- Home
- Business
- ఎలక్ట్రిక్ టూ వీలర్ దగ్ధంపై DRDO నివేదికలో ముఖ్య అంశాలు ఇవే...ఓలా సహా ఈ కంపెనీలకు సమన్లు...
ఎలక్ట్రిక్ టూ వీలర్ దగ్ధంపై DRDO నివేదికలో ముఖ్య అంశాలు ఇవే...ఓలా సహా ఈ కంపెనీలకు సమన్లు...
గడిచిన కొన్ని నెలలుగా ఎలక్ట్రిక్ వాహనాల వరుస దగ్ధం అయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై సీరియస్ గా విచారణ చేపట్టింది. ఆ విచారణ బాధ్యతను DRDOకు అప్పగించగా, వాహనాల దగ్ధం వెనుక కారణాలను బయటపెట్టి నివేదికను ప్రభుత్వానికి అందచేసింది. ఆ నివేదికలోని ముఖ్యమైన అంశాలు ఇవే...

భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ వరుసగా అగ్నికి ఆహుతి దగ్థమైన కేసులను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అగ్ని ప్రమాదాల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజలకు నమ్మకం తగ్గిపోయింది. దీంతో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి, డీఆర్‌డీవో సంస్థను మొత్తం వ్యవహారంపై లోతుగా విచారణ జరిపించాలని కోరింది. ఇప్పుడు డిఆర్‌డిఓ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ విషయంలో ఓలా సహా పలు ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలకు ప్రభుత్వం సమన్లు కూడా జారీ చేసింది.
DRDO రిపోర్టులోని మఖ్యమైన విషయం ఇదే...
DRDO పరిశోధన బాధ్యతను సెంటర్ ఫర్ ఫైర్, ఎక్స్‌ప్లోజివ్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సేఫ్టీ (CFEES)కి అప్పగించింది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై డీఆర్డీవో అందించిన నివేదికపై బిజినెస్ టుడే వెబ్ పోర్టల్ ప్రత్యేక కథనం అందించింది. ఈ నివేదిక ప్రకారం, ఎలక్ట్రిక్ స్కూటర్లలో అకస్మాత్తుగా మంటలు సంభవించడానికి, అసలు కారణం బ్యాటరీ వైఫల్యమే అని తేల్చింది.
ఖర్చును తగ్గించడానికి నాణ్యత విషయంలో రాజీ పడ్డారు...
ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగడానికి నాణ్యత లేని బ్యాటరీలే కారణమని DRDO తన నివేదికలో పేర్కొంది. ఇది కాకుండా, బ్యాటరీ ప్యాక్ వివిధ ఉష్ణోగ్రతల వద్ద పరీక్షించలేదని, మరొక కారణం కూడా బయటపెట్టింది. బ్యాటరీ నాణ్యత తక్కువగా ఉన్న కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని, నివేదిక పేర్కొంది. ఈ-స్కూటర్‌ను తయారు చేసే కంపెనీలు ఉద్దేశపూర్వకంగా తక్కువ నాణ్యత గల పదార్థాలను ఉపయోగించి ఖర్చును తగ్గించుకోవాలని చూశాయని, అందుకే ఈ పరిస్థితులు తలెత్తాయని తేల్చింది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలకు నిబంధనలను కఠినతరం చేయాలని DRDO సూచించింది.
ఈ కంపెనీలకు సమన్లు అందాయి...
ప్రస్తుతం ద్విచక్ర వాహనాల మొత్తం విక్రయాల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వాటా కేవలం 2 శాతం మాత్రమే ఉంది. 2030 నాటికి మొత్తం ద్విచక్ర వాహనాల విక్రయాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌ల వాటాను 80 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న తరుణంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగిన ఘటనలు తెరపైకి వచ్చాయి. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 9 ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగాయి. ఓలా ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్, ప్యూర్ ఈవీ, బూమ్ మోటార్స్, జితేంద్ర ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగాయి. ప్రభుత్వం గతవారం ఈ కంపెనీలకు సమన్లు జారీ చేసింది.
అగ్నిప్రమాద ఘటనలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలనే నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు ఇటీవలి నెలల్లో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను రీకాల్ చేశాయి. ఓలా, ఒకినావా, ప్యూర్ EV వంటి కంపెనీలు 7,000 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను రీకాల్ చేశాయి. ఓలా ఎలక్ట్రిక్ 1400 యూనిట్లు, ప్యూర్ EV 2000, ఒకినావా 3215 యూనిట్లను రీకాల్ చేశాయి. మరోవైపు దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు గణనీయంగా పెరగడం విశేషం. FADA డేటా ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలో 4,29,217 బ్యాటరీతో నడిచే వాహనాలు విక్రయించారు. ఇది ఏడాది క్రితం కంటే 3 రెట్లు ఎక్కువ.