Gold price: తులం బంగారం రూ. 60 వేలు కానుందా.? నిపుణులు చెబుతోన్న కారణాలు ఏంటంటే
బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. పెరగడమే తప్ప తగ్గడం లేదంటూ గోల్డ్ ధరలు దూసుకుపోతున్నాయి. తులం బంగారం ధర మళ్లీ రూ. లక్షకు చేరవవుతోన్న తరుణంలో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది .

భారీగా తగ్గనున్న బంగారం ధరలు
ప్రపంచ మార్కెట్లో మారుతున్న పరిణామాలు, డాలర్ బలోపేతం, పెట్టుబడిదారుల ఆలోచనలో వచ్చిన మార్పులు వంటి అంశాల నేపథ్యంలో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తోంది. ప్రస్తుతం సుమారుగా రూ. లక్ష ఉన్న బంగారం ధర, రానున్న రోజుల్లో రూ. 50,000 నుంచి రూ. 70,000 మధ్య స్థాయిలో ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
తగ్గుతోన్న గ్లోబల్ ఉద్రిక్తతలు
ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు కొంతమేర శాంతించాయి. రష్యా-ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ వంటి ప్రాంతాల్లో స్పష్టమైన మార్పులు కనిపించడంతో, గోల్డ్ సేఫ్ హవెన్ పెట్టుబడి రూపంలో డిమాండ్ తగ్గే అవకాశముంది. వాణిజ్య ఒప్పందాలు, ఆర్థిక పరమైన ఒత్తిళ్లు కొలిక్కి వస్తుండడం కూడా బంగారం పట్ల పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని తగ్గించవచ్చునని అంచనాలు వెలువడుతున్నాయి.
డాలర్ బలపడటం కూడా
అమెరికన్ డాలర్ బలపడటమే కాకుండా, యూఎస్ ట్రెజరీ బాండ్ రాబడులు పెరగడం వల్ల పెట్టుబడిదారులు బంగారం కంటే ఇతర ఆప్షన్లవైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో డిమాండ్ తగ్గడం ప్రారంభమైంది. ఇది ప్రత్యక్షంగా బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంది.
కేంద్రబ్యాంకుల కొనుగోళ్లు తగ్గుముఖం
ఇటీవల వరుసగా బంగారం నిల్వలు పెంచిన కేంద్రబ్యాంకులు ఇప్పుడు కొంత వెనక్కి తగ్గుతున్నాయి. కొనుగోళ్లు తగ్గడంతో గోల్డ్ డిమాండ్‌లో తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో రిటైల్ పెట్టుబడిదారులలోనూ బంగారం కొనుగోలు చైతన్యం మందగిస్తోంది. దీని ప్రభావం ధరలపై పడుతోంది.
ఎంత తగ్గనున్నాయంటే.?
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు తులానికి రూ. 50 వేల నుంచి రూ. 70 వేల మధ్య ఉండే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది తాత్కాలికమే అని భావించాలి. బంగారం పట్ల భారత్‌లో ఉండే సంప్రదాయ ఆసక్తి, గౌరవం బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
బంగారంపై పెట్టుబడి సురక్షితమే
అయితే ధరలు తగ్గుతాయన్నంత మాత్రాన బంగారంలో పెట్టుబడి పెట్టడం రిస్క్ కాదని నిపుణులు చెబుతున్నారు. ధరల్లో తాత్కాలిక హెచ్చుతగ్గులు ఉన్నా.. దీర్ఘకాలిక దృష్టిలో బంగారం పెట్టుబడి సురక్షితమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెళ్లిళ్లు, పండుగలు, సంపదకు గుర్తుగా బంగారాన్ని కొనుగోలు చేసే భారతీయుల మనస్తత్వం దృష్ట్యా బంగారానికి డిమాండ్ ఎప్పటికీ తగ్గదని అంటున్నారు.