హోమ్ లోన్ ముందే చెల్లిస్తే అన్ని రూ.లక్షలు ఆదా చేయొచ్చా?
చాలామంది ఇల్లు కట్టుకోవడానికి లేదా ఇల్లు కొనడానికి హోమ్ లోన్‌లను తీసుకుంటారు. అయితే EMI కడుతూనే ఎప్పుడైనా ఒకేసారి అమౌంట్ లభిస్తే మీ లోన్‌ను ముందస్తుగా చెల్లించొచ్చు. ముందస్తుగా లోన్ చెల్లించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి.

ముందస్తుగా హోమ్ లోన్ చెల్లించడం వల్ల వడ్డీ ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా రుణ కాలవ్యవధి తగ్గుతుంది. దీనివల్ల ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. అయితే ముందస్తు చెల్లింపు చేసే ముందు ఫైన్ ఎంత పడుతుంది. టాక్స్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు ముందస్తుగా లోన్ చెల్లించాలనుకుంటే సరైన ప్రణాళిక అవసరం. సరిగ్గా ప్లాన్ చేసి లోన్ కట్టేస్తే వడ్డీ కలిసొస్తుంది.
లోన్ ముందస్తు చెల్లింపు అంటే..
లోన్ ముందస్తు చెల్లింపు అంటే మీ లోన్‌ను దాని గడువుకు ముందే కొంత మొత్తం లేదా పూర్తిగా చెల్లించే అవకాశం దొరకడం. చెల్లించాల్సిన బ్యాలెన్స్‌ను తగ్గించడం ద్వారా, రుణగ్రహీతలు కాలక్రమేణా చెల్లించాల్సిన మొత్తం వడ్డీని ఆదా చేసుకోవచ్చు. ఇంటి యజమానులు తమ మొత్తం ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. తమ ఆస్తిపై ముందుగానే సొంతం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
ఎప్పుడు లోన్‌ను ముందస్తుగా చెల్లించవచ్చు?
చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒకటి నుండి మూడు సంవత్సరాల వరకు లాక్-ఇన్ వ్యవధిని కలిగి ఉంటాయి. ఈ సమయంలో ముందస్తు చెల్లింపులను అంగీకరించరు. ఆ తర్వాత రుణగ్రహీతలు ముందస్తు చెల్లింపు ఎంపికను ఉపయోగించుకోవచ్చు.
వివిధ ముందస్తు చెల్లింపు ఎంపికలు ఏమిటి?
రుణగ్రహీతలు తమ ఆర్థిక పరిస్థితిని బట్టి ముందస్తు చెల్లింపును చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మొత్తం ముందస్తు చెల్లింపు: లోన్ ప్రిన్సిపల్‌ను తగ్గించడానికి ఒకేసారి మొత్తాన్ని చెల్లించడం.
స్టెప్-అప్ ముందస్తు చెల్లింపు: వార్షిక లేదా అర్థ-వార్షిక వంటి చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా చెల్లించడం.
అదనపు EMIలు: లోన్ బ్యాలెన్స్‌ను వేగంగా తగ్గించడానికి ప్రతి సంవత్సరం ఒకటి లేదా రెండు అదనపు EMIలను చెల్లించడం.
EMI మొత్తాన్ని పెంచడం: ప్రతి సంవత్సరం అధిక EMI మొత్తాన్ని ఎంచుకోవడం వల్ల కాలవ్యవధి, వడ్డీ రెండూ తగ్గుతాయి.
ఏవైనా జరిమానాలు ఉన్నాయా?
రుణదాతలు తరచుగా ముందస్తు చెల్లింపులపై జరిమానాలు విధిస్తారు. ఎందుకంటే బ్యాంకులు వాటి వడ్డీ ఆదాయాన్ని కోల్పోతాయి. బ్యాంకులు, లోన్ రకాలను బట్టి జరిమానా శాతం మారుతుంది. అయితే చాలా సంస్థలు ఫ్లోటింగ్ వడ్డీ రేటు లోన్‌లపై చేసే ముందస్తు చెల్లింపులపై జరిమానాలను మాఫీ చేస్తాయి.
ఉదాహరణకు మీరు 30 సంవత్సరాలకు రూ.85 లక్షల హోమ్ లోన్ తీసుకున్నారనుకుంటే 30 సంవత్సరాల కాలవ్యవధి, 9.5% వడ్డీ రేటుతో EMI రూ.71,473 అవుతుంది. 30 సంవత్సరాలకు మొత్తం లోన్, వడ్డీ కలిపి రూ.1,72,30,139 అవుతుంది.
లోన్‌ను ఎలా ప్రభావితం చేస్తుంది?
రుణగ్రహీత 3 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి తర్వాత మూడు విడతలలో ప్రిన్సిపల్ మొత్తంలో 10 % (రూ.8.5 లక్షలు) ముందస్తుగా చెల్లిస్తే అది EMI, కాలవ్యవధి రెండింటినీ ప్రభావితం చేస్తుంది.
ముందస్తు చెల్లింపు వల్ల EMI రూ.64,109 మాత్రమే అవుతుంది. వడ్డీపై రూ.14,42,049 ఆదా అవుతుంది.
అదే EMIని ఎంచుకోవడం వల్ల రూ.58,75,158 అధిక వడ్డీ ఆదా అవుతుంది. లోన్ టెన్యూర్ కూడా దాదాపు 8 సంవత్సరాలు తగ్గుతుంది.
ముందస్తు చెల్లింపులో ఏవైనా నష్టాలు ఉన్నాయా?
ముందస్తుగా లోన్ చెల్లించడం వల్ల ఒక నష్టం ఉంది. ఇది ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌లు 80C, 24(b) కింద ప్రిన్సిపల్, వడ్డీ తిరిగి చెల్లింపులపై పన్ను ప్రయోజనాలను తొలగిస్తుంది. మీ లోన్ నిబంధనలు, ముందస్తు చెల్లింపు జరిమానాలు, ఆర్థిక లక్ష్యాలను జాగ్రత్తగా విశ్లేషించుకొని లోన్ ప్రీ పేమెంట్ చేయడం మంచిది.