ప్రాణాలు కాపాడే హెల్మెట్ లగ్జరీ వస్తువా.?
ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ శ్లాబుల్లో మార్పులు చేసిన విషయం తెలిసిందే. దీంతో కొన్ని వస్తువుల ధరలు తగ్గితే, మరికొన్ని పెరిగాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై హెల్మెట్ కంపెనీ సీఈఓ రాసిన లేఖ నెట్టింట వైరల్ అవుతోంది.

ట్వార్రా హెల్మెట్స్ సీఈఓ అల్పనా పరిదా లెటర్
ట్వార్రా హెల్మెట్స్ వ్యవస్థాపకురాలు, సీఈఓ అల్పనా పరిదా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌కు ఓ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో హెల్మెట్లపై 18% జీఎస్టీ విధించడం సరికాదని, ప్రజల ప్రాణాలను రక్షించే సాధనాన్ని విలాస వస్తువులా చూడకూడదని విజ్ఞప్తి చేశారు.
ప్రతి 11 నిమిషాలకు ఒక ప్రాణం
భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు ప్రతిరోజూ వందలాది కుటుంబాల్లో దుఖాన్ని నింపుతున్నాయి. 2022 సంవత్సరంలోనే 46,000 మంది టూ వీలర్స్ హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు లక్షలాది మంది గాయాలపాలవుతున్నారు. ఒక ప్రాణం వెనుక ఒక కుటుంబం బాధ, ఒక భవిష్యత్తు నాశనం అవుతుందని అల్పనా పరిదా ప్రస్తావించారు.
హెల్మెట్ లగ్జరీ కాదు..
హెల్మెట్ ధరించడం చట్టం మాత్రమే కాదు, ప్రాణాలను కాపాడే కవచం. శాస్త్రీయంగా కూడా ఇది నిరూపితమైంది. హెల్మెట్ ధరించడం వల్ల మరణ ప్రమాదం 70% వరకు తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాంటిది ప్రజలకు తప్పనిసరి అయిన ఈ వస్తువుపై 18% పన్ను వేయడం అన్యాయం. ఇది విలాస వస్తువులు, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులకు విధించే పన్ను రేటుతో సమానం.
జీఎస్టీ తగ్గిస్తే కలిగే లాభాలు
అల్పనా పరిదా తన లేఖలో హెల్మెట్లపై జీఎస్టీని 0% లేదా 5%కి తగ్గించాలని కోరారు. దీని వల్ల..
* ప్రతి నగరం, పట్టణం, గ్రామంలో హెల్మెట్లు అందుబాటులోకి వస్తాయి.
* వేలాది ప్రాణాలను ప్రతి సంవత్సరం కాపాడుకోవచ్చు.
* ప్రజల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందనే బలమైన సందేశం వెళ్తుందని లేఖలో పేర్కొన్నారు.
ఆదాయం కంటే ప్రాణం ముఖ్యం
“సురక్షిత జీవితం పన్ను కిందికి రాకూడదు” అని అల్పనా పరిదా తన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇది కేవలం పరిశ్రమ కోరిక కాదు, రోడ్డు ప్రమాదాల్లో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన ప్రతి భారతీయుడి వేదన. ఒక చిన్న నిర్ణయం, వేలాది ప్రాణాలను కాపాడగలదు. హెల్మెట్ ప్రతి ఒక్కరికీ సులభంగా దొరకాలి, అందుబాటులో ఉండాలి – అదే అసలు అభ్యర్థన అని ఆమె చెప్పుకొచ్చారు. అల్పనా పరిదా లింక్డ్ ఇన్ పోస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.