యాపిల్ విడుదల చేయనున్న ఫోల్డ్ చేయగల ఐప్యాడ్ ఇంత పెద్దదా?
టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ తొలిసారి ఫోల్ట్ చేయగల ఐప్యాడ్ ని తయారు చేస్తోంది. అయితే ఇది అతి పెద్ద స్క్రీన్ తో రాబోతోందని మార్కెట్లో వార్త హాల్ చల్ చేస్తోంది. ఇప్పటి వరకు ఉన్న ఐప్యాడ్ లలో అన్నింటికంటే యాపిల్ ఐప్యాడ్ స్కీన్ పెద్దదిగా ఉంటుందని సమాచారం. ఈ ఫోన్ గురించి తాజా విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం.
గత కొన్నేళ్లుగా యాపిల్ ఐప్యాడ్‌లు పరిమాణంలో పెరుగుతూ వస్తున్నాయి. ఇటీవల బ్లూమ్‌బెర్గ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం యాపిల్ విడుదల చేయనున్న మడతపెట్టే(Foldable) ఐప్యాడ్ ఓపెన్ చేసినప్పుడు 18.8 అంగుళాల డిస్‌ప్లేగా మారుతుందట. అంతేకాకుండా ఇది టచ్ స్క్రీన్ గానూ పనిచేస్తుందట. అంటే ఇది అతిపెద్ద మ్యాక్‌బుక్ ప్రో కంటే పెద్దదిగా ఉంటుంది.
ఈ ఐప్యాడ్ యాపిల్ తొలి ఫోల్డబుల్ పరికరం. ఇది ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న రెండు ఐప్యాడ్‌లను పక్కపక్కనే పెడితే ఎంత ఉంటుందో అంత పెద్దదిగా ఉంటుందట. చాలా మడతపెట్టే పరికరాల్లో ఉండే క్రీజ్ సమస్య ఉంటుంది. యాపిల్ ఈ సమస్యకు పరిష్కారం కనుగొందని నిపుణులు చెబుతున్నారు. కానీ ఈ ఐప్యాడ్ 2026లోనే విడుదల అవుతుందని తెలుస్తోంది.
ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఫోల్డబుల్ ఐప్యాడ్ లో మరిన్ని ఫీచర్స్ యాడ్ చేయనున్నారు. అందువల్ల ఇది మార్కెట్ లోకి రావడానికి మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ పరంగా ఇది iPadOS, macOS రెండింటి నుంచి అనేక ఫీచర్లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో నేటివ్ మాకోస్ యాప్‌లు కూడా పనిచేస్తాయి.
ప్రస్తుత ఐప్యాడ్ ప్రో మాదిరిగానే మడతపెట్టే ఐప్యాడ్ OLED స్క్రీన్‌తో వస్తుంది. ఖచ్చితమైన హార్డ్‌వేర్ గురించి సమాచారం లేనప్పటికీ ఇది విడుదలయ్యే సమయానికి తాజా M సిరీస్ చిప్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. తాజా ట్రెండ్‌లను దృష్టిలో ఉంచుకుని ఇది 16GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉండొచ్చు.
మార్కెట్లో ఉన్న 13 అంగుళాల ఐప్యాడ్ ప్రో ధర రూ.99,900 నుంచి ప్రారంభమవుతుంది. దీన్ని బట్టి గమనిస్తే మడతపెట్టే(ఫోల్డబుల్) ఐప్యాడ్ కనీసం ఆ ధరకు రెట్టింపు ఉంటుందని భావించవచ్చు.