AC price down: జీఎస్టీ వల్ల ఏసీ ధర ఎన్ని వేల రూపాయలు తగ్గిందో తెలుసా?
జీఎస్టీ అమల్లోకి వచ్చేసింది. దీంతో ఏసీ (AC) ధరలు చాలా తగ్గిపోయాయి. వచ్చే వేసవికి ఏసీలు కొనేందుకు ఇప్పుడే ఎంతో మంది సిద్ధమైపోయి ఉంటారు. ఏసీ ధరలు ఎంత తగ్గాయో తెలుసుకోండి.

ఏసీల ధరలపై ప్రభావం
జీఎస్టీ మార్పులు పేద, మధ్యతరగతి ప్రజలకు ఆనందాన్ని ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు ప్రభావాలను సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ జీఎస్టీలోని మార్పులు వల్ల కారు ధరల నుండి ఆహారం వరకు అన్ని రంగాలపైన ప్రభావాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా కారు కంపెనీలు ఇప్పటికే లక్షల రూపాయల తగ్గింపులను, డిస్కౌంట్ లను ప్రకటించేసాయి. నవరాత్రుల సందర్భంగా కొత్తకారు అమ్మకాలు కూడా పెరిగాయి. జీఎస్టీ తగ్గింపు ప్రభావం ఇప్పుడు ఏసీలపై కూడా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఎయిర్ కండిషన్ ధరలపై జిఎస్టి అనేది ఎంతో ప్రభావాన్ని చూపించింది. పేద మధ్యతరగతి ప్రజలకు ఇది చాలా అందుబాటు ధరల్లో దొరకబోతోంది.
ఎంత ధర తగ్గుతుంది?
రెండు టన్నుల కంటే తక్కువ సామర్థ్యం ఉన్న ఏసీలపై జిఎస్టి 28 శాతం ఉండేది. దాన్ని 18 శాతానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. దీంతో ఏసీ ధరలు 6 శాతం నుండి 8శాతం వరకు తగ్గాయి. కొనుగోలుదారులకు ఇది ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. ఇక జనవరి 2026లో మార్కెట్లోకి వచ్చే అన్ని ఏసీల ధరలు మరింతగా తగ్గే అవకాశం ఉంది. ఒక్కో ఏసీ పై 2000 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు ధరలు తగ్గుతాయి. మీరు ఎంచుకునే ఏసీను బట్టి ఎంత ధర తగ్గుతుంది అనేది ఆధారపడి ఉంటుంది.
ఏసీ అమ్మకాలు తగ్గుతాయా?
అలాగే వచ్చే ఏడాది.. 2026లో ఏసీ అమ్మకాలు 10 నుంచి 15 శాతం తగ్గే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఏడాది వేసవిలో ఊహించని విధంగా వర్షపాతం ఎక్కువగా నమోదయింది. వేడి గాలులు కూడా చాలా తగ్గాయి. దీంతో ఏసీ అమ్మకాలు తగ్గిపోయాయి. దీనివల్ల కంపెనీలు నష్టపోయాయి. ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవాలంటే ఇప్పుడు ధరలు తగ్గించాలి. అందుకే దసరా, దీపావళి సందర్భంగా ఏసీ కంపెనీలో ధరలను భారీగా తగ్గించాయి. వచ్చే ఏడాది కూడా వేసవిలో ఇలాగే వేడి గాలులు తగ్గడం, వర్షాలు పడడం వంటికి జరిగితే ఏసీ అమ్మకాలు చాలా వరకు పడిపోయే అవకాశం ఉంది.
ఏసీల ఉత్పత్తి
విదేశాలతో పోలిస్తే మనదేశంలోని ఏసీ మార్కెట్ చాలా చిన్నది. గ్రామాలలో చాలా అరుదుగానే ఏసీలు కనిపిస్తున్నాయి. పట్టణాలలో కూడా తక్కువ మంది ఏసీలను వాడుతున్నారు. రాబోయే రెండు సంవత్సరాలలో ఏసీలను ఉత్పత్తిలో ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టి వాటి ఉత్పత్తిని 40 నుంచి 50శాతం పెంచాలని ఎన్నో కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ధరలు తగ్గుతాయి కాబట్టి ఎక్కువ మంది కొంటారని వారి ఆశ.
ఏసీ ధరలు ఎంత?
మనదేశంలో ఏసీ ధర వాటి రకం, లక్షణాలను బట్టి ఆధారపడి ఉంటాయి. విండో ఏసీలు అతి తక్కువగా 20,000 రూపాయల నుండే మొదలవుతాయి. అదే స్ప్లిట్ ఏసీలు అయితే 25వేల రూపాయల నుండి 60 వేల రూపాయల వరకు ఉంటాయి. ఇక సెంట్రల్ డక్ట్, మినీ స్ప్లిట్ సిస్టంతో కూడిన ప్రీమియం మోడల్ ఏసీలు 70 వేల రూపాయలు కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీ ఇంటి అవసరాలను బట్టి మీరు దీన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఇంటికి ఫైవ్ స్టార్ ఇన్వర్టర్ ఏసీలు ఉత్తమంగా భావిస్తారు. ఇక కంపెనీల విషయానికొస్తే డైకిన్, ఎల్ జి, వోల్టాస్, బ్లూ స్టార్ వంటివి ఉత్తమమైన ఏసీలను అందిస్తున్నట్టు గుర్తింపును పొందాయి.
ఏ ఏసీ కొనాలి?
ఏసిని కొనేటప్పుడు మీ గది పరిమాణాన్ని బట్టి ఏసిని ఎంపిక చేసుకోవాలి. ఏసీ శీతలీకరణ సామర్ధ్యాన్ని టన్నులలో కొలుస్తారు. ఇక శక్తి సామర్ధ్యాన్ని స్టార్ రేటింగ్ లతో చెబుతారు. సాధారణంగా మీ పడకగది 12X12 పరిమాణంలో ఉంటే ఒక టన్ను ఏసీ సరిపోతుంది. అంతకన్నా పెద్దగా ఉంటే 1.5 టన్ను కొనుక్కుంటే ఉత్తమం.