- Home
- Business
- దీపావళి నుంచి మార్కెట్లోకి ఒకప్పటి కాంపా కోలా రీఎంట్రీ, వింటేజ్ డ్రింక్‌ను సొంతం చేసుకున్న రిలయన్స్
దీపావళి నుంచి మార్కెట్లోకి ఒకప్పటి కాంపా కోలా రీఎంట్రీ, వింటేజ్ డ్రింక్‌ను సొంతం చేసుకున్న రిలయన్స్
ఢిల్లీలోని శంకర్ మార్కెట్ వెలుపల శిథిలావస్థలో ఉన్న ఎర్రటి ఇటుకలు ఉన్న భవనాన్ని నిశితంగా పరిశీలిస్తే ఇప్పటికీ గోడపై ఒక సీసా చిత్రం ఉంది, దాని ప్రక్కన 'కాంపా' అని ఐదు అక్షరాలు ఉంటాయి.అయితే తాజాగా మూత పడిన కాంపా కోలా దీపావళి నుంచి మార్కెట్లోకి రీఎంట్రీ ఇవ్వనుంది.

సరిగ్గా 1999లో, ఢిల్లీలో స్థానిక పానీయమైన కాంపా కోలా ఉత్పత్తి నిలిపివేశారు. అయితే ఈ వారం ప్రారంభంలో, రిలయన్స్ సహకారంతో కాంపా కోలా మళ్లీ వార్తల్లోకి రాబోతోంది. రిలయన్స్ క్యాంపా కోలా బ్రాండ్ ను ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ నుండి కొనుగోలు చేసింది.
దీపావళి నాటికి జాతీయ స్థాయిలో ఐకానిక్, ఒరిజినల్, లెమన్ అనే మూడు ఫ్లేవర్లతో ఈ డ్రింకును పునఃప్రారంభించాలని యోచిస్తోంది. ఈ బ్రాండ్ చైన్ సొంత స్టోర్‌లతో పాటు స్థానిక కిరాణా దుకాణాల ద్వారా కూడా పంపిణీ చేయనున్నట్లు, ఒక ప్రముఖ వార్తా సంస్థ నివేదించింది.
ఢిల్లీలోని లే మెరిడియన్ హోటల్‌ను కూడా కలిగి ఉన్న ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ 1970ల చివరలో కాంపా కోలాను ప్రారంభించింది. 1977లో అప్పటి జనతా పార్టీ ప్రభుత్వం విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించినందుకు కోకాకోలాను నిశేధించింది. అయితే IBMతో సహా ఇతర బహుళజాతి సంస్థలు కూడా దేశాన్ని విడిచిపెట్టి పోయాయి.
వాస్తవానికి, ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ మొదటిసారిగా కోకా-కోలాను 1949లో భారతదేశంలో ప్రారంభించింది, భారతదేశంలో కోకాకోలా ఏకైక లైసెన్స్ కలిగిన తయారీదారు, పంపిణీదారుగా ప్యూర్ డ్రింక్స్ అవతరించింది. ఇక 1977 తర్వాత దాదాపు 15 ఏళ్ల పాటు ఢిల్లీలో క్యాంపా కోలా శీతల పానీయం మంచి సేల్స్ సాధించింది. కోకా కోలా బ్యాన్ తర్వాత ఈ క్యాంపా కోలా బ్రాండ్ తక్షణమే హిట్ అయింది. ఈ డ్రింక్ ను ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా 50కి పైగా ఫ్యాక్టరీల్లో తయారు చేసేవారు.
అయితే 1992 ఆర్థిక సంస్కరణల అనంతరం దేశంలోకి కోకాకోలా 1993లో మరోసారి అడుగుపెట్టింది. ఈ సారి కోకా కోలా బలమైన దేశీయ బ్రాండ్స్ అయిన థమ్సప్ లాంటి వాటిని కొనుగోలు చేసింది. దీంతో కోకా కోలా మార్కెట్ పుంజుకోవడంతో, ఒక్క సారిగా దేశీయ కాంపా కోలా అమ్మకాలు కుదేలు అయ్యాయి.బహుళ జాతి కంపెనీ అయిన కోకాకోలా మార్కెటింగ్ స్ట్రాటజీ ముందు క్యాంపా కోలా నిలవలేకపోయింది.