ఫారిన్ లో మన రూపాయి చెల్లుతుందా చెల్లదా..?
విదేశాల్లో భారత కరెన్సీ రూపాయి చెల్లుతుందా? రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు ఏం చెబుతున్నాయి? అసలు ఈ క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్ ఏమిటి? అనేది తెలుసుకుందాం.

Indian Rupee
డాలర్... ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే కరెన్సీ. ముఖ్యంగా దేశాల మధ్య ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా డాలర్స్ లోనే జరుగుతాయి. ఇక అమెరికాతో పాటు మరికొన్ని దేశాల్లో కూడా డాలర్ ను వినియోగిస్తుంటారు. ఇలా కరెన్సీని ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అంత విలువ వుంటుంది. అలాగే దేశాలమధ్య ఎగుమతులు, దిగుమతులు కూడా కరెన్సీ విలువను ప్రభావితం చేస్తాయి.
ఓ దేశ ఆర్థిక పరిస్థితిని బట్టి అక్కడి కరెన్సీ విలువ వుంటుంది. ఇలా అగ్రరాజ్యం అమెరికా కరెన్సీ డాలర్ ను వరల్డ్ మార్కెట్ లో ఎక్కువగా ఉపయోగిస్తుండటంతో దాని విలువ రోజురోజుకు పెరుగుతోంది. ఇదే ఫార్ములాను ఇండియా కూడా ఉపయోగించే యోచనలో వుంది. తాజాగా రిజర్వ్ ఆఫ్ ఇండియా (RBI) ఇలాంటి నిర్ణయమే తీసుకుంది.
ప్రస్తుతం ఇండియన్ కరెన్సీ రూపాయి రోజురోజుకు మరింత పతనం అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రూపాయి విలువ ఆల్ టైమ్ గరిష్టానికి చేరింది... రూపాయితో పోలిస్తే డాలర్ విలువ 86.70 ఎక్కువగా వుంది. దీంతో రూపాయి మరింత క్షీణించకుండా ఆర్బిఐ చర్యలు చేపట్టింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత మంగళవారం నిబంధనలను సరళతరం చేస్తూ కీలక ప్రకటన చేసింది. రూపాయి వాడకాన్ని ప్రోత్సహించేందుకు క్రాస్ బార్డర్ లావాదేవీల్లో మార్పులు చేపట్టింది. ఈ మేరకు పలు దేశాలతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు.
Cross Border Transactions
క్రాస్ బార్డర్ లవాదేవీలు అంటే ఏమిటి? :
వేరువేరు దేశాల్లోని వారి మధ్య జరిగే లావాదేవీలనే క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్ అంటారు. వ్యక్తులు, కంపనీలు, బ్యాంకులు, సెటిల్ మెంట్ సంస్థలు ఈ క్రాస్ బోర్డర్ లావాదేవీలో పాల్గొంటారు. చెల్లింపుదారులు, గ్రహీతలు వేరువేరు దేశాల్లో వుంటారు...వారిమధ్య లావాదేవీలు జరుగుతాయి...కాబట్టి క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్ దేశాలను ప్రపంచీకరణ దిశగా నడిపిస్తాయి.
ఆ క్రాస్ బోర్డర్ లావాదేవీల వల్ల కంపనీల ఖర్చులు ఆదా అవుతాయి. అలాగే ఆర్థిక నియంత్రణ జరుగుతుంది... సైబర్ ప్రమాదాలు కూడా తగ్గించవచ్చు. ఇక ఈ క్రాస్ బార్డర్ లావాదేవీల వల్ల పారదర్శకత కూడా పెరుగుతుంది.
అయితే ఈ సరిహద్దు చెల్లింపుల నిర్వహణ సవాళ్లతో కూడుకున్నది. రెండు దేశాల్లో వేరువేరు ఆర్థిక నిబంధనలు వుంటాయి... కాబట్టి ఈ క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్ కు సమయం పడుతుంది. అంతేకాదు రుసుములు కూడా చాలా ఎక్కువగా వుంటాయి.
RBI
భారత్ తో క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్ ఒప్పందాలు కలిగిన దేశాలు :
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే పలు దేశాలతో ఈ క్రాస్ బార్డర్ టాన్సాక్షన్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా, మాల్దీవ్స్ దేశాలకు చెందిన సెంట్రల్ బ్యాంక్స్ అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది ఆర్బిఐ. అంటే ఈ దేశాల్లో లోకల్ కరెన్సీతో పాటు ఇండియన్ రూపాయిను కూడా లావాదేవీల కోసం ఉపయోగించవచ్చు.
అంతర్జాతీయ వాణిజ్యంలో ఇండియన్ రూపాయి వాడకాన్ని ప్రోత్సహించేందుకు 2022 జూలైలో స్పెషల్ రూపీ వోస్ట్రో అకౌంట్ (SRVA) ను ప్రవేశపెట్టారు. అనేక విదేశీ బ్యాంకులు భారతదేశంలోని బ్యాంకులతో SRVAలను ప్రారంభించాయి.
FEMA నిబంధనలను కూడా ఆర్బిఐ సరళీకృతం చేసింది. దీంతో భారతదేశం వెలుపల అంటే విదేశాల్లో నివసించేవారు కూడా రూపాయల్లోనే సులభంగా ట్రాన్సాక్షన్ చేయవచ్చు.అలాగే ఇండియాలో వుండేవారు విదేశీయులతో ఇలాగే లావాదేవీలు జరపవచ్చు. ఇది భారతదేశంలో విదేశీ పెట్టుబడులకు ఎంతో ఉపయోగకరంగా వుంటుంది.