- Home
- Business
- Indian Railway: రైలు ఆస్తిని దొంగలిస్తూ పట్టుబడితే ఏం చేస్తారో తెలుసా.? కక్కుర్తి పడితే కటకటాలే
Indian Railway: రైలు ఆస్తిని దొంగలిస్తూ పట్టుబడితే ఏం చేస్తారో తెలుసా.? కక్కుర్తి పడితే కటకటాలే
Indian Railway: భారతీయ రైల్వే ఏసీ కోచ్‌లలో ప్రయాణికులకు అందించే బెడ్‌రోల్ కిట్లు భారీగా చోరీకి గురవుతున్నాయి. గత నాలుగేళ్లలో కోట్ల సంఖ్యలో బెడ్‌రోల్ వస్తువులు మాయమవడంతో రైల్వే వ్యవస్థకు రూ.104 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.

నాలుగేళ్లలో 1.27 కోట్ల బెడ్‌రోల్ వస్తువులు మాయం
2022 జనవరి నుంచి 2026 మే వరకు దేశవ్యాప్తంగా ఏసీ కోచ్‌ల నుంచి కనీసం 1.27 కోట్ల బెడ్‌రోల్ వస్తువులు చోరీకి గురయ్యాయి. కోవిడ్ సమయంలో నిలిచిపోయిన బెడ్‌రోల్ సేవలు 2022 జనవరిలో తిరిగి పూర్తిస్థాయిలో ప్రారంభమైన తర్వాత ఈ చోరీలు గణనీయంగా పెరిగినట్లు ఆర్‌టీఐ సమాచారం చెబుతోంది. దేశంలోని 18 రైల్వే జోన్లలో 16 జోన్లకు చెందిన 54 రైల్వే డివిజన్ల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ రిపోర్టు రూపొందించారు.
2022తో పోలిస్తే 2025లో చోరీలు 56 శాతం పెరుగుదల
ఆర్‌టీఐ ద్వారా లభించిన సమాచారం ప్రకారం, 2022తో పోలిస్తే 2025 నాటికి బెడ్‌రోల్ వస్తువుల చోరీలు 56 శాతం పెరిగాయి. ప్రతి వెయ్యి మంది ఏసీ ప్రయాణికుల్లో సగటున ఒక బెడ్‌రోల్ వస్తువు చోరీకి గురవుతున్నట్లు అంచనా. సంఖ్య తక్కువగా కనిపించినా, దేశవ్యాప్తంగా ప్రతిరోజూ లక్షల మంది ఏసీ కోచ్‌లలో ప్రయాణించడం వల్ల మొత్తం నష్టం భారీగా మారిందని అధికారులు చెబుతున్నారు.
ఏ వస్తువులు ఎక్కువగా చోరీ అయ్యాయి?
ఏసీ కోచ్‌లో ప్రయాణించే వారికి సాధారణంగా ఒక బెడ్‌రోల్ కిట్ ఇస్తారు. అందులో రెండు బెడ్‌షీట్లు, ఒక దుప్పటి, ఒక దిండు, ఒక దిండు కవర్, ఒక ఫేస్ టవల్ ఉంటాయి. చోరీకి గురైన వస్తువుల్లో 46.54 లక్షల ఫేస్ టవల్స్, 41.13 లక్షల బెడ్‌షీట్లు, 23.59 లక్షల దిండు కవర్లు, 12.95 లక్షల దుప్పట్లు (బ్లాంకెట్లు), 2.76 లక్షల దిండ్లు దొంగతనానికి గురయ్యాయి. దిండ్లు పరిమాణంలో పెద్దవిగా ఉండటంతో వాటి చోరీలు తక్కువగా నమోదైనట్లు తెలుస్తోంది.
ఎక్కడ ఎక్కువ చోరీలు జరిగాయి?
రైల్వే డివిజన్ల వారీగా చూస్తే బికనీర్లో 25.76 లక్షల వస్తువులు, రాంచీలో 9.31 లక్షలు, ఢిల్లీలో 8.21 లక్షలు, ముంబైలో 8.17 లక్షలు, జోధ్‌పూర్‌లో 8.09 లక్షలు, అహ్మదాబాద్‌లో 6.94 లక్షల చోరీలు జరిగాయి. ఈ గణాంకాలు కొన్ని డివిజన్లలో సమస్య మరింత తీవ్రంగా ఉందని సూచిస్తున్నాయి.
రూ.104 కోట్లకు పైగా నష్టం.. చర్యలకు రైల్వే సిద్ధం
ఆర్‌టీఐ సమాచారం ప్రకారం, బెడ్‌రోల్ వస్తువులు మాయమవడంతో నాలుగేళ్లలో సుమారు రూ.104.51 కోట్ల నష్టం కాంట్రాక్టర్లకు వాటిల్లింది. ఏసీ కోచ్‌లలో బెడ్‌రోల్ కిట్లను అందించడం, వాటి నిల్వలను నిర్వహించడం కాంట్రాక్టు సంస్థల బాధ్యతగా రైల్వే అధికారులు తెలిపారు. చోరీల కారణంగా తగ్గిపోయిన బెడ్‌రోల్ వస్తువుల స్థానంలో కొత్తవి కొనుగోలు చేయాల్సి వస్తోందని, ఆ అదనపు ఖర్చు కూడా కాంట్రాక్టర్లపైనే పడుతోందని రైల్వే ప్రతినిధి వెల్లడించారు. ఈ సమస్యను రైల్వే అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు, చోరీలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రయాణికులు కూడా ప్రజా ఆస్తిని కాపాడాలని, రైల్వే సౌకర్యాలను బాధ్యతతో వినియోగించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
దొంగలిస్తూ పట్టుబడితే ఏం చేస్తారు.?
రైల్వేకు చెందిన దుప్పట్లు, బెడ్‌షీట్లు, దిండ్లు, టవల్స్ వంటి బెడ్‌రోల్ వస్తువులు రైల్వే ఆస్తి. వీటిని దొంగిలించడం లేదా చట్టవిరుద్ధంగా తమ వద్ద ఉంచుకోవడం రైల్వే ప్రాపర్టీ (Unlawful Possession) Act, 1966 కింద శిక్షార్హమైన నేరం. ఈ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం మొదటి నేరానికి గరిష్ఠంగా 5 సంవత్సరాల జైలు శిక్ష, లేదా జరిమానా, కొన్ని సందర్భాల్లో రెండూ విధించవచ్చు. తొలిసారి పట్టుబడితే.. మీకు 1 సంవత్సరం జైలు శిక్ష, 1000 రూపాయల జరిమానా విధించవచ్చు, కానీ మీరు ఈ రకమైన చర్యలను పదే పదే చేస్తే, మీకు 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు భారీగా జరిమానా విధిస్తారు.

