Myntra: ఈకామర్స్ దిగ్గజం మింత్రాకు షాక్.. రంగంలోకి ఈడీ.. అసలు ఏం జరిగింది?
Myntra:ఈకామర్స్ దిగ్గజం మింత్రాకు బిగ్ షాక్ తగిలింది. నిబంధనలు ఉల్లంఘించి చట్టానికి వ్యతిరేకంగా రూ.1654 కోట్ల ఎఫ్‌డీఐ స్వీకరించిందనే ఆరోపణల మధ్య కేసు నమోదుచేసింది.

ఎఫ్‌డీఐ ఉల్లంఘనలు.. మింత్రాపై ఈడీ చర్యలు
బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ మింత్రా డిజైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) కింద కేసు నమోదు చేసింది. మొత్తం రూ.1654.35 కోట్ల విదేశీ పెట్టుబడుల ఉల్లంఘనపై ఈ కేసు నమోదు అయింది.
ఈడీ ప్రకటన ప్రకారం, మింత్రా 'హోల్‌సేల్ క్యాష్ అండ్ క్యారీ' వ్యాపారం పేరుతో బహుళ బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్ (MBRT) నిర్వహిస్తున్నట్టు గుర్తించింది. ఇది ఎఫ్‌డీఐ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది.
హోల్‌సేల్ క్యాష్ అండ్ క్యారీ పేరుతో నిబంధనల ఉల్లంఘన
ఈడీ వెల్లడించిన వివరాల ప్రకారం, మింత్రా డిజైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ‘హోల్‌సేల్ క్యాష్ అండ్ క్యారీ’ వ్యాపారం పేరుతో విదేశీ పెట్టుబడులు ఆకర్షించింది. కానీ వాస్తవానికి, మింత్రా తన మొత్తం ఉత్పత్తులను ‘వెక్టార్ ఈ-కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్’కు విక్రయించింది, ఇది మింత్రా గ్రూప్‌కే చెందిన మరో కంపెనీ.
వెక్టర్ తర్వాత ఆ ఉత్పత్తులను సాధారణ వినియోగదారులకు రిటైల్ రూపంలో విక్రయించింది. అంటే, బిజినెస్ టూ బిజినెస్ (B2B)గా చూపించిన లావాదేవీలు, నిజానికి B2C (వ్యాపారం నుండి వినియోగదారుడికి)గా మారాయి.
మింత్రా ఎఫ్‌డీఐ నిబంధనలు ఎలా ఉల్లంఘించింది?
ప్రస్తుత ఎఫ్‌డీఐ విధానాల ప్రకారం, ఒక హోల్‌సేల్ కంపెనీ తన గ్రూప్‌లోని ఇతర కంపెనీలకు గరిష్ఠంగా 25% వరకు మాత్రమే ఉత్పత్తులను విక్రయించాలి. కానీ మింత్రా మాత్రం 100% ఉత్పత్తులను తన గ్రూప్ కంపెనీ అయిన వెక్టార్‌కి విక్రయించడంతో నిబంధనలను అతిక్రమించింది.
ఈ చర్యలు ఎఫ్‌డీఐ విధానాలలో 2010 ఏప్రిల్ 1 - అక్టోబర్ 1న అమలులోకి వచ్చిన మార్పులకు విరుద్ధంగా ఉన్నాయని ఈడీ తెలిపింది. దీనిపై ఫేమా (FEMA) చట్టంలోని సెక్షన్ 6(3)(b), సెక్షన్ 16(3) ప్రకారం ఫిర్యాదు చేసింది.
గ్రూప్ కంపెనీల మధ్య బిజినెస్ మోడల్
ఈ కేసులో మింత్రా డిజైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వెక్టార్ ఈ-కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు ఒకే గ్రూప్‌కు చెందినవిగా గుర్తించారు. ఈ రెండు కంపెనీల మధ్య జరిగిన వ్యాపార లావాదేవీలు, బహుళ బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్‌ను కప్పిపుచ్చే లక్ష్యంతో రూపొందించినట్టు ఈడీ అభిప్రాయపడింది.
వాస్తవానికి, మింత్రా విదేశీ పెట్టుబడులను ‘హోల్‌సేల్ వ్యాపారం’ పేరిట పొందినప్పటికీ, వాటిని ప్రత్యక్ష వినియోగదారులకు రీటైల్ విక్రయంగా మార్చడానికి వెక్టార్ అనే మాధ్యమాన్ని ఉపయోగించిందని విచారణలో తేలింది.
మింత్రా ఏం చెబుతోంది?
ఈ కేసుపై మింత్రా అధికారికంగా స్పందిస్తూ.. "అధికారుల నుంచి సంబంధిత ఫిర్యాదు లేదా దస్తావేజులు మాకు అందలేదని" తెలిపింది. పూర్తి స్థాయిలో అధికారులకు సహకరించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొంది.
కాగా, ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉంది. మింత్రా, సంబంధిత కంపెనీల డైరెక్టర్లు కూడా ఈ కేసులో ఉంటారని నివేదికలు పేర్కొంటున్నాయి.
Enforcement Directorate (ED) has filed a complaint under Foreign Exchange Management Act, 1999 (FEMA) against Myntra Designs Private Limited (Myntra) and its related companies and their Directors for contravention to the tune of Rs 1654,35,08,981: ED pic.twitter.com/KWPrGKAQWZ
— ANI (@ANI) July 23, 2025