- Home
- Business
- Today Gold Price: బంగారం ధరలు పాతాళానికి.. రెండు రోజుల్లో భారీ పతనం.. ఇంకా తగ్గుతుందా?
Today Gold Price: బంగారం ధరలు పాతాళానికి.. రెండు రోజుల్లో భారీ పతనం.. ఇంకా తగ్గుతుందా?
Today Gold Price: బంగారం ధరలు మళ్లీ దిగొస్తున్నాయి. మొన్నటి వరకు రికార్డు స్థాయిల్లో కొనసాగిన పసిడి ఇప్పుడు భారీగా వెనక్కి తగ్గుతోంది. దాదాపు ఈ 4 రోజుల్లో రూ.6,110 తగ్గింది. మరి కొనాలా వద్దా అని ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి అవకాశమేనా?

బంగారం కొనాలనుకుంటున్నారా?
బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే మీకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన పసిడి ధరలు ఇప్పుడు ఒక్కసారిగా దిగొస్తున్నాయి. వరుసగా రెండో రోజు కూడా భారీగా తగ్గాయి. తులం బంగారంపై ఏకంగా రూ.1300 పైగా తగ్గడం కొనుగోలుదారులకు ఊరటనిస్తోంది. మరి తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బంగారం ధరలు ఎంత ఉన్నాయి? వెండి ధరలో ఎలాంటి మార్పు ఉంది? చూద్దాం.
పసిడికి ప్రతికూలంగా మారిన డాలర్
అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు పసిడి ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా ఆర్థిక గణాంకాలు, వడ్డీ రేట్లపై ఫెడరల్ రిజర్వ్ వైఖరికి సంబంధించిన అంచనాలు బంగారం మార్కెట్‌ను ఒత్తిడిలోకి నెట్టాయి. దీనికి తోడు డాలర్ బలపడటం కూడా పసిడికి ప్రతికూలంగా మారింది. సాధారణంగా డాలర్ విలువ పెరిగినప్పుడు ఇతర కరెన్సీలు ఉపయోగించే వారికి బంగారం కొనుగోలు ఖరీదుగా మారుతుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా ఇలాంటి పరిణామాలే బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి.
మరోవైపు ఇటీవల బంగారం ధరలు భారీగా పెరగడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులపై వచ్చిన లాభాలను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున బంగారాన్ని విక్రయిస్తున్నారు.దీన్నే ప్రాఫిట్ బుకింగ్ అంటారు. ఈ అమ్మకాల ఒత్తిడి కూడా ధరల పతనానికి కారణమైంది.
ఇక దేశీయ మార్కెట్లో బంగారం ధరలను పరిశీలిస్తే..
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా ముంబై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,310 తగ్గింది. దీంతో ప్రస్తుతం తులం పసిడి ధర రూ.1,39,490కు చేరింది. అదే సమయంలో ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా తగ్గింది. 10 గ్రాములపై రూ.1,200 తగ్గడంతో ప్రస్తుతం రూ.1,26,950 వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే.. 10 గ్రాములపై రూ.980 తగ్గింది. దీంతో ప్రస్తుతం రూ.1,03,870గా నమోదైంది.
వెండి విషయానికి వస్తే..
బంగారం ధరలు వరుసగా తగ్గుతున్నప్పటికీ వెండి మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2 లక్షల వద్ద ట్రేడవుతోంది. మొత్తంగా చూస్తే అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటం, అమెరికా ఆర్థిక పరిణామాలు, ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ బంగారం ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి. అయితే ఈ తగ్గుదల ఇక్కడితో ఆగుతుందా? రానున్న రోజుల్లో పసిడి ధరలు మరింత దిగొస్తాయా? అనేది అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది.













