Gold Price Hike: డాలర్ బలహీనపడటంతో బంగారానికి ఊతం.. మళ్లీ పెరుగుతున్న గోల్డ్
Gold Price Hike: ఇటీవల భారీగా పడిపోయిన బంగారం ధరలు మళ్లీ ఎగబాకుతున్నాయి. వరుసగా పెరుగుతున్న పసిడి రేట్లు కొనుగోలుదారుల్లో కొత్త చర్చకు తెరతీశాయి. అసలు బంగారం ధరలు మరోసారి పెరగడానికి కారణాలేంటి? ఈ పెరుగుదల ఇలాగే కొనసాగుతుందా?

మళ్లీ జోరు పెంచిన బంగారం
బంగారం ధరలు మళ్లీ జోరు పెంచాయి. కొంతకాలంగా తగ్గుతూ వచ్చిన పసిడి రేట్లు ఇప్పుడు వరుసగా పరుగులు పెడుతున్నాయి. ఈ వారం ప్రారంభం నుంచి ధరల్లో పెరుగుదల కనిపిస్తుండగా.. తాజాగా మరోసారి బంగారం ధరలు పైకి కదిలాయి. దీంతో పసిడి కొనాలనుకునేవారు మార్కెట్లను గమనిస్తున్నారు.
బంగారం మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్న అంతర్జాతీయత పరిణామాలు
అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, అమెరికన్ డాలర్ బలహీనపడటం పసిడికి కలిసొస్తున్నాయి. అంతేకాదు.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో తీసుకోబోయే నిర్ణయాలపై నెలకొన్న అంచనాలు కూడా బంగారం మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి.
రాజకీయ అనిశ్చితి
మరోవైపు అమెరికా మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి మార్గాల వైపు మొగ్గు చూపుతుంటారు. దీంతో బంగారంపై డిమాండ్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ పరిణామాలన్నీ పసిడి ధరల కదలికలకు కారణమవుతున్నాయి.
రూ.1,39,640కు చేరిన బంగారం
ఇక హైదరాబాద్‌లో తాజా బంగారం ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.270 పెరిగి రూ.1,39,640కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర తులంపై రూ.250 పెరిగి రూ.1,28,000 వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.200 పెరిగి రూ.1,04,730కు చేరుకుంది. బంగారం బాటలోనే వెండి ధర కూడా భారీ స్థాయిలో కొనసాగుతోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2 లక్షలుగా ఉంది.
మొత్తంగా చూస్తే.. ఇటీవల తగ్గిన ధరలతో బంగారం కొనాలని ఎదురుచూసిన వారికి మళ్లీ పెరుగుతున్న రేట్లు కొంత నిరాశ కలిగిస్తున్నాయి. అయితే అంతర్జాతీయ పరిణామాలను బట్టి రానున్న రోజుల్లో ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొనుగోలు చేయాలనుకునేవారు రోజువారీ ధరలను పరిశీలించడం మంచిది.





