ఆధార్‌లో పేరు, అడ్రస్సు మార్చడానికి మరో ఉచిత అవకాశం: ఎప్పటివరకో తెలుసా?
ఆధార్ కార్డు అప్‌డేషన్‌కి భారత ప్రభుత్వం మరో ఉచిత అవకాశాన్నిచ్చింది. మీరు ఇప్పటికీ ఆధార్ అప్ డేట్ చేసుకోకపోతే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇది పూర్తిగా ఉచితం. తప్పులు సరిచేసుకోవడం, అడ్రస్సులు మార్చుకోవడం కూడా చేసుకోవచ్చు. ఆధార్ అప్‌డేషన్‌కి సంబంధించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.
మనందరికీ ఆధార్ కార్డు అత్యవసర గుర్తింపు కార్డు కదా.. ఇప్పుడు పిల్లలకు కూడా ఆధార్ తప్పనిసరి చేశారు. మరి ఇలా కొత్త ఆధార్ కార్డులు వస్తూ ఉంటాయి. జనం అడ్రస్సులు కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి UIDAI మరోసార భారత ప్రజలకు ఉచిత ఆధార్ అప్డేషన్ కి అవకాశం ఇచ్చింది. బ్యాంకుతో సహా అనేక చోట్ల చిరునామా ధ్రువీకరణ పత్రంగా ఆధార్ కార్డునే అడుగుతుంటారు. ఆర్థిక లావాదేవీలకు కూడా ఆధార్ చాలా అవసరం. అందుకే అందరూ ఆధార్ అప్డేషన్ చేయించుకోవాలి.
అడ్రస్సు మార్చుకోవాలన్నా, పుట్టిన తేదీ లేదా పేరులో తప్పులు సరిచేసుకోవాలన్నా మీరు ఇప్పుడు ఉచితంగా చేయించుకోవచ్చు. మొబైల్ నంబర్, ఇ-మెయిల్ చిరునామాను జోడించడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. బ్యాంకు, పోస్టాఫీసు వంటి ప్రభుత్వ కార్యాలయాల్లో ఆధార్ సమాచారాన్ని సరిచేసుకోవచ్చు.
ఆధార్ అప్‌డేట్ కి గడువు
ఆధార్ సమాచారాన్ని సరిచేసుకోవాలనుకునే వారు ఇంటి నుండే చేసుకోవచ్చని UIDAI తెలిపింది. మరో 6 నెలల పాటు ఉచితంగా ఆధార్ సమాచారాన్ని సరిచేసుకోవచ్చని తెలియజేసింది.
అంటే 2025 జూన్ 14 వరకు ఉచితంగా ఆధార్ సమాచారాన్ని సరిచేసుకోవచ్చన్న మాట. ఆ తర్వాత UIDAI ప్రకారం ఫీజు చెల్లించాలి. UIDAI అధికారిక వెబ్‌సైట్ myaadhaar.uidai.gov.in లో ఆధార్ స్వయం సేవా వెబ్‌సైట్ లోకి వెళ్లి మీ ఆధార్ కు సంబంధించిన మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు.
ఇలా చేయండి
ఆధార్ కార్డులో చిరునామాను మార్చడానికి myaadhaar.uidai.gov.in వెబ్ సైట్ ఓపెన్ చేయండి.
అందులో ‘అప్‌డేట్ ఆధార్’ విభాగాన్ని క్లిక్ చేయండి.
‘సెల్ఫ్ అప్‌డేట్’పై క్లిక్ చేయండి.
ఆ తర్వాత ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
మీ ఆధార్ కార్డుకు లింక్ చేసిన ఫోన్ నంబర్‌కు వచ్చే OTP ద్వారా లాగిన్ అవ్వండి.
‘అడ్రస్ అప్‌డేట్’ పై క్లిక్ చేయండి.
అక్కడ చిరునామాను మార్చుకోండి.
UIDAI అధికారిక వెబ్‌సైట్ myaadhaar.uidai.gov.in ద్వారా చిరునామాతో పాటు పేరు, పుట్టిన తేదీ వంటి సమాచారాన్ని కూడా మీరు ఇదే విధంగా సరిచేసుకోవచ్చు.