అప్పు తీర్చడానికి మళ్లీ అప్పు చేయడం కరెక్టేనా?
ఈ కాలంలో అప్పులు చేయకుండా అవసరాలు తీరతాయా? చాలా కష్టం కదా.. కాని అప్పు తీర్చాల్సి వస్తే ఇంకోచోట అప్పు చేయడం కరెక్టేనా? తెలుసుకుందాం రండి.
పెరుగుతున్న ధరలు.. తీరని ఆశలు.. అరకొర సంపాదన.. మనలో ఎక్కువ మంది ఇలాంటి పరిస్థితుల్లోనే జీవిస్తుంటారు. ధరలు పెరిగాయని నిత్యావసరాలు తీర్చుకోకుండా ఉండలేం కదా.. అన్నింటికీ మోక్ష మార్గం అప్పు. ఇచ్చే వాడుండాలే కాని వడ్డీ ఎంతో కూడా తెలుసుకోకుండా తీసుకొనే వాళ్లున్నారు. అలా అని జల్సా చేయడానికి ఎవరూ అప్పు చేయరు. అవసరాలు తీర్చుకోవడానికి, ముఖ్యంగా కుటుంబ అవసరాలు తీర్చడానికే అప్పులు చేస్తారు. ఇలా చేసిన అప్పుల వడ్డీలు పెరిగిపోయి తీర్చలేని భారంగా మారిపోతుంటాయి. అవి తీర్చడానికి మనలో చాలా మంది మరోచోట అప్పు చేసి ప్రస్తుతానికి ఇబ్బంది లేకుండా చేస్తుంటారు. అయితే అసలు ఇలా చేయడం కరెక్టేనా?
సాధారణంగా అప్పులు ఎందుకు చేస్తారు? పెళ్లి, వ్యాపారం, ఇంటి నిర్మాణం, వెహికల్ కొనుక్కోవడం ఇలాంటి వాటికి లోన్స్ తీసుకుంటారు. ఇలా లోన్స్ తీసుకున్నప్పుడు వడ్డీ సకాలంలో కట్టేస్తే పెద్దగా బర్డెన్ అనిపించదు. అయితే వడ్డీలు కట్టపోతే అది రోజురోజుకూ పెద్ద కొండలా మారిపోతుంది. కొన్నాళ్లకు తీర్చలేని విధంగా మారిపోతుంది. దీంతో ఆస్తులు అమ్ముకొంటే తప్ప సమస్య పరిష్కారం కాదు.
ఇదే పరిస్థితి ఎదురైతే చాలా మంది చేసే పనేంటంటే ఇంకో చోట అప్పు చేసి ఈ అప్పు తీరుస్తారు. ఇలా చేయడం ఒక రకంగా తప్పే. కాని ప్లానింగ్ ప్రకారం చేస్తే భారంగా మారిన అప్పు తీర్చడానికి మరో చోట లోన్ తీసుకోవడం కరెక్టే. అయితే ఇలా చేయాలంటే కొన్ని కండీషన్స్ ని కచ్చితంగా ఫాలో అవ్వాలి.
ముందుగా మీకున్న అప్పులను సరిగ్గా విశ్లేషించుకోండి. వాటిల్లో అధిక వడ్డీ చెల్లిస్తున్న లోన్ తీర్చడానికి ప్లాన్ చేయండి. తక్కువ వడ్డీతో లోన్స్ ఇచ్చే బ్యాంకులను సంప్రదించండి. కొత్త లోన్ తీసుకోండి. ఎక్కువ కాలం టెన్యూర్ పెట్టుకోండి. ముందు భారంగా మారిన అప్పు తీర్చేయండి. కొత్తగా తీసుకున్న లోన్ ఈఎంఐలు సక్రమంగా కడుతూ ఉంటే, మీ కమిట్మెంట్ కి మరోసారి ఎక్కువ లోన్ ఇచ్చేందుకు బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు ముందుకొస్తాయి.
అప్పు తీర్చడం భారం కాకుండా ఉండాలంటే ముందు మీరు చేస్తున్న అనవసరపు ఖర్చులు తగ్గించుకోండి. చిన్న ఖర్చే కదా.. ఇది దాస్తే మాత్రం అప్పులు తీరిపోతాయా అని మాత్రం ఆలోచించకండి. మీ దగ్గర పది రూపాయలు మిగిలినా పక్కన పెట్టేయండి. ఆ అమౌంట్ కొన్ని రోజులకు వేలు, లక్షలు అవ్వొచ్చు. దుబారా ఖర్చులను తగ్గించుకొని ఆ డబ్బులను సేవ్ చేసి ఒక్కసారిగా అసలు కింద చెల్లించండి.
నాలుగైదు చోట్ల అప్పులు చేసి ఉంటే ముందుగా మీరు ఏదో ఒక అప్పు తీర్చడానికి కష్టపడంది. నాలుగు చోట్ల కొంచెం కొంచెం కట్టే బదులు ఒకరికే మొత్తం కడితే ఒక భారం తగ్గుతుంది. అందువల్ల మీరు అప్పు తెచ్చిన వారిలో ఎవరికి ముందు చెల్లించాలన్నది మీరు నిర్ణయించుకోండి.
ఉద్యోగాలు చేసేవారు ఆఫీసుల్లో ఇచ్చే బోనస్ డబ్బులు, ఓటీ నగదును అప్పులు తీర్చడానికే ఉపయోగించండి. సంవత్సరానికి ఒకసారే వస్తోంది కదా అని అనవసర ఖర్చులకు ప్లాన్ చేయకండి. ఈ టెక్నిక్స్ పాటిస్తే అప్పు తీర్చడానికి ఇంకోచోట అప్పు చేసినా తప్పేం లేదు.