ట్రైన్స్‌లో ఈ రూల్స్ తెలియక ఇన్నాళ్లూ ఎన్ని ఇబ్బందులు పడ్డాం
మనం చాలా సార్లు రైళ్లలో ప్రయాణిస్తుంటాం. కాని ఇండియన్ రైల్వేస్ పెట్టిన రూల్స్ గురించి మాత్రం చాలా మందికి తెలియవు. మహిళలు, పిల్లలకు ఎంత భద్రత కల్పిస్తున్నాయో తెలుసా? లగేజీ పరిమితులు, రైలులో ఉన్నప్పుడు ఫోన్ ఎలా వాడాలి? ఇలాంటి వాటిపైనా ప్రత్యేక రూల్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
మహిళలు, పిల్లల భద్రతకు ప్రాధాన్యం
ఒక మహిళ తన బిడ్డతో ఒంటరిగా ప్రయాణిస్తుంటే అది అబ్బాయి అయినా, అమ్మాయి అయినా రాత్రిపూట రైలులో ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ దించకూడదు. స్టేషన్ లో సెక్యూరిటీ గార్డ్ కు గాని, రైల్వే సిబ్బందికి గాని ఆమె రక్షణ బాధ్యత అప్పగించాలి. మహిళలు, పిల్లల భద్రత కోసం భారతీయ రైల్వే ఏర్పాటు చేసిన కఠినమైన నియమం ఇది.
రైలు మిస్ అయితే..
మీరు ఎక్కాల్సిన స్టేషన్లో మీరు రైలు ఎక్కలేకపోయారా.. ఏం ఫర్వాలేదు. అదే రైలును తర్వాత వచ్చే రెండు స్టేషన్లలో దేని నుండైనా మీరు ఎక్కవచ్చు. రైలు మిస్ అయినప్పుడు కంగారు పడకుండా వెంటనే స్టేషన్ బయటకు వచ్చి వేరే వెహికల్, కార్ గాని, బైక్ తీసుకొని, లేదా మిమ్మల్ని డ్రాప్ చేయడానికి వచ్చిన వారి సాయంతో తర్వాత స్టేషన్ కు చేరుకొని ట్రైన్ క్యాచ్ చేయవచ్చు.
లగేజీ పరిమితి
భారతీయ రైల్వేలు లగేజీ లేదా వస్తువులను ఎంత తీసుకెళ్లాలో ప్రత్యేక రూల్ ఉంది. అదేంటంటే.. ఒక వ్యక్తి రైలులో 70 కిలోల కంటే ఎక్కువ బరువున్న లగేజీని తీసుకెళ్లకూడదు. కాని ప్రస్తుతం ఒక్కొక్కరూ నాలుగేసి మూటలు, బ్యాగులు తీసుకెళుతుంటారు. వాస్తవానికి ఇది భారతీయ రైల్వే నిబంధనలకు విరుద్ధం. రైల్వే సిబ్బంది మీకు ఫైన్ వేయడానికి ఛాన్స్ ఉంటుంది. అందువల్ల రైళ్లో ప్రయాణిాంచేటప్పుడు మీరు అనసవర లగేజీని తీసుకెళ్లకపోవడమే మీకు మేలు.
మిడిల్ బెర్త్ నియమం
మీకు భారతీయ రైల్వేల మిడిల్ బెర్త్ నియమం గురించి తెలుసా? తెలియకపోతే, మిడిల్ బెర్త్ విషయంలో భారతీయ రైల్వేలో ఉన్న ఈ నియమం గురించి తెలుసుకోండి. మిడిల్ బెర్త్ సాధారణంగా వెనక్కు జారి ఉంటుంది. దాన్ని ఆనుకొని ప్రయాణికులు కూర్చుంటారు కదా.. మరి ఆ బెర్త్ బుక్ చేసుకున్న వ్యక్తికి నిద్ర వస్తే ఏంటి పరిస్థితి. దీని కోసమే ఓ రూల్ ఉంది. అదేంటంటే.. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మిడిల్ బెర్త్ పై నిద్రించవచ్చని రూల్. అంటే మీరు ఉదయం 6 గంటల తర్వాత మిడిల్ బెర్త్‌లో పడుకోవడానికి వీలు కాదు. ఎవరైనా ప్రశ్నిస్తే మీరు లేచి కూర్చోవాల్సిందే.
లౌడ్ స్పీకర్ వాడకం
మన జనాభాలో ఎక్కువ మంది ప్రయాణాల కోసం రైళ్లపై ఆధారపడి ఉంటారని మనందరికీ తెలుసు. ప్రతి ఒక్కరి భద్రత కోసం భారతీయ రైల్వేలలో మరో ముఖ్యమైన నియమం ఉంది. మీరు మీ ఫోన్ లౌడ్ స్పీకర్‌ని ఉపయోగించి పాటలు వినకూడదు. మాట్లాడకూడదు. రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్ ఆడియో లేదా వీడియో ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నందున ఈ నియమాన్ని రూపొందించారు. మీరు ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా ఇలా ఇబ్బంది పెడితే మీరు ఈ రూల్ చెప్పి వారిని వారించొచ్చు.
MRP కంటే ఎక్కువ ధర వసూలు చేయకూడదు
మీరు రెగ్యులర్ గా రైలులో ప్రయాణించే వారైతే ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం స్టేషన్ లో ఆహార పదార్థాలు, వస్తువులు అమ్మే వ్యాపారి MRP కంటే ఎక్కువ ధర వసూలు చేయకూడదు. అలా చేస్తే నేరంగా పరిగణించి వారికి రైల్వే అధికారులు ఫైన్ కూడా వేస్తారు. అందువల్ల ఇలాంటి సందర్భం ఎదురైతే మీరు వెంటనే రైల్వే సిబ్బందికి కంప్లయింట్ చేయవచ్చు.