టైం దాచుకునే బ్యాంక్ గురించి తెలుసా.. ఇవిగో పూర్తి వివరాలు..
డబ్బులు దాచుకునే బ్యాంక్ గురించి విన్నాం కానీ.. టైం దాచుకునే బ్యాంకు గురించి ఎప్పుడైనా విన్నారా.. మీరు విన్నది నిజమే.. మనం సమయాన్ని కూడా బ్యాంకులో దాచుకోవచ్చు. అది ఎలానో తెలుసుకుందాం రండి.
ప్రస్తుత కాలంలో డబ్బు లేకుండా బతకడం చాలా కష్టం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేసుకుంటూ డబ్బు సంపాదించి వారి అవసరాలు తీర్చుకుంటారు. 'ధనమేరా అన్నిటికి మూలం' అని ఆనాటి సినీ గేయ రచయిత ఆరుద్ర చెప్పకనే చెప్పారు. ఇంతకుముందు వ్యవసాయం మాత్రమే ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది. ఎవరి కులవృత్తులు వారు చేసుకుంటూ అందరూ వ్యవసాయం చేసేవారు. ఇప్పుడు మాత్రం పరిస్థితులు మారిపోయాయి. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, సాఫ్ట్ వేర్, నిర్మాణం ఇలా రకరకాల రంగాలు ఉపాధి అవకాశాలుగా మారాయి.
మనం దేశంలో ఇక్కడున్నాయి..
సంపాదించిన డబ్బుని అందరూ బ్యాంక్ ల్లో దాచుకుంటారు. మరి టైంని దాచుకునే బ్యాంకులు కూడా ఉన్నాయి. మనదేశంలో రాజస్థాన్లోని జైపూర్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈ టైం బ్యాంకులు ఉన్నాయి. ముఖ్యంగా జైపూర్ లో ఈ టైం బ్యాంకును బాగా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఇంకా ఇలాంటి సేవలు ప్రారంభం కాలేదు.
విదేశాల్లో సేవలు ఇలా..
అనేక దేశాల్లో కూడా ఈ టైం బ్యాంకులు ఉన్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా, కెనడా, స్విట్జర్లాండ్ దేశాల్లో ఇవి విస్తృత సేవలు అందిస్తున్నాయి. స్విట్జర్లాండ్ దేశంలో టైం బ్యాంక్ ఎంతో ప్రాచుర్యం పొందింది. మరి కొన్ని దేశాల్లో ఏర్పాటు చేయాలన్న ఆలోచనలను స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి.
టైం ఎలా దాచుకోవాలంటే..
టైం బ్యాంకు కూడా సాధారణ బ్యాంకుల్లా పనిచేస్తుంది. ఇందులో ఒక అకౌంట్ తీసుకోవాలి. మనకు సమయం ఉన్నపుడు ఎలాంటి ఆసరాలేని పేదలు, వృద్ధులు, చిన్నపిల్లలకు వారి అవసరాలు తీర్చేలా సాయం చేయాలి. అంటే వృద్ధులకు స్నానం చేయించడం, ఇళ్ళు సద్ది పెట్టడం, మందులు వేయడం, వైద్యుల దగ్గరికి తీసుకెళ్లడం వంటి పనులు చేయాల్స. ఇలా వారికి సేవ చేస్తూ ఎన్ని గంటలు గడిపితే అన్ని సేవా గంటలు టైం బ్యాంక్ లోని మన అకౌంట్లో జమ అవుతాయి.
సేవా గంటలు ఉపయోగించుకోండిలా..
వీటిని మనకు అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఆరోగ్యం బాగో లేనప్పుడు, ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు టైం బ్యాంకు కు తెలియజేస్తే వారు సేవా వాలంటీర్లను మన వద్దకు పంపిస్తారు. మనం ఎన్ని గంటలు సేవ చేశామో ఇతరుల ద్వారా ఉచితంగా సేవ పొందవచ్చు. ఈ ప్రక్రియ అంతా పూర్తి ఉచితంగా జరుగుతుంది. బాగుంది కదా.. టైం బ్యాంకు కాన్సెప్ట్. సేవ చేయడానికి ప్రత్యేకంగా సమయం కేటాయించలేక పోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ టైం బ్యాంక్ ఎంతోమందికి ఉచిత సేవలు అందిస్తోంది.