ఆవు పేడకు విదేశాల్లో ఇంత డిమాండ్ ఉందా? తక్కువ ఖర్చుతో రూ.కోట్లు సంపాదించే వ్యాపారం
ఆవు పేడని మన దేశంలో ఉపయోగించడం తగ్గించేశాం. కాని దీనిలో విశేషాలు తెలుసుకొని విదేశాలు వాడటం ప్రారంభించాయి. ఎంతలా అంటే మన దేశం నుంచి వేల టన్నుల్లో ఎగుమతి చేసేంతలా. మీరు విన్నది నిజమే. భారతదేశం నుంచి ఆవు పేడ కావాలని విదేశాలు భారీగా ఆర్డర్లు పెడుతున్నాయి. దీంతో మన దేశంలో ఆవు పేడ ధర కూడా పెరిగింది. మరి విదేశాల్లో ఈ ఆవు పేడను ఎందుకు ఉపయోగిస్తున్నారో తెలుసుకుందాం రండి.
అసలు పేడ అంటేనే చిరాకుపడతాం కదా.. ఎక్కడైనా కనిపిస్తే ముక్కు మూసుకొని పక్కనుంచి తప్పించుకొని వెళ్లిపోతాం. కాని ఆవు పేడ మీకు రూ.కోట్లు కురిపించే వ్యాపారంగా మారుతుందని ఎప్పుడైనా ఊహించారా? మీరు సరిగ్గా ప్లాన్ చేస్తే ఆవుపేడను విదేశాలకు ఎగుమతి చేసి రూ.కోట్లు సంపాదించవచ్చు. అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం.
ఆవు పేడతో అనేక ఉపయోగాలు ఉన్నాయి. భారతదేశంలో ఒకప్పుడు మట్టి ఇళ్లు ఉన్నప్పుడు ఆవుపేడతో అలికి ఇంటిని శుభ్రంగా ఉంచుకొనే వారు. ఆవు పేడతో పిడకలు చేసి పొయ్యిపై వేడి నీళ్లు కాచుకోవడానికి, వంట చేయడానికి కూడా ఉపయోగించేవారు. ఆవు పేడను ఇంటి అవసరాలకు ఉపయోగించడం ఆ కాలంలో ఆరోగ్యంగా భావించేవారు. సైంటిఫిక్ గా కూడా ఆవుపేడలో ఎన్నో దివ్యౌషదాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అందుకే విదేశాల్లో ఆవుపేడకు డిమాండ్ పెరిగింది. దీంతో భారతదేశం నుండి దాని ఎగుమతి పెరుగుతోంది. ఆవుపేడకు మంచి ధర కూడా లభిస్తోంది.
గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఆవు పేడ ఎగుమతి వేగంగా పెరుగుతోంది. అనేక దేశాలకు భారతీయ ఆవు పేడ ఎగుమతి అవుతోంది. ఈ దేశాలు ఆవు పేడను అనేక విధాలుగా ఉపయోగిస్తున్నాయి. ఆ దేశాల్లో కువైట్, అరబ్ దేశాలు ముందు వరుసలో ఉన్నాయి.
ఆవు పేడను కువైట్, అరబ్ దేశాలు పొడి రూపంలో వ్యవసాయం కోసం ఉపయోగిస్తున్నాయి. ఆవు పేడ పొడిని ఖర్జూరం మొక్కల పెంపకంలో ఎరువుగా వాడుతున్నాయి. ఈ పొడిని మొక్కలకు వేయడం వల్ల ఖర్జూరం బాగా నాణ్యంగా పెరుగుతుందని ఈ దేశాల వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి కనుగొన్నారు.
ఖర్జూరంలో ఆవు పేడ పొడిని ఉపయోగించడం వల్ల పండ్ల పరిమాణం పెరిగి, దిగుబడి కూడా గణనీయంగా పెరుగుతోందని గుర్తించారు.
ఖర్జూర దిగుబడిని పెంచడానికి కువైట్ వంటి అరబ్ దేశాలు భారతదేశం నుండి ఆవు పేడను పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నాయి. ఆయిల్స్, నేచురల్ గ్యాసెస్ అధికంగా ఉన్న అరబ్ దేశాలు ఖర్జూర ఉత్పత్తిని పెంచడానికి ఆవు పేడను ఉపయోగిస్తున్నాయి. ఇటీవల కువైట్ 192 మెట్రిక్ టన్నుల ఆవు పేడను భారతదేశం నుండి కావాలని ఆర్డర్ చేసింది.
భారతదేశం నుండి ఎగుమతి అయిన ఆవు పేడకు విదేశాల్లో ఉన్న డిమాండ్ ను బట్టి ధర లభిస్తోంది. ప్రస్తుతం కువైట్, అరబ్ దేశాల్లో ఒక కిలో రూ.30 నుండి రూ.50 వరకు ధర పలుకుతోంది.
వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా కలిగిన భారతదేశంలో పశువుల సంఖ్య కూడా చాలా ఎక్కువ. భారతదేశంలో దాదాపు 30 కోట్ల పశువులు ఉన్నాయని ఓ అంచనా. వీటి ద్వారా ప్రతిరోజూ దాదాపు 30 లక్షల టన్నుల ఆవు పేడ లభిస్తుంది. మీరు వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉంటే ఆవు పేడను విదేశాలకు ఎగుమతి చేస్తే డిమాండ్ ను బట్టి కోట్లు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.