AI Robot Incident: చైనాలో మనుషులపై దాడికి ట్రై చేసిన రోబో!
AI Robot Incident: చైనాలో జరిగిన రోబో ఎగ్జిబిషన్‌లో ఓ మనిషి రూపంలోని ఏఐ రోబో ఒక్కసారిగా సందర్శకులపైకి దూసుకొచ్చింది. ఇది సాంకేతిక లోపమా? లేక రోబోకి చిరాకు వచ్చి సందర్శకులపై దాడికి ప్రయత్నించిందా అనేది ఇంకా తెలియలేదు. ఈ సంఘటనతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్(AI) నిజంగా మానవ జాతి అభివృద్ధికి సహకరిస్తోందా? లేక మనుషులను అంత చేసేందుకు మన శత్రువును మనమే తయారు చేసుకుంటున్నామా? అర్థం కాని ప్రశ్నగా మారింది.

‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్(AI) మానవ జాతి అంతానికి మొదటి అడుగులా అనిపిస్తోంది’. ‘ఇవి రోబోలు కావు.. మనషుల ప్రాణాలు తీసే జాలి, దయ లేని క్రూరమైన యంత్రాలు.’ ఇలా నెటిజన్లు రోబోల విషయంలో సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాలో జరిగిన రోబో ఎగ్జిబిషన్‌లో ఏఐ రోబో ఒకటి సందర్శకులపైకి దూసుకొచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన వారంతా ఆశ్ఛర్యంతో పాటు భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈశాన్య చైనాలో ఫిబ్రవరి 9న జరిగిన రోబో ఎగ్జిబిషన్‌లో యూనిట్రీ రోబోటిక్స్ కంపెనీకి చెందిన హ్యూమనోయిడ్ రోబో ఒకటి పాల్గొంది. ఈ రోబో మనుషుల కదలికలను అనుకరించగలదు. చిన్న చిన్న మాటలు కూడా మాట్లాడగలదు. కానీ ఒక్కసారిగా ఊహించని విధంగా ఆ రోబో సందర్శకులపైకి దూసుకొచ్చింది. అయితే అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి రోబోను అదుపు చేశారు. ఈ సంఘటన ఎగ్జిబిషన్‌లో కలకలం రేపింది.
సాంకేతిక లోపమా? కాదా?
ఇది కేవలం రోబోలో ఏర్పడిన సాంకేతిక లోపం మాత్రమేనని ఎగ్జిబిషన్ నిర్వాహకులు ప్రకటించారు. అయితే పూర్తిగా పరీక్షలు చేయకుండా జనాలు ఉన్న ప్రాంతంలో హ్యూమనాయిడ్ రోబోను ఎలా ఉంచారని సందర్శకులు ప్రశ్నించారు. ఎగ్జిబిషన్ కు తీసుకొచ్చిన రోబోలకు భద్రతా పరీక్షలు సరిగ్గా చేయలేదంటూ వారు ఆరోపించారు. సాఫ్ట్‌వేర్ బగ్ కారణం ఒకటే కాదని కొందరు టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నెటిజన్ల ఆందోళన
ఏఐ టెక్నాలజీ అభివృద్ధి మానవ మేధస్సుకు సహకరిస్తున్నట్లు కనిపిస్తున్నా దాని వెనుక కనిపించని ప్రమాదం దాగి ఉందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికల్లో పోస్టులు పెడుతున్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని భవిష్యత్తులో ఇంతకంటే భయంకరమైన సంఘటనలు చూడాల్సి వస్తుందని చాలామంది భయం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటిదే ఇంకో సంఘటన
ఏఐ టెక్నాలజీ వైద్యం, విద్య, ఉత్పత్తి వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. కానీ ఈ టెక్నాలజీ అభివృద్ధి మానవజాతికి ప్రమాదమా అంటే అవుననే చైనా సంఘటన తెలియజేస్తోంది. రోబోలో తలెత్తింది సాంకేతిక లోపమే అనుకున్నా మనుషులపై దాడికి ప్రయత్నించిందంటే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరగొచ్చు.
ఇటీవలే రెండు వేర్వేరు డివైజస్ లలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ అసిస్టెంట్ టూల్స్ కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకున్న వీడియో కూడా నెట్టింట వైరల్ అయ్యింది. వీటిని బట్టి చూస్తే ఏఐతో భవిష్యత్తు భయానకంగానే ఉంటుందేమోనని అనిపిస్తోంది. చైనాలో జరిగిన రోబో సంఘటన ఏఐ టెక్నాలజీలోని చీకటి కోణాన్ని బయటపెట్టింది.