- Home
- Business
- Income Tax rules: మే 26 నుంచి కొత్త ఇన్‌కం టాక్స్ రూల్స్ అమలు, ఆ పని చేయాలంటే PAN తప్పనిసరి...ఏంటో తెలుసా..
Income Tax rules: మే 26 నుంచి కొత్త ఇన్‌కం టాక్స్ రూల్స్ అమలు, ఆ పని చేయాలంటే PAN తప్పనిసరి...ఏంటో తెలుసా..
మే 26 నుండి ఎవరైనా ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాల నుండి రూ. 20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేసినా లేదా విత్‌డ్రా చేసే సమయంలో శాశ్వత ఖాతా సంఖ్య (PAN Number) కోట్ చేయడం తప్పనిసరి చేసింది.

పన్ను ఎగవేతలను అరికట్టేందుకు, కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. దేశవ్యాప్తంగా నగదు లావాదేవీల సందర్భంగా, పన్ను ఎగవేతను నిరోధించేందుకు, ఆదాయ పన్ను శాఖ సరికొత్త నిబంధనలను రూపొందించింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇకపై నగదు లావాదేవీలపై PAN వివరాలను అందించడం తప్పనిసరి:
CBDT నోటిఫికేషన్ ప్రకారం, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో తన బ్యాంక్ ఖాతా నుండి రూ. 20 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేసినా లేదా విత్‌డ్రా చేసినా, PAN సమాచారం ఇవ్వడం తప్పనిసరి చేసింది. బ్యాంకు కౌంటర్ నుంచి భారీ మొత్తంలో లావాదేవీలు జరిపే వారికి ఆదాయపు పన్ను చట్టం నిబంధనలను సవరిస్తూ పాన్ కార్డును వివరాలలను జతచేయడం, CBDT తప్పనిసరి చేసింది. నగదు లావాదేవీలను తగ్గించడంతో పాటు, పన్ను ఎగవేతను నిరోధించడం దీని ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది.
మే 26 నుంచి కొత్త నిబంధనలు ఇవే...
మే 26 నుంచి కొత్త నిబంధన అమల్లోకి వస్తుందని సీబీడీటీ తన గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. బ్యాంకులు, సహకార బ్యాంకులు, పోస్టాఫీసుల్లో నడుస్తున్న ఖాతాలకు ఈ నిబంధన సమానంగా వర్తిస్తుంది. అదే సమయంలో, కరెంట్ ఖాతాను తెరిచే సమయంలో కూడా ఈ నియమం చెల్లుబాటు అవుతుంది. ఇది మాత్రమే కాదు, ఇప్పటికే పాన్‌తో లింక్ చేసిన ఖాతాలు ఉన్న వ్యక్తులు కూడా ఈ నియమాన్ని పాటించాలి. నగదు వినియోగం తగ్గించడం, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం వంటి ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే ఈ నిబంధనలు సూచించారు.
ఈ లావాదేవీలకు PAN తప్పనిసరి..
ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక ఖాతా లేదా ఇతర బ్యాంకు ఖాతాల నుండి రూ. 20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్లు, విత్ డ్రాయల్స్ కనుక చేస్తే PAN తప్పనిసరి అని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. 2020 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ. 20 లక్షల నగదు ఉపసంహరణపై టీడీఎస్‌ను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు రూపొందించిన కొత్త నిబంధన ప్రకారం, ఖాతాదారుడితో పాటు, బ్యాంకులు, సహకార బ్యాంకులు, పోస్టాఫీసులు లావాదేవీ ప్రారంభంలోనే పాన్, ఆధార్ వివరాలను ఇవ్వాలి. బ్యాంకు ఖాతాల నుంచి రూ. 20 లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీలు జరిపే వారికి పాన్ కార్డును వినియోగించేలా కొత్త నిబంధన అదనపు ఫిల్టర్‌గా పని చేస్తుంది. అతి త్వరలో కేంద్ర ప్రభుత్వం పాన్, ఆధార్ లకు సంబంధించిన స్టాండర్డ్ మెథడ్స్ (ఎస్‌ఓపి)లను కూడా తీసుకురానుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
బ్యాంకులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నాయి
ఈ నిబంధనకు సంబంధించి ప్రభుత్వ స్పష్టత కోసం బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఎదురుచూస్తున్నప్పటికీ.. ఏప్రిల్ నుంచి ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనందున.. మే 26లోపు జరిగిన లావాదేవీలను ఎలా లెక్కిస్తారనేది ప్రశ్నగా మారింది.