ఈ టిప్స్ పాటిస్తే మీ ప్రాపర్టీ హాట్ కేక్‌లా అమ్ముడైపోతుంది
మీరు మీ ప్రాపర్టీని అమ్మాలని అనుకుంటున్నారా? ఆగండి.. ఇలా చేస్తే మీ ఆస్తి విలువ పెరిగి, మార్కెట్ లో హాట్ కేక్ లా అమ్ముడైపోతుంది. అప్పుడు అమ్మితే ఎక్కువ లాభం వస్తుంది. ఆ టిప్స్ ఏంటో వివరంగా తెలుసుకుందాం రండి.
చాలా మంది ఆస్తులు సంపాదించడానికి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడతారు. భవిష్యత్తులో వాటిని అమ్మాలనే ఆలోచనతో పెట్టుబడి పెట్టేవారు కూడా చాలామంది ఉంటారు. అవసరమైనప్పుడు పెద్ద మొత్తంలో డబ్బును త్వరగా సంపాదించడానికి రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టడం మంచి ఆలోచన. పిల్లల పెళ్లి, చదువు, వైద్యం వంటి ఖర్చులకు ఉపయోగపడుతుందన్న ఆలోచనతోనూ చాలా మంది రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టి స్థలాలు, ఇళ్లు కొంటుంటారు.
అలా సంపాదించిన ఆస్తిని అవసరాలు తీర్చుకోవడానికి అమ్ముతుంటారు. అయితే మీ ప్రాపర్టీని అమ్మే ముందు కొన్ని పనులు చేస్తే మీ ఆస్తి విలువ అమాంతం పెరుగుతుంది. ఇలా మీ ప్రాపర్టీ విలువ పెరగాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
రిపేర్లు చేయిస్తే కొత్త కళ వస్తుంది
మీరు కోరుకున్న ధరకు మీ ఇల్లు అమ్మాలంటే ముందుగా మీరు మరమ్మతులు చేయించాలి. ఇల్లు ఎక్కడైతే పాడైందో గుర్తించి బాగు చేయించాలి. లోపల, బయట గోడలకు మళ్లీ రంగులు వేయించాలి. ప్లాస్టర్, టైల్స్ లేదా ఫ్లోరింగ్ లో ఏమైనా దెబ్బతిన్నట్లయితే వాటిని కూడా బాగుచేయించాలి. బాల్కనీలో గార్డెన్ ఉంటే దానిని అందంగా మార్చండి. కిచెన్, బాత్రూమ్ లను కూడా శుభ్రంగా ఉంచేలా రిపేర్లు చేయించండి. లేటెస్ట్ మోడల్ కిచెన్, బాత్రూమ్ లు ఉండటం వల్ల మీ ఆస్తి విలువ పెరుగుతుంది.
సోలార్ ప్యానెల్ చాలా ఉపయోగం
మీరు అమ్మాలనుకున్న ఇల్లు, స్థలం ఏదైనా అందులో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోండి. ఇళ్లకు సరఫరా చేసే విద్యుత్ కంటే సోలార్ విద్యుత్ చాలా చౌకగా లభిస్తుంది. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వ పథకాల ద్వారా సబ్సిడీ కూడా పొందవచ్చు. ఇల్లు కొనేవారు సోలార్ పవర్ ఉన్న ఇంటిని కొనడానికి ఆసక్తి చూపుతారు. ఒకవేళ వారు సోలార్ పవర్ మాకు వద్దు అంటే వాటిని అక్కడి నుంచి తీసివేసి వేరే చోట కూడా వాడుకోవచ్చు.
సెపరేట్ గది ఏర్పాటు చేయండి
అదనపు గదులు నిర్మించడం లేదా ఒక గదిని హోమ్ ఆఫీస్ గా మార్చడం ద్వారా మీ ఆస్తి విలువ పెరుగుతుంది. COVID 19 తర్వాత చాలా మంది వర్క్ ఫ్రం హోమ్ చేసే వెసులుబాటును కోరుకుంటున్నారు. అందువల్ల సెపరేట్ గది ఉంటే మీ ప్రాపర్టీ విలువ పెరుగుతుంది. అదేవిధంగా గ్యారేజ్ లేదా పార్కింగ్ స్థలం ఉంటే దానిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఇల్లు ఎలాగో అమ్మేస్తున్నాం కదా అని లైట్లు పనిచేయకపోతే అలాగే వదిలేయద్దు. వైరింగ్ అంతా బాగుందని తెలియాలంటే లైట్లు అన్ని వెలుగుతున్నాయని తెలియడానికి అవి పనిచేయాలి. అందుకే లైట్లు, స్విచ్ లు, ఫ్యాన్లు సరిగ్గా పనిచేస్తున్నాయా అని కూడా చూసుకోండి. వీటిలో ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే ఖర్చుకు వెనకాడకుండా చేయించండి.
రక్షణ చాలా ముఖ్యం
ఆస్తులు కొనే ప్రతి ఒక్కరికీ భద్రత అనేది ప్రధాన ముఖ్యమైన విషయం. మీ ఇల్లు లేదా స్థలం సెక్యూర్ ప్లేస్ లో ఉందని కొనేవారు నమ్మాలంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించండి. అదేవిధంగా మెయిన్ డోర్ వద్ద స్మార్ట్ లాక్ లు, బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ వంటివి ఉండటం వల్ల ఇంటి విలువ మరింత ఆకర్షణీయంగా మారుతుంది. ఫైనల్ గా మార్కెట్ రేట్ ను బట్టే మీ ప్రాపర్టీ ధరను నిర్ణయించండి. తక్కువ చేసినా మీ ప్రాపర్టీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుంటారు. ఎక్కువ చెబితే కొనడానికి ముందుకు రారు. అందుకే కరెక్ట్ రేట్ చెప్పండి.