- Home
- Business
- Food Delivery: గాలి పీల్చినందుకు కూడా ట్యాక్స్ వేస్తారేమో.. స్విగ్గీ, జొమాటో తీరుపై నెటిజన్ల కామెంట్స్
Food Delivery: గాలి పీల్చినందుకు కూడా ట్యాక్స్ వేస్తారేమో.. స్విగ్గీ, జొమాటో తీరుపై నెటిజన్ల కామెంట్స్
Food Delivery: ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో కొన్ని రకాల వస్తువల ధరలు తగ్గగా మరికొన్ని వాటివి పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ఫుడ్ డెలివరీ ఫీజులపై ప్రభుత్వం 18 శాతం జీఎస్టీ విధించింది.

డెలివరీ ఛార్జీలపై 18% జీఎస్టీ
ఆన్‌లైన్‌లో భోజనం ఆర్డర్ చేసే వారికి ఇప్పుడు అదనపు ఖర్చు తప్పనిసరి కానుంది. స్విగ్గీ, జొమాటో వంటి ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలు వసూలు చేసే డెలివరీ ఫీజులపై కేంద్ర ప్రభుత్వం 18 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని విధించింది. ఈ నిబంధన 2025 సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చింది. ఫలితంగా, కస్టమర్ బిల్లులు ఆటోమేటిక్‌గా పెరగడంతో ఆన్‌లైన్ ఫుడ్ ధర మరింత పెరగనుంది. ఇంతకుముందు వినియోగదారులు ఆర్డర్ చేసినప్పుడు చూపించే బిల్లులో ఫుడ్ ప్రైస్, డెలివరీ ఛార్జీలు, ప్లాట్‌ఫామ్ ఫీజు మాత్రమే ఉండేది. ఇప్పుడు వీటన్నింటిపై పన్ను కూడా కలవనుంది. దీంతో ఆన్‌లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసే వారికి ఖర్చు పెరగడం ఖాయం.
జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న కీలక నిర్ణయం
ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న సంస్కరణల్లో భాగంగా ఈ-కామర్స్ ఆధారిత డెలివరీ సేవలను కొత్త పన్ను చట్టంలోకి తెచ్చారు. కేంద్ర జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 9(5) ప్రకారం, వినియోగదారులకు నేరుగా డెలివరీ సర్వీస్ ఇవ్వకపోయినా, దానికి బాధ్యత వహించేది స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలేనని స్పష్టత ఇచ్చారు. మునుపటి పరిస్థితిలో డెలివరీ భాగస్వాములు పొందిన చెల్లింపులను ఫీజుగా పరిగణించేవారు. దానిపై జీఎస్టీ విధానం స్పష్టంగా ఉండేది కాదు. కానీ తాజా మార్పుతో డెలివరీ ఛార్జీలు, ప్లాట్‌ఫామ్ ఫీజులు, అదనపు స్పెషల్ ఫీజులన్నీ పన్ను పరిధిలోకి వస్తున్నాయి. దీనివల్ల ఆన్‌లైన్ ఆర్డర్ ఖర్చు కొద్దికొద్దిగా పెరుగుతూ ఉండే అవకాశం ఉంది.
సంస్థలపై, వినియోగదారులపై ప్రభావం
మోర్గాన్ స్టాన్లీ తాజా నివేదిక ప్రకారం, జొమాటో ప్రస్తుతం సగటుగా రూ. 11-12 డెలివరీ ఫీజు వసూలు చేస్తోంది. దీనిపై కొత్తగా 18 శాతం పన్ను విధించడంతో సగటున రూ. 2 అదనంగా కస్టమర్లపై భారం పడుతుంది. అదే విధంగా, స్విగ్గీ సగటు డెలివరీ ఛార్జీ రూ. 14.5 ఉంటే, దానిపై రూ. 2.6 పన్ను రూపంలో చెల్లించాల్సి వస్తుంది. ఇది కేవలం డెలివరీ ఛార్జీలకే పరిమితం కాదు. ప్లాట్‌ఫామ్ ఫీజు, పీక్ అవర్ ఛార్జీలు, వర్షం కారణంగా వసూలు చేసే ‘రెయిన్ ఫీజు’ వంటి అన్ని అదనపు ఖర్చులపై కూడా 18 శాతం జీఎస్టీ తప్పనిసరిగా చెల్లించాలి. అంటే, వినియోగదారులు ఒకవైపు పెరిగిన ఫుడ్ ఖర్చులతో పాటు పన్నుల రూపంలో మరింత భారాన్ని భరించాల్సి వస్తోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న కామెంట్స్
ఈ కొత్త జీఎస్టీ నిబంధనపై సోషల్ మీడియాలో వినియోగదారులు తీవ్రంగా స్పందిస్తున్నారు. చాలా మంది తమ బిల్లుల స్క్రీన్‌షాట్లను షేర్ చేస్తూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. ఒక వినియోగదారుడు, “ఇప్పటి వరకు ఆహారం, డెలివరీ, ప్లాట్‌ఫామ్ ఫీజులకే చెల్లించేవాళ్లం. ఇప్పుడు వర్షం పడితే వచ్చే రెయిన్ ఫీజుపైనా పన్ను వసూలు చేస్తున్నారు. త్వరలో సూర్యరశ్మికి కన్వీనియన్స్ ఛార్జీ, గాలి పీల్చినందుకు ఆక్సిజన్ మెయింటెనెన్స్ ఫీజు కూడా పెట్టేస్తారేమో!” అని వ్యంగ్యంగా రాసుకొచ్చాడు. ఈ తరహా కామెంట్లు ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. కొందరు వినియోగదారులు అయితే భవిష్యత్తులో ఆన్‌లైన్ ఆర్డర్లు తగ్గుతాయని, చిన్న హోటళ్లు లేదా స్థానిక భోజన కేంద్రాలపై ఆధారపడే పరిస్థితి వస్తుందని అంటున్నారు.
After historic GST reforms, even Lord Indra has been brought under the tax net.
Now when it rains, you get ₹25 Rain Fee + 18% GST = ₹29.50 😂
Next up:
👉Sunlight Convenience Fee 🌞
👉Oxygen Maintenance Charge 💨
👉GST on Breathing, Pay as you inhale pic.twitter.com/JdtHfr715G— Ashish Gupta (@AshishGupta325) September 22, 2025
క్విక్-కామర్స్‌పై ప్రభావం తక్కువ
బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి క్విక్-కామర్స్ సంస్థలపై ఈ ప్రభావం పెద్దగా ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వాటి డెలివరీ ఛార్జీలు ఇంతకుముందే పన్ను పరిధిలో ఉన్నాయి. కొత్తగా వచ్చిన జీఎస్టీ నిబంధనతో వీటిపై అదనపు భారం ఉండదు. అయితే, ఫుడ్ డెలివరీ రంగంలో ఇది వినియోగదారులకు పెద్ద మార్పు. ఇప్పటికే ప్లాట్‌ఫామ్ ఫీజు, పీక్ అవర్ ఛార్జీలు, సర్జ్ ప్రైసింగ్ కారణంగా ఖర్చు పెరుగుతుండగా, ఇప్పుడు పన్ను రూపంలో మరో అదనపు భారం పడుతోంది. ఇది దీర్ఘకాలంలో ఫుడ్ డెలివరీ డిమాండ్‌ను ప్రభావితం చేసే అవకాశముందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వినియోగదారులపై ప్రభావం
ఇంటికి ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం ఒక సౌకర్యం అయినప్పటికీ, దానికి ఇప్పుడు అదనపు పన్ను భారమూ కలిసింది. స్విగ్గీ, జొమాటో వంటి సంస్థల వినియోగం రోజురోజుకీ పెరుగుతున్న వేళ, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులపై నేరుగా ప్రభావం చూపనుంది. ఒకవైపు భోజనం ధరలు పెరుగుతుండగా, మరోవైపు సౌకర్యం కోసం చెల్లించే డెలివరీ ఛార్జీలపై పన్ను కూడా వేసినప్పుడు, వినియోగదారుల ఖర్చు మరింత పెరుగుతుంది. రాబోయే రోజుల్లో వినియోగదారుల ప్రాధాన్యతలు మారుతాయా? లేక పన్ను భారం ఉన్నా సౌకర్యం కోసం ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీని కొనసాగిస్తారా? అనేది చూడాలి.