DA Merge: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను బేసిక్ జీతంలో కలిపేస్తారా? ఎవరికి లాభం?
DA Merg: ఎనిమిదో వేతన సంఘంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. ఆ మధ్యన డిఏను ప్రాథమిక వేతనంలో విలీనం చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రకటన చేసింది.

డీఏను కలపము
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎనిమిదవ వేతన సంఘం కోసం ఎదురుచూస్తున్నారు. దీని వల్ల వారి వేతనాల్లో భారీ పెరుగుదల వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మొన్నటి వరకు డీఏను కేంద్ర ఉద్యోగుల బేసిక్ జీతంలో కలిపేస్తారనే వాదన వినిపించింది. అయితే దీనిపై ఆర్థిక శాఖ సహాయ మంత్రి పార్లమెంటులో కీలక ప్రకటన చేశారు. ఎనిమిదవ వేతన సంఘాన్ని ఇప్పటికే ప్రభుత్వం నోటిఫై చేసిందని అంటే అధికారికంగా ఏర్పాటయిందని ఆయన తెలిపారు. ఇక డిఏ ను బేసిక్ జీతంలో విలీనం చేసిన ప్రతిపాదన ప్రభుత్వ దృష్టిలో లేదని ఆయన ప్రకటించారు. దీంతో చాలామంది ఉద్యోగుల్లో కాస్త నిరాశ నెలకొంది. డిఏ ను బేసిక్ పే లో కలిపితే వేతనం భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం కలిపే ఆలోచన లేదని తేల్చి చెప్పేసింది.
డీఏ 58 శాతం
డిఏ అంటే డియర్‌నెస్ అలవెన్స్. ఇది ద్రవ్యోల్భణం పై ఆధారపడి ప్రజలకు వచ్చే ఒక అదనపు ఆదాయం. ద్రవ్యోల్భణం పెరిగినప్పుడు ఖర్చు కూడా పెరుగుతుంది. ఆ ఖర్చును తట్టుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే అలవెన్స్. ఇది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ 58 శాతం వరకు అందుతోంది. ఎప్పుడైతే డీఏ 50 శాతం దాటుతుందో ప్రభుత్వం దాన్ని బేసిక్ వేతనంలో విలీనం చేసే అవకాశం ఉంటుంది. దాంతో ఉద్యోగులలో అలాంటి ఆశలు పెరిగాయి. కానీ కేంద్రం ఈసారి స్పష్టంగా చెప్పేసింది.. డిఏను బేసిక్ జీతంలో కలిపే ఉద్దేశం లేదని వివరించింది.
బేసిక్ పేలో కలిపేస్తే ప్రయోజనాలు
డిఎ అనేది బేసిక్ పేలో కలిపేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బేసిక్ ఎప్పుడు పెరుగుతుందో అలవెన్సులు కూడా అంతే స్థాయిలో పెరుగుతాయి. అలాగే పిఎఫ్ కూడా పెరుగుతుంది. ఇక గ్రాట్యుటీ, పెన్షన్ వంటి రిటైర్మెంట్ ప్రయోజనాలు కూడా భారీగా పెరుగుతాయి. అందుకే చాలామంది ఉద్యోగులు డిఏను, బేసిక్ జీతంలో విలీనం చేయాలని ఆశిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని చెప్పేసింది. దీంతో ఎంతోమంది ఉద్యోగులు కాస్త నిరాశకు గురయ్యారు. కాకపోతే ఎనిమిదవ పే కమిషన్ నోటిఫై అయింది. కాబట్టి వచ్చే ఏడాది కచ్చితంగా జీతం పెరుగుతుందని ఆశపడుతున్నారు.

