్, ఇక్కడ హనుమంతుడి జన్మస్థలం అంజనీ పర్వతంలో ఉన్న ఇతర ముఖ్యమైన మతపరమైన మరియు వారసత్వ దేవాలయాలు సందర్శిస్తారు.
రామేశ్వరం, కాంచీపురం
హంపి తరువాత, ఈ రైలు తదుపరి స్టాప్ తమిళనాడులోని రామేశ్వరం చేరుకుంటుంది. రామేశ్వరంలోని పర్యాటకులు పురాతన శివాలయం, ధనుష్కోటిని సందర్శించుకోవచ్చు. రామేశ్వరం నుండి బయలుదేరిన తరువాత, ఈ రైలు కాంచీపురం చేరుకుంటుంది, ఇక్కడ శివ కంచి, విష్ణు కంచి మరియు కామాక్షి మాత ఆలయాన్ని సందర్శిస్తారు.
భద్రాచలం సందర్శనతో యాత్ర పూర్తి..
ఈ రైలు చివరి స్టాప్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భద్రాచలం, దీనిని దక్షిణ అయోధ్య అని కూడా పిలుస్తారు. ఈ రైలు 18వ రోజున ఢిల్లీకి చేరుకుంటుంది. రైలు ద్వారా దాదాపు 8000 కిలోమీటర్ల ప్రయాణం పూర్తవుతుంది.
టిక్కెట్ ధర
IRCTC ఈ 18 రోజుల ప్రయాణానికి ఒక వ్యక్తికి రూ. 62370/- రుసుమును నిర్ణయించింది. ఈ మొత్తం చెల్లించడం కష్టం అనుకుంటే, 3, 6, 9, 12, 18, 24 నెలల వాయిదాలలో చెల్లించుకునే వీలుంది. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణికులకు రుచికరమైన శాఖాహారం, బస్సుల్లో పర్యాటక ప్రదేశాల పర్యటన, ఏసీ హోటళ్లలో వసతి, గైడ్, బీమా తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు. భారత ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ఆధారంగా అర్హత ప్రకారం ప్రభుత్వ/PSU ఉద్యోగులు కూడా ఈ ప్రయాణంలో LTC సౌకర్యాన్ని పొందవచ్చు.