DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ కానుక, వారి డీఏ 58 శాతానికి పెంపు
కేంద్రప్రభుత్వ ఉద్యోగులు ఎప్పట్నించో ఎదురుచూస్తున్న డీఏ పెంపుపై క్లారిటీ వచ్చేసింది. AICPI సూచీ డేటా ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 55 శాతం నుంచి 58 శాతానికి పెరుగబోతోంది. అంటే తాజాగా వారికి మూడు శాతం డీఏను పెంచారు.

ఉద్యోగులకు పండుగ కానుక
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పండుగ కానుక వచ్చేసిందే. వారికి డీఏ పెంపుపై ఉన్న సందేహాలపై క్లారిటీ వచ్చేసింది. ఏకంగా వారికి 3 శాతం పెంపు ఇస్తున్నట్టు తెలుస్తోంది. తాజా AICPI సూచీ డేటా ప్రకారం, కేంద్ర ఉద్యోగుల డీఏ 55 శాతం నుంచి 58 శాతానికి పెరుగుతోంది. ఈ పెంపు జూలై 1, 2025 నుండి అమలులోకి వస్తుంది. అంటే ఉద్యోగులకు ఎరియర్స్ రూపంలో కూడా డబ్బులు వస్తాయి.
కోటి మందికి లాభం
భారతదేశంలో కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు. ప్రతి దీపావళి లేదా దసరా పండుగ సీజన్‌లో డీఏ పెంపును ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఈ ప్రకటన కోసం ఉద్యోగులు, పింఛను దారులు ఎదురుచూస్తూ ఉంటారు. మూడు శాతం పెంపును ఇప్పుడు ప్రకటించడం వల్ల జీతంలో పెరుగుదల అధికంగానే ఉంటుంది. కాబట్టి ఉద్యోగులకు ఎంతో మేలు జరగనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే జీతాలు ఎక్కువ. ప్రతి ఏడాది డీఏ పెంపు వల్ల మరింతగా జీతాలు పెరుగుతూనే ఉంటాయి.
ఏడో వేతన సంఘం
ప్రభుత్వ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం మూడు శాతం పెంపుకు ఇప్పటికే కేబినెట్ ఒప్పుకుంది. ఈ పెంపుకు సంబంధించిన అధికారిక ప్రకటన అక్టోబర్‌లో జరిగే కేబినెట్ సమావేశంలో వచ్చే అవకాశం ఉంది. ఈ పెంపు ఈ ఏడాది జూలై 1 నుండి అమలులోకి వస్తుంది. కాబట్టి ఉద్యోగులకు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల ఎరియర్స్ కూడా రాబోతున్నాయి.
ఎంత పెరుగుతుంది?
మూడు శాతం డీఏ పెరిగిందనగానే ఎంత జీతం పెరుగుతుందని ఎంతో మంది లెక్కలే వేస్తారు. 18000 రూపాయల జీతం వచ్చే వ్యక్తికి నెలకు రూ.540 రూపాయలు పెరుగుతుంది. అదే ఏడాదికైతే 6,480 రూపాయలు వరకు పెరుగుతుంది. ఇక లక్షల్లో జీతాలు ఉన్న వారికి మరింత ఎక్కువగా డీఏ పెరుగుతుంది. తద్వారా వారి జీతం కూడా పెరుగుతుంది.
పెన్షనర్లకు ప్రయోజనం
లెవెల్-1లో నెలకు రూ.56,900 ప్రాథమిక జీతం ఉన్నవారికి నెలకు రూ.1,707 వరకు జీతం పెరుగుతుంది. అదే సంవత్సరానికి రూ.20,484 పెరుగుతుంది. మొత్తం మీద 3 శాతం డీఏ పెంపు అనేది ఎన్నో కుటుంబాలకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది.