ఆపిల్ నుంచి రెండు మడతపెట్టే ఫోన్లు.. మార్కెట్ లోకి ఎప్పుడంటే..
సెల్ ఫోన్ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త రకమైన ఫోన్లు ప్రత్యక్షమవుతుంటాయి. సామ్ సంగ్, మోటోరోలా, వివో, రియల్ మీ, ఇలా అనేక కంపెనీలు తమ వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఇప్పటికే ఉన్న వాటికి కొత్త వెర్షన్స్ తీసుకొస్తుంటాయి. అయితే ఆపిల్ కంపెనీ మాత్రం ఆలస్యంగానైనా చక్కటి ఫ్యూచర్స్ ఉన్న ఫోన్లు తయారుచేస్తుంటుంది. ఇప్పుడు కొత్తగా రెండు మడతపెట్టే ఫోన్లను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇవి ఎప్పడు మార్కెట్లో అందుబాటులోకి వస్తాయో తెలుసుకుందాం..
సామ్‌సంగ్, గూగుల్ వంటి ప్రాచుర్యం పొందిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఇప్పటికే మడతపెట్టే స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్ లోకి విడుదల చేశారు. అయితే ఆపిల్ ఇంకా ముందడుగు వేయలేదు. ఆపిల్ విశ్లేషకుడు జెఫ్ పు(Jeff Pu) ఇచ్చిన కొత్త నివేదిక ప్రకారం, పూర్తి స్క్రీన్ ఐప్యాడ్/మాక్బుక్ మడతపెట్టే(folding) పరికరం మరియు మడతపెట్టే ఫ్లిప్ ఐఫోన్‌ను తయారు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇవి మార్కెట్ లోకి వచ్చాక ఆండ్రాయిడ్ ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్‌లతో పోటీపడనున్నాయి.
మార్కెట్ లో ఇప్పటికే ఫేమస్ అయిన ఐప్యాడ్, మాక్బుక్ మోడల్ లను ఆపిల్ కంపెనీ తీసుకురానుంది. ఇవి ఫోల్డ్ చేసినప్పుడు 18.8-అంగుళాల ప్రధాన డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. ఆపిల్ విశ్లేషకుడు జెఫ్ పు(Jeff Pu) తెలిపిన వివరాల ప్రకారం ఆపిల్ తన ఫోల్డింగ్ ఐఫోన్ కోసం సామ్‌సంగ్‌తో సరఫరా ఒప్పందం కుదుర్చుకుంది. ఇది సామ్‌సంగ్ గెలాక్సీ ఫ్లిప్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు సమానంగా పైభాగం-డౌన్ మడతపెట్టే డిజైన్ కలిగి ఉండే అవకాశం ఉంది.
ఆపిల్ ఫోల్డింగ్ ఫోన్లు క్లామ్‌షెల్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఇటీవల విడుదలైన మోటరోలా రేజర్ 50 అల్ట్రా మరియు సామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 మాదిరిగా కవర్ స్క్రీన్ కూడా ఉంటుంది. గత నివేదికల ప్రకారం ఆపిల్ ఫోల్డింగ్ ఫోన్లు 2025తోనే మార్కెట్లోకి వస్తాయని ప్రచారం జరిగింది. వాటిని జెఫ్ పు(Jeff Pu) ఖండించారు. ఈ స్మార్ట్‌ఫోన్లు 2026 ముగిసేలోపు విడుదల చేయవచ్చని తెలిపారు.